Punjab: పోలీసుల సేవలు ప్రజల కోసం.. వీఐపీల కోసం కాదు.. ముఖ్యమంత్రి సంచలన ప్రకటన

|

May 28, 2022 | 4:34 PM

పంజాబ్(Punjab) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆప్(AAP) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించేందుకు....

Punjab: పోలీసుల సేవలు ప్రజల కోసం.. వీఐపీల కోసం కాదు.. ముఖ్యమంత్రి సంచలన ప్రకటన
Bhagawant Mann
Follow us on

పంజాబ్(Punjab) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆప్(AAP) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించేందుకు మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా పలువురు రాజకీయ ప్రముఖులు, మత పెద్దకు భద్రతను తొలగించింది. ఇలా 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఇప్పటికే ఆప్ సర్కార్.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రత తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో 184 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు మాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీతో పాటు మాజీ మంత్రులు మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, రాజ్‌ కుమార్‌ వెర్కా, భరత్ భూషణ్‌ అషు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. పోలీసులు సామాన్య ప్రజల కోసం పని చేయాలి గానీ వీఐపీలకు భద్రతా విధుల పేరుతో వారిని బాధపెట్టకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ అన్నారు.

గతంలో అవినీతి ఆరోపణల కారణంగా ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను మంత్రివర్గం నుంచి సీఎం భగవంత్ మాన్ తొలగించారు. ఒక్క పైసా అవినీతిని తమ ప్రభుత్వం సహించదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి మా పార్టీ (ఆప్) ఉద్భవించిందని గుర్తు చేశారు. ఈ విషయంలో పోలీసు విచారణకు కూడా ఆదేశించాను. ఇది జరిగిన కొద్దిసేపటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు సింగ్లాను అరెస్టు చేశారు. అంతే కాకుండా మాజీ ఎమ్మెల్యేల పింఛన్ విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై శాసనసభ్యులుగా ఎన్నిసార్లు ఎన్నికైనా.. ఇకపై ఒకేఒక్క పదవీకాలానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి