దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది. ఎక్కడ చూసినా మసక మసకగానే కనిపిస్తోంది. ఉదయం పదైనా సూర్యుడు కనిపించని పరిస్థితులున్నాయక్కడ. దీంతో నగరవాసులు నరకం చూస్తున్నారు. బయట అడుగు పెట్టాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. అంతలా ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తోందీ ఎయిర్ పొల్యూషన్. దీనికి తోడు పక్కనే ఉన్న పంజాబ్, హర్యానాలో తగలబెట్టిన పంట వ్యర్థాల నుంచి వస్తున్న కాలుష్యం ఢిల్లీని మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇటు కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినా, సుప్రీంకోర్టు పలుమార్లు సీరియస్ అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండట్లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కాలుష్య నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది.
పంట వ్యర్థాలను దహనం చేయాలంటే వణుకుపుట్టేలా జరిమానాలను రెట్టింపు చేస్తూ నిబంధనలను సవరించింది కేంద్ర ప్రభుత్వం. 30 వేల వరకూ జరిమానాను పెంచేసింది. కేంద్ర నిబంధనల ప్రకారం.. రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు 5 వేల రూపాయల జరిమానా విధించనున్నారు. రెండు నుంచి ఐదు ఎకరాల మధ్య ఉన్న వారికి 10 వేలు, ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు 30 వేల వరకూ జరిమానా విధించనున్నట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్, హర్యానా రైతులు ఎలా స్పందిస్తారు…? గతంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పలు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన రైతు సంఘాలు ఈ నిర్ణయంపై ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది….!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.