AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస? భారత్ మండపానికి ఎవరు ముందుగా వస్తారు? బ్రిక్స్ పూర్తి షెడ్యూల్ ఇదే!

న్యూఢిల్లీ వేదికగా జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మండపంలో జరిగే ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాలు, ఆహ్వానిత దేశాల నేతలు హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా పలువురు ప్రపంచ అధినేతలు ఢిల్లీకి రానున్నారు.

పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస? భారత్ మండపానికి ఎవరు ముందుగా వస్తారు? బ్రిక్స్ పూర్తి షెడ్యూల్ ఇదే!
Masoud Pezeshkian, Vladimir Putin, Xi Jinping
Balaraju Goud
|

Updated on: Sep 10, 2026 | 9:15 PM

Share

న్యూఢిల్లీ వేదికగా జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మండపంలో జరిగే ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాలు, ఆహ్వానిత దేశాల నేతలు హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా పలువురు ప్రపంచ అధినేతలు ఢిల్లీకి రానున్నారు. బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయాలు, ప్రముఖ హోటళ్లు, భారత్ మండపం, నేతల రాకపోకల మార్గాల్లో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పలు హోటళ్లకు ప్రత్యేక భద్రతా బృందాలను కేటాయించారు.

పుతిన్, షీ జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తారు?

విదేశీ నేతల కోసం ఢిల్లీలోని వివిధ ప్రముఖ హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు. తాజా మీడియా నివేదికల ప్రకారం.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ITC మౌర్యలో బస చేసే అవకాశం ఉంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తాజ్ ఫ్యాలెస్‌లో బస చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే భద్రతా కారణాల దృష్ట్యా వసతి ఏర్పాట్లపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఇక, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు కూడా ప్రత్యేక వసతి ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇండోనేషియా, ఇథియోపియా, కజకిస్తాన్ నేతలు ఒకే హోటల్‌లో బస చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులకు మరో హోటల్‌లో వసతి కల్పించినట్లు సమాచారం.

సెప్టెంబర్ 12న ఏం జరగనుంది?

అధికారిక కార్యక్రమం ప్రకారం సెప్టెంబర్ 12న మధ్యాహ్నం 2 గంటలకు బ్రిక్స్ సభ్య దేశాల నేతలు భారత్ మండపానికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2:35 గంటలకు “సమ్మిళిత ప్రపంచ పాలన – బహుపాక్షికతను బలోపేతం” అంశంపై సభ్య దేశాల నేతల క్లోజ్డ్ సెషన్ ప్రారంభమవుతుంది.

సాయంత్రం 4:25 గంటలకు నేతలు ‘Bharat Innovates’ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.

సాయంత్రం 5:05 గంటలకు ఫ్యామిలీ ఫొటో కార్యక్రమం, 5:10 గంటలకు సంయుక్త వృక్షారోపణ కార్యక్రమం ఉంటుంది.

రాత్రి 7:30 గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతలకు గాలా డిన్నర్ ఇవ్వనున్నారు.

సెప్టెంబర్ 13న భాగస్వామ్య దేశాల నేతలు

సెప్టెంబర్ 13న బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు, ఆహ్వానిత దేశాల నేతలు భారత్ మండపానికి చేరుకుంటారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:55 గంటలకు వారి రాక ప్రారంభమవుతుంది. 10:35 గంటలకు గ్రూప్ ఫొటో, 10:50 గంటలకు “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం” అనే అంశంపై ఓపెన్ సెషన్ జరగనుంది.

పుతిన్ ఢిల్లీ షెడ్యూల్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబర్ 11న ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక భేటీతో పాటు బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొనే కార్యక్రమాలు ఆయన షెడ్యూల్‌లో ఉన్నాయి. సెప్టెంబర్ 12న బ్రిక్స్ సదస్సులో పాల్గొని ‘Bharat Innovates’ ఎగ్జిబిషన్‌ను సందర్శించే అవకాశం ఉంది. అలాగే ఇతర దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా ఉండనున్నాయి. సెప్టెంబర్ 13న బ్రిక్స్ ప్రధాన సమావేశాల్లో పాల్గొంటారు.

షీ జిన్‌పింగ్ రాకపై ఉత్కంఠ

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్ 12న భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఆయన రాక నేపథ్యంలో చైనా భద్రతా బృందాలు ఇప్పటికే ఢిల్లీలో ఏర్పాట్లు ప్రారంభించాయి. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఆయన భద్రతను పర్యవేక్షిస్తోంది. ఏడేళ్ల తర్వాత ఆయన భారతదేశంలో జరిపే తొలి పర్యటన ఇదే అవుతుంది. ముఖ్యంగా ఇరాన్‌తో అమెరికా వివాదంలో కూరుకుపోయిన ఈ సమయంలో జిన్‌పింగ్ భారత్ వస్తుండటం విశేషం.

పుతిన్, జిన్‌పింగ్‌ల పర్యటనలతో ఈసారి బ్రిక్స్ సదస్సుకు అంతర్జాతీయంగా మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా భారత్-రష్యా, భారత్-చైనా సంబంధాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఆహార-ఇంధన భద్రత, ఆరోగ్యం, విపత్తుల నిర్వహణ, కీలక సరఫరా వ్యవస్థలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

భారీ భద్రత.. హై అలర్ట్‌లో ఢిల్లీ

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. హోటళ్లు, విమానాశ్రయాలు, భారత్ మండపం, వీవీఐపీ రూట్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. NSG, ఢిల్లీ పోలీస్, ఇతర భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. యాంటీ డ్రోన్ వ్యవస్థలు, స్నైపర్లు, యాంటీ-సాబోటేజ్ బృందాలు కూడా కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మొత్తంగా.. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. పుతిన్, షీ జిన్‌పింగ్, పెజెష్కియాన్ సహా పలువురు కీలక నేతలు ఒకే వేదికపైకి రానుండటంతో.. బ్రిక్స్ సదస్సులో తీసుకునే నిర్ణయాలు, విడుదలయ్యే ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’పై అంతర్జాతీయ ఆసక్తి నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us