ప్రమాదంలో పేగులు బయటకు.. షర్టుతో ఒరిసిపట్టి 3 కి.మీ నడిచి ఇంటికెళ్లిన బాలుడు!

ఊహించని ప్రమాదంలో పొట్టలో గాయం కావడంతో పేగులు బయటకు వచ్చినా.. 11 ఏళ్ల బాలుడు ఏమాత్రం భయపడకుండా చూపిన ధైర్యం అతడి ప్రాణాలను కాపాడింది. బయటకు వచ్చిన పేగులను షర్టుతో కట్టుకుని రక్తస్రావం అవుతున్నా పట్టించుకోకుండా కాలినడకన ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి బైక్‌పై ఆరోగ్య కేంద్రానికి, అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

ప్రమాదంలో పేగులు బయటకు.. షర్టుతో ఒరిసిపట్టి 3 కి.మీ నడిచి ఇంటికెళ్లిన బాలుడు!
Boy Walks Home After Intestines Protrude In Accident

Updated on: Aug 21, 2026 | 9:52 AM

ఒడిశాలోని గంజాం జిల్లాలో ధారాకోట్‌ సమితిలోని మారుమూల తనార్జీపల్లి గ్రామానికి చెందిన చిన్ను మల్లిక్‌ (11) స్థానిక పాఠశాలలో చదువుతున్నాడు. ప్రతిరోజులాగే గత సోమవారం (ఆగస్ట్ 17) చిన్ను ఒంటరిగా సైకిల్‌పై కొండ మార్గంలో పాఠశాలకు బయలుదేరాడు. గ్రామం నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తూ సైకిల్‌ నుంచి కిందపడిపోయాడు. ఈ సమయంలో పొట్టలో పదునైన వస్తువు గుచ్చుకోవడంతో తీవ్ర గాయమైంది. గాయం కారణంగా పేగులు బయటకు వచ్చాయి. రక్తస్రావం అవుతున్నప్పటికీ చిన్ను ఏమాత్రం భయపడలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న చిన్ను బయటకు వచ్చిన పేగులను షర్టుతో జాగ్రత్తగా కట్టుకున్నాడు. అనంతరం సైకిల్‌ను అక్కడే వదిలేసి కాలినడకన ఇంటికి చేరుకున్నాడు.

బాలుడిని ఆ పరిస్థితిలో చూసిన తల్లి రంజితా మల్లిక్‌, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వెంటనే అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు బాలుడిని ద్విచక్ర వాహనంపై సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని బడగడ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు చిన్నును మెరుగైన వైద్యం కోసం బ్రహ్మపురలోని ఎమ్కేసీజీ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. బాలుడి పరిస్థితిని గమనించిన ఎమ్కేసీజీ పీడియాట్రిక్‌ సర్జరీ విభాగం సీనియర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ మానస్‌ రంజన్‌ దాస్‌ వెంటనే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. వైద్య బృందం సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి తొలుత బయటకు వచ్చిన, ఇన్‌ఫెక్షన్‌కు గురైన పేగులకు చికిత్స అందించింది. బాలుడికి రక్తం ఎక్కించిన అనంతరం సుమారు గంటన్నరపాటు ఆపరేషన్‌ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా..

ఆపరేషన్‌ విజయవంతం కావడంతో చిన్ను ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్‌ మానస్‌ రంజన్‌ దాస్‌ తెలిపారు. మరికొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన అనంతరం ఇంటికి పంపిస్తామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో చిన్ను చూపిన సమయస్ఫూర్తి, ధైర్యమే అతడి ప్రాణాలను కాపాడటంలో కీలకంగా మారిందని వైద్యులు పేర్కొన్నారు. తీవ్ర గాయంతో పేగులు బయటకు వచ్చినప్పటికీ భయపడకుండా ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం వల్ల సకాలంలో వైద్యం అందించగలిగామని తెలిపారు. చిన్ను చూపిన ధైర్యం, సాహసమే అతడికి కొత్త జీవితాన్ని ఇచ్చిందని వైద్యులు అభిప్రాయపడ్డారు.

Loading...
Unable to load recommendations.
Follow Us