అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ మసీదు, హాస్పటల్ పనులు వేగంగా సాగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టుకు ఓ స్వాతంత్య్ర సమరయోధుడి పేరు నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్‌లోని ధన్నీపూర్ గ్రామంలో ఉన్న ఐదెకరాల స్థలంలో మసీదు, హాస్పిటల్‌ను నిర్మించబోతున్నారు. ఈ నిర్మాణంకు స్వాతంత్య్ర సమరయోధుడు మౌల్వీ అహ్మదుల్లా షా ఫైజాబాదీ పేరు పెట్టాలని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (IICF) నిర్ణయించింది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ప్రాజక్టులో మసీదు, హాస్పిటల్, మ్యూజియం, రీసెర్చ్ సెంటర్, కమ్యూనిటీ కిచెన్ మొత్తం ప్రాజెక్ట్‌ను ఫైజాబాదీకి అంకితమివ్వనున్నట్లు ఐఐసీఎఫ్ ప్రకటించింది.
1857 తిరుగుబాటులో రెండేళ్ల పాటు అవధ్‌ను బ్రిటీషర్ల నుంచి కాపాడిన యోధుడు ఫైజాబాదీ. ఈయననే లైట్‌హౌజ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలుస్తారు. ఆయన అమరులైన రోజున ఈ ప్రాజెక్ట్ మొత్తానికీ ఫైజాబాదీ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ఐఐసీఎఫ్ సెక్రటరీ ఆథర్ హుస్సేన్ తెలిపారు.
గత జనవరిలో ఇక్కడి రీసెర్చ్ సెంటర్‌ను ఆయనకు అంకితమిచ్చారు. తొలి స్వాతంత్య్ర సమరం జరిగి 160 ఏళ్లయినా భారత చరిత్రలో ఫైజాబాదీకి తగిన గుర్తింపు దక్కలేదని అంటారు. 2019 నవంబర్‌లో సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ ఐదు ఎకరాల భూమిని మసీదు కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. సున్నీ వక్ఫ్ బోర్డు ఈ మసీదు నిర్మాణం కోసం ఐఐసీఎఫ్‌ను ఏర్పాటు చేసింది. అయితే మొఘల్ చక్రవర్తి బాబర్ పేరు మాత్రం దీనికి పెట్టకూడదని ఈ ట్రస్ట్ గతంలోనే నిర్ణయించింది.