ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీలను పరామర్శించిన కేంద్ర మంత్రులు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

|

Dec 19, 2024 | 3:11 PM

అంబేద్కర్‌కు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యపై ప్రతిపక్షాలు బుధవారం కేంద్ర ప్రభుత్వంపై దాడి చేశాయి. అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్‌తోపాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, డిఎంకె, ఆర్‌జెడి, లెఫ్ట్‌ పార్టీలు, శివసేన (యుబిటి) సహా దాదాపు అన్ని ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తడంతో సభా కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీలను పరామర్శించిన కేంద్ర మంత్రులు.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Minister Shivraj Chowhan Pralhad Joshi
Follow us on

పార్లమెంటు ఆవరణలో ఘర్షణ కారణంగా గాయపడిన భారతీయ జనతా పార్టీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి, మరో పార్టీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్‌ని ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చేర్చారు. ముగ్గురు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్వాల్, పీయూష్ గోయల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దురుసు ప్రవర్తనతో గాయపడిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సహా పలువురు సభ్యులతో కలిసి ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో బీజేపీ ఎంపీలను పరామర్శించారు. బీజేపీ ఎంపీల ఆరోగ్యంపై ప్రహ్లాద్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు

అసలే జరిగిందంటే, ఈరోజు పార్లమెంటు ఆవరణలో విపక్ష నేతలంతా నిరసనలు చేపట్టారు. పార్లమెంట్‌ హౌస్‌లోని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం కింద విపక్షాల ఎంపీలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రదర్శనలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఆ సమయంలోనే రాహుల్‌ పార్లమెంటులోకి వెళ్తూ తమపై దాడి చేశారని.. ఎంపీ సారంగి ఆరోపించారు. తనపై రాహుల్‌ గాంధీ దాడి చేయడంతో తలకు గాయమైందన్నారు. దీంతో ఈ వ్యవహారం సంచలనం రేపింది. ఈ గొడవలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగితో పాటు మరో పార్టీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్ కూడా గాయపడ్డారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలోని ఐసీయూలో ఉంచారు.

కాగా, ఈ ఘటనపై RML MS డాక్టర్ అజయ్ శుక్లా స్పందించారు ఇద్దరు ఎంపీలను ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్ ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరిన్ని వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇద్దరి తలకు గాయాలు కావడంతో ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రతాప్ సారంగికి గట్టి దెబ్బ తగలడంతో తీవ్ర రక్తస్రావం అయిందని వైద్యులు తెలిపారు. అందుకే కుట్లు వేయాల్సి వచ్చింది. ముఖేష్ రాజ్‌పుత్ స్పృహ కోల్పోయారు. కానీ ఇప్పుడు అతను స్పృహలో ఉన్నాడు. అయితే రక్తపోటు పెరిగింది. దీంతో ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు.

మరోవైప, ఈ ఘటనను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా ఖండించారు. ప్రతాప్ చంద్ర సారంగిని చూస్తే హృదయం చలించిపోయిందన్నారు. పార్లమెంటు చరిత్రలో ఇదో చీకటి రోజు. పార్లమెంటు గౌరవాన్ని తుంగలో తొక్కారన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చేస్తున్న గూండాయిజానికి మరో ఉదాహరణ అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇటువంటి ప్రవర్తన భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ఇప్పటి వరకు కనిపించలేదన్నారు. ఇలాంటి వారికి ప్రజాస్వామ్యంలో ఎలా ప్రవర్తించాలో శిక్షణ అవసరమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..