పేర్లు మారతాయి..కానీ ఆ ఉగ్రమూకల లక్ష్యం ఒక్కటే. భారత్‌లో విధ్వంసాలు సృష్టిస్తూ దేశాన్ని అన్ని విధాలుగా అస్థిరపర్చడమే ఆ ఉగ్రసంస్థల ఉమ్మడి ఎజెండా. నేరుగా సరిహద్దుల్లో భారత్‌తో తలపడలేని పాకిస్తాన్ వంటి శత్రు దేశాలు భారత్‌లోనే ఉగ్రవాద భావజాలాన్ని పెంచి పోషిస్తూ.. వారికి అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సాంకేతిక, ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. ఈ క్రమంలో లష్కర్-ఏ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైష్-ఏ-మహ్మద్, ఇండియన్ ముజాహిదీన్.. ఇలా ఎన్నో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు భారత్‌లో విధ్వంసాలకు ప్రయత్నించాయి. స్థానికంగా ఉన్నకొందరు యువకులనే మానవ వనరులుగా మార్చుకుని, ఉగ్రవాదం నూరిపోసి విధ్వంసాలు సైతం సృష్టించాయి.
ముంబై మారణహోమం, హైదరాబాద్ గోకుల్ చాట్ పేలుడు… ఇలా దేశవ్యాప్తంగా అనేక నగరాలపై ఉగ్రవాద రక్తపు మరకలు ఉన్నాయి. అయితే గత దశాబ్దకాలంగా భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ఈ తరహా విద్రోహ చర్యల్ని నిఘా సంస్థలు, భద్రతా బలగాలు ముందుగానే పసిగట్టి అడ్డుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కాశ్మీర్‌లో కేవలం భద్రతా బలగాలను, పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు చేస్తుంటాయి. కాశ్మీర్ వెలుపల సామాన్య పౌరులే లక్ష్యంగా భారీ ప్రాణనష్టం సృష్టించేందుకు విధ్వంస రచన చేస్తుంటాయి. ఈ తరహా దుశ్చర్యలను నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాలు ముందుగానే పసిగడితే భారీ విధ్వంసాలను అడ్డుకోవచ్చు. ఇప్పుడు తాజాగా అలాంటి ఉదంతమే దేశంలో చోటుచేసుకుంది. హిజ్బ్-ఉత్-తాహిర్ (HuT) పేరుతో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను చాపకింద నీరులా విస్తరిస్తున్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) గుర్తించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పోలీస్, భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్
దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ (HuT) నెట్‌వర్క్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అప్రమత్తమైంది. ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాద సంస్థ తర్వాత భారత్‌కు ఈ ఉగ్రవాద సంస్థ అతిపెద్ద ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన రెండు రోజుల ఉగ్రవాద వ్యతిరేక సదస్సులో ఈ సంస్థ దేశానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని NIA అభిప్రాయపడింది. దేశంలో ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో హిజ్బ్-ఉత్-తహ్రీర్ సంస్థకు స్లీపర్ సెల్స్ ఉన్నట్లు కేంద్ర ఏజెన్సీ అనుమానిస్తోంది. ఈ సంస్థ బంగ్లాదేశ్‌లోనూ చురుగ్గా కార్యాకలాపాలు సాగిస్తోంది. ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించింది. ఈ సంస్థ అనేక ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నదని, అమాయక యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపించడం, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరించడం వంటి కార్యాకలాపాలకు పాల్పడుతోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంస్థ జాతీయ భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తీవ్రమైన ముప్పుగా పేర్కొంది.
జిహాద్, ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడం ద్వారా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దేశాలను స్థాపించడమే హిజ్బ్-ఉత్-తాహిర్ (HuT) ఉగ్రవాద సంస్థ లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు, దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తోందని వెల్లడించింది. ఇందులో భారతీయ పౌరులను మతం పేరుతో ఆకట్టుకుంటూ మైండ్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మార్చుతోంది. ఇందుకోసం సామాజిక మాధ్యమాలను విస్తృతంగా ఉపయోగించుకుంటోందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ సంస్థతో సంబంధం ఉన్న పలువురు అనుమానిత ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. హిజ్బ్-ఉత్-తహ్రీర్ ప్రధాన కార్యాలయం లెబనాన్‌లో ఉంది. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడం కోసం పనిచేస్తోంది. తాజాగా ఈ సంస్థతో సంబంధం ఉన్న 17 మంది అనుమానిత ఉగ్రవాదులపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది.