తమిళనాడులో పార్టీ బలపడుతుంది అనుకుంటున్న సమయంలో వరుస షాక్ లు ఎదురవుతున్నాయి. సీనియర్ నటి బీజేపీలో కీలకంగా ఉంటున్న నటి గౌతమి తాడిమళ్ల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీని వీడడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని బీజేపీలోని కొందరు నేతలే చెబుతుండడం విశేషం. పార్టీలో గౌతమి ఎదుగుదలకు పదేపదే కొందరు అడ్డుపడ్డారు అనేది కూడా చాలామంది చెబుతున్న మాట. గౌతమి పార్టీని వీడిన తర్వాత తమిళనాడు బిజెపిలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల బీజేపీ నుంచి వరుసగా కీలక నేతలందరూ దూరమవుతున్నారు. అవన్నీ గౌతమి రాజీనామా తర్వాత చర్చకు వస్తున్నాయి.
నటి గాయత్రి రఘురామ్ చాలా కాలంగా బీజేపీలో కీలకంగా పనిచేస్తున్నారు. పార్టీలో కొందరు నేతల వైఖరి నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చారు.. గాయత్రి రాజీనామా చేయక ముందు తమిళనాడు బిజెపి చీఫ్ అన్నామలై ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండా తనపై వేటు వేయడాన్ని కూడా గాయత్రి తప్పుబట్టారు. ఇక బీజేపీలో సుదీర్ఘంగా పని చేసిన సి.టి.ఆర్ నిర్మల్ కుమార్ కూడా పార్టీకి ఈ మధ్యనే రాజీనామా చేశారు. బిజెపి తమిళనాడు సోషల్ మీడియా చీఫ్ గా పనిచేసిన నిర్మల్ కుమార్ పార్టీని వీడారు. నిన్నటి వరకు బిజెపి మిత్రపక్షంగా ఉన్న ఎడిఎంకే లో చేరారు. తమిళనాడులో జిల్లాల నుంచి 13 మంది సీనియర్లు బిజెపికి దూరంగా జరిగారు.
ఇక పార్టీలో అసంతృప్తుల జాబితా చాలానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గంగై అమరన్ దశబ్దానికి పైగా బిజెపిలో ఉంటున్నారు. తనకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా అవమానాలు భరించాల్సి వస్తోందని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. ఇక తమిళనాడులో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు బిజెపి నుంచి గెలుపొందారు. బిజెపి లాంటి పార్టీ తమిళనాడు అసెంబ్లీలో గెలవడం సాధారణ విషయం కాదు. ద్రవిడ సిద్ధాంతాలు బలంగా ప్రభావం చూపే తమిళ గడ్డపై బీజేపీ ప్రాతినిధ్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయమే.
అయితే ఆ ఎమ్మెల్యేలు కూడా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ నుంచి తమకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. పార్టీ అధ్యక్షుడు అన్నామలై తర్వాత చెప్పుకోదగ్గ మరో నేత లేరు అన్నట్లుగా పరిస్థితి ఉంది అనేది సీనియర్లు చెబుతున్న మాట. నటి గౌతమి.. అంతక ముందు గాయత్రి రఘురామ్, సి.టి.ఆర్ నిర్మల్ కుమార్, అనేకమంది నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేయడం, గత ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉండడానికి కారణమైన ఎడిఎంకేతో పొత్తు రద్దవడం పార్టీ నేతల్లో ఆందోళన పెంచుతోంది.
తమిళనాడులో పార్టీ చిన్నగా బలపడుతోంది అనుకుంటుండగా ఇలా వరుస రాజీనామాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందులోనూ త్వరలోనే లోకసభ ఎన్నికలు రానున్నాయి. దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో కనీస ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్న ఆపార్టీ అగ్రనేతల అభిప్రాయాలకు ఇక్కడ పరిస్థితులు మింగుడు పడని అంశంగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి