Agnipath Scheme దేశ వ్యాప్త అగ్నిపథ్ ఆందోళనలు.. రైల్వే కు రూ.259.44కోట్లు నష్టం.. కేంద్రమంత్రి వెల్లడి

|

Jul 23, 2022 | 1:12 PM

త్రివిధ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం(Agnipath Scheme) పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాలు, ముఖ్య ప్రాంతాలు ఆందోనలతో అట్టుడికాయి. తెలుగు...

Agnipath Scheme దేశ వ్యాప్త అగ్నిపథ్ ఆందోళనలు.. రైల్వే కు రూ.259.44కోట్లు నష్టం.. కేంద్రమంత్రి వెల్లడి
Ashwini Vaishnaw
Follow us on

త్రివిధ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం(Agnipath Scheme) పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చెలరేగిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాలు, ముఖ్య ప్రాంతాలు ఆందోనలతో అట్టుడికాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్ లో చెలరేగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‌’ కార్యక్రమానికి నిరసనగా జరిగిన ఆందోళనల కారణంగా రైల్వేశాఖకు రూ.259.44 కోట్ల నష్టం వాటిల్లినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. రాజ్యసభలో (Rajya Sabha) తమిళనాడు ఎంపీ వైకో అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానం చెప్పారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 62 చోట్ల నిరసన కార్యక్రమాలు జరిగాయి. వేల సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఫలితంగా ముందస్తు బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులకు రీఫండ్ చేసేందుకు రూ.102.96 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. రద్దు చేసిన రైళ్లన్నింటినీ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత పునరుద్ధరించామని రైల్వే మంత్రి పేర్కొన్నారు.

కాగా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబంగ, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ఇలా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. పలు రాష్ట్రాల్లో రైళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు టోల్‌ ప్లాజాలనూ ధ్వంసం చేశారు. లాఠీచార్జీలో వందలాది మంది గాయపడ్డారు. యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఈ పథకాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ వంటి సేవలు నిలిచిపోయాయి. అగ్నిపథ్‌ అన్నివిధాలా ఆలోచించి రూపొందించిన పథకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వివరించారు.

ఉత్తర ప్రదేశ్ లోని బలియాలో రాష్ట్ర రవాణా మంత్రి క్యాంపు కార్యాలయంపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఓ రైలుకు నిప్పు పెట్టారు. తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ముట్టడి సందర్భంగా కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఢిల్లీ, బెంగాల్, ఒడిశాల్లో హైవేలపై రాకపోకలు నిలిచిపోయాయి. బిహార్ రాజధాని పట్నా, హాజీపూర్, సమస్తిపూర్, లఖీసరాయ్‌ వంటి పలు పట్టణాల్లో రైళ్లకు నిప్పుపెట్టారు. హైవేలపై టైర్లు తగలబెట్టి రాకపోకలను అడ్డుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..