2020 Round Up : 2020 సంవత్సరం.. ఏడాదంతా విషాదమే.. మునుపెన్నడూ లేని విధంగా యావత్ ప్రపంపం అతలాకుతలం అయ్యింది. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మాయదారి కరోనా కారణంగా సంవత్సర కాలంగా దినదినగండం అన్నట్లుగా ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీశారు. ఇంతటి భయానకాన్ని మిగిల్చిన 2020 సంవత్సరం మరికొన్ని గంటల్లో చరిత్ర పుటల్లోకి చేరనుంది. 2020 ఇక గతంగా పిలువబడుతుంది. ఈ సంవత్సర కాలంలో యావత్ భారతావనిలో ఒక్క కరోనానే కాదు.. అంతకు మించిన సంఘటను వెలుగు చూశాయి. ఎన్నో విషాదాలు.. మరెన్నో ఉద్యమాలు.. కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో కొన్ని రాజకీయంగా వివాదాస్పదమైన ఘటనలు, ప్రభుత్వ నిర్ణయాలను ఇప్పుడు రివైండ్ చేసుకుందాం..
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు..
ఇప్పటి వరకు ఉన్న వ్యవసాయ చట్టాలను తిరగరాస్తూ కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా మూడు వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చింది. ఈ వ్యవసాయ బిల్లులను గత సెప్టెంబర్ నెలలో పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ప్రతిక్షాల నిరసనల మధ్యే ఆమోదింపజేసుకుంది. ఆ తరువాత సెప్టెంబర్ 24వ తేదీని ఆ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అవి కాస్తా చట్టాలు గా మారాయి. అయితే ఈ బిల్లులు పూర్తి రైతు వ్యతిరేక బిల్లులు అని దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు తమ గొంతు వినిపించాయి. కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం మాత్రం ఆ బిల్లులను పూర్తిగా సమర్థించుకుంది. ప్రతిపక్షాలు రైతు వ్యతిరేక పార్టీలు అంటూ ఎదురుదాడికి దిగింది. అంతలోనే.. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చి ఇప్పటికీ కొనసాగుతోంది. రైతుల పోరుపై యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పలు దేశాలకు చెందిన నేతలు సైతం ఈ ఉద్యమంపై స్పందించారు.
సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు.. ఢిల్లీ అల్లర్లు..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా నిరసనకారులు ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో కొందరు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఆ ఆందోళణలు కాస్తా తీవ్రమైన యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి. సీఏఏ వ్యతిరేకంగా భీకర పోరు జరిగింది. ఆందోళకారులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. వాహనాలు ధ్వంసం చేశారు. దాంతో ఢిల్లీలోని షాహీన్ బాగ్ యుద్ధ క్షేత్రంగా మారింది. ఈ ఘర్షణలో దాదాపు 50 మంది చనిపోగా.. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మొత్తంగా అల్లర్లను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కంగనా రనౌత్-మహారాష్ట్ర ప్రభుత్వం..
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మొంబై పోలీసులపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేయడమే కాదు.. యావత్ దేశ ప్రజల దృష్టిని మహారాష్ట్రపై పడేలా చేశాయి. ఈ కేసులో ముంబై పోలీసుల విచారణపై తనకు నమ్మకం కలగడం లేదని ఆరోపించింది. అంతేకాదు.. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చి సంచలన సృష్టించింది. ఈ వ్యాఖ్యలను శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సహా పలు పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. కంగనా రనౌత్ ముంబైకి రావొద్దంటూ హెచ్చరించారు. కంగనా వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ తరువాత కూడా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. కంగనా ఆఫీసును కూల్చివేయడం, కంగనాకు వై కేటగిరీ భద్రతను కేంద్రం కేటాయించడం ఇలా మొత్తంగా కంగనా వ్యవహారం మరాఠా రాజ్యంలో తీవ్రమైన రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
ఎల్ఏసీ వద్ద భారత్-చైనా ఘర్షణలు..
1975 తరువాత దాదాపు చాలా ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న భారత్-చైనా సరిహద్దుల్లో.. ఒక్కసారిగా తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భారత్-చైనా బలగాలు పరస్పర దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందగా, 76 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక చైనా సైన్యానికి కూడా భారీగానే నష్టం వాటిళ్లినట్లు ప్రచారం జరిగింది. ఈ ఘటన యావత్ భారతావనిని షేక్ చేసింది. భారత్-చైనా మధ్య యుద్ధం తప్పదా? అన్న స్థాయి వరకు వెళ్లింది.
అయోధ్య రామమందిరం నిర్మాణానికి భూమి పూజ..
దశాబ్దాల కాలం నాటి వివాదం సమసి.. అపురూప గట్టానికి శ్రీకారం చుట్టిన కార్యక్రమం అయోధ్య రామాలయానికి భూమిపూజ. ఆగస్టు 5వ తేదీని ప్రధాని నరేంద్ర మోదీ, మరికొద్ది మంది ప్రముఖుల ఆధ్వర్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. భారతదేశానికి అపూర్వమైన రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే అయోధ్య రామాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంపై పలు పార్టీల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒక మతానికే ప్రధాన మంత్రా అంటూ విమర్శలు గుప్పించారు.
హాత్రస్ ఘటన.. దేశ వ్యాప్తంగా నిరసనలు..
2020లో భారతదేశంలో జరిగిన దారుణమైన ఘటన ఇది. ఓ దళిత యువతిపై ఉన్నత కులానికి చెందిన కొందరు యువకులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై క్రూరంగా హింసించి చంపేశారు. అయితే ఈ కేసులో అంతకంటే దారుణంగా అక్కడి పోలీసులు వ్యవహరించారు. ప్రజాసంఘాల ఆందోళన నెపంతో పోలీసులు యువతి మృతదేహానికి గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. పోలీసుల చర్యపై సర్వత్రా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు యూపీ బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నిందితురాలిదే తప్పు అన్నట్లుగా దారుణమైన కామెంట్లు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంలో బాధితురాలిని అత్యాచారం చేసి చంపేశారని సీబీఐ తాజాగా తేల్చింది.
వలస కార్మికుల ఆందోళనలు..
కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రభావమైంది వలస కార్మికులనే చెప్పాలి. లాక్‌డౌన్ నేపథ్యంలో వీరు అనుభవించిన బాధ వర్ణనాతీతం. కేంద్ర ప్రభుత్వం ఉన్నపళంగా లాక్‌డౌన్ విధించడం.. కంపెనీలు మూత పడటం.. యాజమాన్యాలు ఉద్యోగులను తీసేయడం వంటి చర్యలతో బతుకుదెరువు కోసం వలస వచ్చిన కార్మికుల పరిస్థితి దయనీయమైంది. స్వస్థలాకి వెళదామంటే రవాణా సదుపాయం లేదు. ఉన్నకాడే ఉందామంటే పనులు లేవు. దాంతో వారు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది మంది వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు కాలి నడకన వెళ్లారు. ఆకలి దప్పులకు తట్టుకోలేక పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. దాంతో చివరికి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తేరుకుని వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేశాయి. అందుకు అనుగుణంగా రవాణా సదుపాయాలు కల్పించాయి.
సాధువుల దారుణ హత్య..
మహారాష్ట్రంలోని పాల్‌ఘర్ జిల్లా బరేలీ గ్రామంలో ముగ్గురు సాధువులను కొట్టి చంపిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. బాధిత వ్యక్తులు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి అవయవాలు అమ్ముకుంటున్నారంటూ జరిగిన దుష్ప్రచారం నేపథ్యంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన బీజేపీ-శివసేన మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపింది. ఇరు పక్షాలు తీవ్ర ఆరోపణలు.. ప్రత్యారోపణలతో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. జరిగిన దారుణానికి మతం రంగు పులుముతున్నారంటూ శివసేన మండిపడితే.. ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈ ఘటన జరిగిందని బీజేపీ విమర్శించింది.
వివాదాస్పదమైన యాంటీ లవ్ జిహాద్ చట్టాలు..
2020లో అత్యంత వివాదాస్పదమైన రాజకీయ అంశాల్లో యాంటీ లవ్ జిహాద్ చట్టాలు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ వరుసలో ముందుగా యూపీ సర్కార్ ఉంటుంది. ఇప్పటికే యాంటీ లవ్ జిహాద్ వ్యతిరేకంగా బిల్లు రూపొందించిన ఉత్తరప్రదేశ్‌లో యోగి సర్కార్.. ఆ మేరకు ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. అయితే యూపీలో బాటలోనే నడిచేందుకు మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. మధ్యప్రదేశ్, కర్ణాకట, హర్యానా రాష్ట్రాలు ఈ చట్టాన్ని తీసుకువచ్చేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఎవరైనా ప్రేమ పేరుతో బలవంతపు మత మార్పిడిలకు పాల్పడితే ఈ చట్టం కింద సదరు వ్యక్తితో పాటు, అతనికి సహకరించిన వారిని సైతం అరెస్ట్ చేశారు. దాదాపు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది.