గొడుగు నీడన శివయ్య ..

Lord shiva idol under umbrellla, గొడుగు నీడన శివయ్య ..

కాకతీయుల వైభవం మాటల్లో చెప్పలేనిది..వారి పాలనలో తెలుగు నేల ఓ వెలుగు వెలిగింది. నిర్మాణ, శిల్పకళా రంగాలు కొత్త పుంతలు తొక్కాయి. కాకతీయుల పూర్వ వైభవానికిచిహ్నాలుగా వరంగల్ జిల్లాలొ ఎన్నో కట్టడాలు, ప్రాకారాలు,  తటాకాలు ఇంకా మన కళ్ళెదుటే వున్నాయి. నాటి మహోజ్వలమైన సామ్రాజ్యంలో మనం జీవించి లేనప్పటికీ… నాటి అపురూప పరిపాలనకు ఆనవాళ్ళుగా అనేక ప్రాచీన కట్టడాలు సజీవంగా మన ముందు నిలిచివున్నాయి. ఎన్నో దండయాత్రలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని అవి మనల్ని అచ్చెరువు గొలుపుతుంటాయి. అటువంటి వాటిలో గణపురం కోటగుళ్ళు ఒకటి.
కాకతీయ కళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం కోటగుళ్లు దేవాలయం. ఉట్టిపడే శిల్పకళ, అద్భుత నిర్మాణ శైలితో ఘనపురంలో కోటగుళ్లను నిర్మించారు ఆనాడు. కానీ, ఇప్పుడా చారిత్రక సంపదకు ప్రమాదం పొంచివుంది. పాలకుల శీతకన్ను, పురావస్తు శాఖ వారి నిర్లక్ష్యంతో..మహా శివుడు ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..గొడుకు నీడన తలదాచుకుంటున్నాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల కేంద్రంలో గల ఈ కోటగుళ్లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 22 ఉప గుళ్లు, రెండు ప్రధాన దేవాలయ సముదాయంతో అద్బుత నిర్మాణం చరిత్రలో నిలిచిపోయింది. క్రీ.శ 1213లో ఈ ఆలయాలు నిర్మించారు. కాకతీయ మహా రాజు గణపతి దేవ చక్రవర్తి పాలనా సమయంలో ఈ ఆలయం జీవం పోసుకుంది.. కోట గుళ్లలోకి ప్రవేశించగానే ఆధ్యాత్మీక వాతావరణం భక్తులకు స్వాగతం పలుకుతుంది. అశేష జనపూజలందుకున్నఈ చారిత్రక కోటగుళ్లు ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నాయి. ఆదరణకు నోచుకోక అంపశయ్యకు చేరుతుంది. చినుకు పడిందంటే చాలు గర్బగుడి పూర్తిగా చెరువులా మారుతుంది. దీంతో చేసేది లేక ఆలయ పూజారి, భక్తుల సాయంతో దేవుడికి గొడుగును అడ్డుగా పెట్టారు. ఆలయ పరిరక్షణకు కమిటీవారు గుడిపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పి శివభక్తిని చాటుకున్నారు. కానీ, గాలికి కవర్లు లేచిపోవడంతో మండపం మధ్యభాగం నుండి వరదనీరు నేరుగా గర్భాలయంలో పడుతుంది.
ఎవరికి ఏ కష్టం వచ్చినా..శివయ్యా.. మమ్మల్ని కాపాడయ్యా అని వేడుకుంటూ తమ బాధలు నయం చేసుకుంటారు భక్తులు. అలాంటిది శివయ్య కొలువుదీరిన కోటగుళ్లపై ప్రభుత్వం కనికరించకపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం వెనుకవైపు ఒరిగిపోతుండటంతో స్థానికులు సైతం ఆందోళనకు గురవుతున్నారు. కాకతీయ కట్టడాలను కాపాడి..భావి తరాలకు అందించాల్సిన భాద్యత ప్రభుత్వాలదేనని, ఇప్పటికైన సంబంధిత శాఖ అధికారులు స్పందించి కోటగుళ్లకు మరమ్మతులు చేయించాలని వేడుకుంటారు.

 

Lord shiva idol under umbrellla, గొడుగు నీడన శివయ్య ..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *