
రాత్రి ఏడెనిమిది గంటలు హాయిగా నిద్రపోయినా.. ఉదయం లేవగానే చాలా మందికి అలసట, బద్ధకంగా అనిపిస్తుంది. పొద్దెక్కుతున్నా మంచం దిగాలని అనిపించదు. రోజంతా నీరసంగా ఉండటం, ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బందిపెడుతాయి. టీ లేదా కాఫీ తాగి శరీరానికి కొత్త ఉత్సాహం తెచ్చుకోవాలని ప్రయత్నించినా.. దాని ప్రభావం కొద్దిసేపటికే పరిమితమవుతుంది. నిపుణుల సలహా మేరకు.. ఉదయం నిద్రలేవగానే కొన్ని చిన్న అలవాట్లను పాటిస్తే శరీరం సహజంగానే యాక్టివ్‌గా మారుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఈ మూడు మార్నింగ్ అలవాట్లు ఎంతో ఉపయోగపడతాయి.
రాత్రంతా నిద్రపోయే సమయంలో శరీరానికి దాదాపు 7–8 గంటల పాటు నీరు అందదు. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే ఒక గ్లాసు సాధారణ నీరు తాగడం వల్ల శరీరానికి వెంటనే తేమ అంది.. బాడీ హైడ్రేట్ అవుతుంది. దీని వల్ల మెటబాలిజం చురుగ్గా పనిచేస్తుంది. శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేసి అలసట, నీరసం తగ్గుతుంది. ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.
ఉదయం సూర్యకిరణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నిద్రలేచిన తర్వాత కొద్దిసేపు బయటకు వెళ్లి లేత ఎండలో పావు గంట గడపండి. తద్వారా శరీరంలోని సహజ జీవ గడియారం సక్రమంగా పనిచేస్తుంది. దీని వల్ల హార్మోన్లు చురుకుగా విడుదలవుతాయి. బద్ధకం, నిద్రమత్తు తగ్గుతుంది. రోజంతా ఏకాగ్రత పెరుగుతుంది. రాత్రిపూట కూడా మంచి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది.
ఉదయం లేవగానే గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాల పాటు స్ట్రెచింగ్, యోగా లేదా ఇంట్లోనే కొద్దిసేపు నడవడం చాలా మేలు చేస్తుంది. దీని ద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలకు, మెదడుకు ఆక్సిజన్ ఎక్కువగా అంది శరీరం చురుగ్గా మారుతుంది. తద్వారా రోజంతా ఉత్సాహంగా పని చేసే శక్తి లభిస్తుంది.
అలాగే ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ అలవాట్లు కూడా పాటించడం మంచిది. ఉదయం లేచిన వెంటనే మొబైల్ ఫోన్ చూసే అలవాటు మానుకోవాలి. పోషకాలు కలిగిన అల్పాహారం తీసుకోవాలి. అధికంగా టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే మానుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించండి.
రోజూ 7–8 గంటలు నిద్రపోయినా చాలా రోజుల పాటు అలసట, నీరసం సమస్యలు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత, విటమిన్ లోపాలు, మధుమేహం లేదా నిద్ర సంబంధిత వ్యాధులు కూడా దీనికి కారణం కావచ్చు. ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు దీర్ఘకాలిక అలసట లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.
Also Read: జ్ఞాపకశక్తి తగ్గుతోందా? మెమొరీ పవర్‌ను పెంచే సీక్రెట్ టిప్స్ మీకోసం