AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సముద్రాన్ని దాటకుండానే 16 దేశాల ప్రయాణం..! భూమిపై అతి పొడవైన రహదారి ఇదే..

ప్రపంచాన్ని చుట్టేయాలని ఎవరికి ఉండదు? కానీ విమానాలు, ఓడలు, కార్లు ఏవీ లేకుండా కేవలం నడుచుకుంటూ భూమిపై ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటే.. అందుకు ఒక అద్భుతమైన దారి ఉందని మీకు తెలుసా? సముద్రాన్ని దాటవలసిన అవసరం లేకుండా, నిరంతరం భూమిపై నడుస్తూనే సగానికి పైగా ప్రపంచాన్ని చుట్టేయవచ్చు.

సముద్రాన్ని దాటకుండానే 16 దేశాల ప్రయాణం..! భూమిపై అతి పొడవైన రహదారి ఇదే..
Longest Road.jpg
Nikhil
|

Updated on: Feb 13, 2026 | 8:22 PM

Share

గణిత శాస్త్రం, భూగోళ శాస్త్రం ఆధారంగా నిపుణులు ఒక అత్యంత పొడవైన నేరు మార్గాన్ని గుర్తించారు. ఇది ఒక సాహస యాత్ర మాత్రమే కాదు.. మానవ సహనానికి ఒక పెద్ద పరీక్ష. ఇంతకీ ఆ ప్రదేశం ఏంటి? ఆ దారిలో ప్రయాణించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

అతి పొడవైన మార్గం..

భూగోళ శాస్త్ర నిపుణుల ప్రకారం.. భూమిపై నడవడానికి వీలున్న అతి పొడవైన మార్గం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి రష్యాలోని సుదూర తూర్పు నగరమైన మగడాన్ వరకు ఈ ప్రయాణం సాగుతుంది. ఈ మార్గం మొత్తం పొడవు దాదాపు 14,000 మైళ్లు లేదా 22,530 కిలోమీటర్లు. ఈ మొత్తం ప్రయాణంలో ఎక్కడా సముద్రాన్ని దాటవలసిన అవసరం లేదు. కేవలం భూమి మీద నడుస్తూనే ఆఫ్రికా నుంచి రష్యా చివరి వరకు చేరుకోవచ్చు.

ఈ సుదీర్ఘ నడక మార్గం దాదాపు 16 దేశాల గుండా వెళుతుంది. ఆఫ్రికా ఖండం నుంచి ప్రారంభమై.. ఈ ప్రయాణం మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా మీదుగా సాగి చివరికి అతి శీతల ప్రాంతమైన రష్యాకు చేరుకుంటుంది. వివిధ దేశాల సరిహద్దులు దాటడం ఒక ఎత్తైతే.. అక్కడి భిన్నమైన సంస్కృతులు, భౌగోళిక పరిస్థితులను తట్టుకోవడం మరో ఎత్తు. సహారా ఎడారిలోని మండే ఎండల నుంచి సైబీరియాలోని గడ్డకట్టే చలి వరకు ప్రతి అడుగు ఒక సవాలుగానే మారుతుంది. ఇది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు.. మానసిక నిశ్చయానికి పెట్టిన పరీక్ష.

ఎంత సమయం పడుతుంది?

సైద్ధాంతిక లెక్కల ప్రకారం.. ఒక వ్యక్తి ఎక్కడా ఆగకుండా, నిరంతరం నడుస్తూనే ఉంటే ఈ ప్రయాణం పూర్తి చేయడానికి దాదాపు 595 రోజులు లేదా సుమారు 4,424 గంటలు పడుతుంది. కానీ ఒక మనిషికి విశ్రాంతి, నిద్ర, ఆహారం చాలా ముఖ్యం. వాస్తవ పరిస్థితులలో రోజుకు ఒక నిర్దిష్ట సమయం విశ్రాంతి తీసుకుంటూ నడిస్తే.. ఈ యాత్ర పూర్తి చేయడానికి కనీసం 3 సంవత్సరాల సమయం పడుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి రోజుకు సగటున 15 కిలోమీటర్లు మాత్రమే నడవగలిగితే.. అతను ఈ దూరాన్ని చేరుకోవడానికి 15 నుంచి 20 సంవత్సరాల వరకు పట్టవచ్చు.

భూమి చుట్టుకొలత, అంటే భూమధ్యరేఖ చుట్టూ ఉన్న మొత్తం పొడవు దాదాపు 40,075 కిలోమీటర్లు. మనం చెప్పుకుంటున్న ఈ నడక మార్గం భూమి చుట్టుకొలతలో సగం కంటే ఎక్కువే ఉండటం విశేషం. ఒక వ్యక్తి భూమిని మొత్తం నడవాలనుకుంటే అతనికి ఎన్నో సంవత్సరాల సమయం పడుతుంది. యుద్ధ ప్రాంతాలు, వీసా సమస్యలు, మృగాల భయం వంటి ఆటంకాలు దాటుకుంటూ ఈ ప్రయాణం పూర్తి చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటివరకు ఏ వాహనం వాడకుండా ఈ మార్గంలో ఎవరూ ప్రయాణించలేదు. ప్రకృతి అందించిన ఈ సుదీర్ఘ రహదారి మనిషికి భూమి ఎంత విశాలమైనదో గుర్తు చేస్తుంది. టెక్నాలజీ యుగంలో నిమిషాల్లో ప్రయాణాలు చేస్తున్నా.. ప్రకృతి ఒడిలో అడుగులు వేస్తూ సాగే ఇలాంటి యాత్రలు వినడానికే ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి.