Lifestyle: మీరు వాడుతోన్న గోధుమ పిండి అసలా, నకిలీనా.? ఇలా తెలుసుకోండి..

|

Nov 21, 2024 | 7:44 AM

ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తోన్న ప్రతీ వస్తువు కల్తీగా మారింది. అన్ని రకాల వస్తువులను కల్తీగా మార్చేసి విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. ఉప్పు నుంచి పప్పు వరకు అన్నింటిలో కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలను బలి తీస్తున్నారు. అయితే కొన్ని చిట్కాల ద్వారా మనం వాడుతోన్న వస్తువుల నాణ్యతను ఇట్టే పసిగట్ట వచ్చని చెబుతున్నారు..

Lifestyle: మీరు వాడుతోన్న గోధుమ పిండి అసలా, నకిలీనా.? ఇలా తెలుసుకోండి..
Adulterated Wheat Flour
Follow us on

ఎక్కడ చూసినా కల్తీ.. పప్పు నుంచి ఉప్పు దాకా, బియ్యం నుంచి కారం దాకా అన్నింటినీ కల్తే చేసేస్తున్నారు. ప్రజల ప్రాణాల ఏమైపోయినా తమకు సంబంధం లేదు, తమ జేబులు నిండితే చాలని భావిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అక్రమార్జనే పరమావధిగా కాసులకు కక్కుర్తి పడుతున్నారు. గోధుమ పిండిని కూడా కల్తీ చేసి విక్రయిస్తున్నారు. మారిన బిజీ లైఫ్‌ స్టైల్‌ కారణంగా ఇన్‌స్టాంట్‌ కోసం ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కిరాణంలో దొరికే గొధుమ పిండిని కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు.

అయితే ఈ గోధుమ పిండిలో కొందరు కేటుగాళ్లు రకరకాల వస్తువులు కలిపి విక్రయిస్తున్నారు. గోధుమ పిండిలో మైదాను, ఇసుకను, చాక్‌పీస్‌ పౌడర్‌ను, అదనపు ఊకను, యారో రూట్ పౌడర్.. ఇలాంటి వాటిని కలిపి కల్తీ చేస్తున్నారు. ఇలాంటి వాటిని కలిపిన పిండితో చేసిన చపాతీలను తిన్న ప్రజల రోగాల బారినపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఊరుపేరు లేని బ్రాండ్స్‌తో పాటు లూజ్‌గా లభించే వాటిలో ఇలాంటి కల్తీ ఎక్కువగా జరుగుతోందని చెబుతున్నారు. ఇంతకీ మీరు ఉపయోగిస్తున్న గోధుమ పిండి మంచిదేనా.? తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గోధుమ పిండి నాణ్యతను తెలుసుకోవడానికి ముందుగా. ఒక గ్లాసులో నీరు తీసుకోవాలి. అనంతరం అందులో రెండు చెంచాల గోధుమ పిండిని వేయాలి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు ఆగాలి. ఒకవేళ గోధుమ పిండి పైకి తేలినట్లు కనిపిస్తే అది నకిలీ అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీటి అడుగులోకి చేరితో అది మంచి పిండి అని అర్థం.

* సాధారణంగా చపాతీలు చేసే ముందు పిండిని కలుపుతుంటాం. అయితే పిండి తయారు కావడానికి ఎక్కువ నీరు అవసరమైనా.. త్వరగా పిండి మెత్తగా కాకపోయినా అది కల్తీ పిండి అని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* ఇక పిండి నాణ్యతను నిమ్మకాయతో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొంత పిండి తీసుకోవాలి. అనంతరం అందులో 3-4 చుక్కలు నిమ్మరసం వేయాలి. ఒకవేళ బుడగలు వస్తే కల్తీ అని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన పిండి అయితే ఎలాంటి లక్షణాలు కనిపించవు. సాధారణంగా చాక్‌ పౌడర్‌ ఉంటేనే అలా బుడగలు వస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో పూర్తి స్థాయిలో ఎంత వరకు శాస్త్రీయత ఉందన్న విషయం నిపుణులే తేల్చాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..