Health: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే..

|

Nov 22, 2024 | 10:11 AM

శరీరానికి సరిపడ ప్రోటీన్స్ లభిస్తేనే ఆరోగ్యంగా ఉంటామని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే తీసుకునే ఆహారంలో సరిపడ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే ప్రోటీన్ లభించకపోతే శరీరంలో ఎన్ని మార్పులు కనిపిస్తాయి. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ప్రోటీన్‌ లోపం ఉన్నట్లే..
Protein Deficiency
Follow us on

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల ఎలిమేంట్స్‌ సక్రమంగా అందాలని తెలిసిందే. వీటిలో ప్రధానమైనవి ప్రోటీన్లు. శరీరానికి సరిపడ ప్రోటీన్లు లభించకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. అయితే శరీరంలో ప్రోటీన్‌ లోపించిన విషయాన్ని ఎలా తెలుసుకోవాలనేగా మీ సందేహం. శరీరం ముందుగానే మనకు కొన్ని లక్షణాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తుంది. ఇంతకీ శరీరంలో ప్రోటీన్‌ లోపం ఉంటే కనిపించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* శరీరంలో ప్రోటీన్‌ లోపం ఉంటే జుట్టు కూడా రాలిపోతుంటుంది. ఎలాంటి కారణం లేకుండా తరచూ జుట్టు రాలిపోతుంటే శరీరంలో ప్రోటీన్‌ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వెంట్రుకలు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నా అందులో ప్రోటీన్‌ లోపం కూడా ఒకటని అంటున్నారు.

* మనలో కొందరికీ నిత్యం కండరాల నొప్పులు వేధిస్తుంటాయి. దీనికి కూడా ప్రోటీన్‌ లోపం కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కండరాలు బలహీనమై నొప్పులు వేదిస్తుంటాయి. నిత్యం కండరాల నొప్పి వేధిస్తుంటే ప్రోటీన్‌ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

* ఏ పని చేయకపోయినా.. ఎలాంటి శారీరక శ్రమ లేకున్నా తరచూ ఊరికే అలసిపోతున్నా, నీరసంగా ఉంటున్నా శరీరంలో ప్రోటీన్‌ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఏ పని మీద ఏకాగ్రత లేకపోయినా ఈ సమస్య ఉన్నట్లు.

* సాధారణంగా శరీరంలో షుగర్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటే గాయాలు త్వరగా మానవని తెలిసిందే. అయితే ప్రోటీన్‌ లోపం ఉన్న వారిలో కూడా గాయాలు త్వరగా మానవని నిపుణులు చెబుతున్నారు. గాయాలు త్వరగా మానకపోతుంటే ప్రోటీన్‌ లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

* తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు తక్కువగా తీసుకుంటే ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఎంత ఫుడ్‌ తీసుకున్నా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఆకలి ఎక్కువగా ఉండడం వల్ల తరచూ తింటూ ఉంటారు. దీంతో బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో ప్రోటీన్‌ లోపం ఉంటే ఊబకాయంకు దారి తీస్తుందని ఇనపుణులు చెబుతున్నారు.

* తరచూ వ్యాధులు వస్తుంటే కూడా ప్రోటీన్‌ లోపం ఉన్నట్లు భావించాలి. సాధారణంగా శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నట్లయితే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల వ్యాధులు త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

* శరీరానికి సరిపడ ప్రోటీన్‌ లభించకపోతే చర్మ సంబంధిత సమస్యలు సైతం వస్తుంటాయి. ముఖ్యంగా చర్మంపై ఇరిటేషన్, ఇంఫ్లమేషన్‌ వంటివి కలుగుతాయి. దీంతో చర్మంపై ముడతలు పడుతాయి. శరీరానికి ప్రోటీన్‌ లభించకపోతే త్వరగా వయసు మళ్లిన లక్షణాలు కనిపిస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..