మీరు మార్కెట్‌లో కొన్న వంట నూనె అసలైనదేనా? ఫ్రిజ్ టెస్ట్‌తో 30 నిమిషాల్లో కనిపెట్టేయండి

ప్రస్తుతం మార్కెట్లో కల్తీ నూనె రాజ్యం ఏలుతుంది. వ్యాపారులు చేసే కల్తీ వల్ల జనాల ఆరోగ్యం విపరీతంగా దెబ్బతింటుంది. ఈ విధమైన నూనె నిశ్శబ్దంగా తీవ్రమైన హాని కలిగిస్తోంది. అయితే మీరు వంటగదిలో ఉపయోగించే నూనె స్వచ్ఛతను నిర్ధారించుకోవడానికి ఈ కింది సులభమైన పద్ధతులను ఉపయోగించవచ్చు. అవేంటంటే..

మీరు మార్కెట్‌లో కొన్న వంట నూనె అసలైనదేనా? ఫ్రిజ్ టెస్ట్‌తో 30 నిమిషాల్లో కనిపెట్టేయండి
Oil Adulteration Tips

Updated on: May 25, 2026 | 2:03 PM

ఊరగాయ పచ్చళ్లు, కొన్ని స్పెషల్ వంటకాలకు చాలా మంది ఆవనూనె వాడుతుంటారు. అయితే వ్యాపారులు ఆవ నూనెలో పామాయిల్, చౌకైన మినరల్ ఆయిల్, కొన్నిసార్లు ‘మెటానిల్ ఎల్లో’ వంటి కృత్రిమ రంగును కలుపుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి రసాయనాలే కలిపిన కల్తీ నూనె తరచూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా కల్తీ నూనె వల్ల జీర్ణ సమస్యల నుంచి కాలేయ నష్టం వరకు ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి

పామాయిల్‌ను గుర్తించడానికి సులభమైన మార్గం

నూనెలో కల్తీని గుర్తించడానికి అత్యంత నమ్మకమైన మార్గం కోల్డ్ టెస్ట్ లేదా ఫ్రీజర్ టెస్ట్. ఒక చిన్న గాజు గిన్నెలో కొంత నూనె తీసుకుని అరగంట పాటు ఫ్రీజర్‌లో ఉంచండి. కొంత సమయం తర్వాత, మీరు ఆ గిన్నెను బయటకు తీసినప్పుడు, నూనెపై తెల్లటి లేదా క్రీమ్ లాంటి పొర ఏర్పడి ఉంటే దానిలో పామాయిల్ లేదా నాణ్యత లేని కొవ్వును కలిపారని అర్థం. స్వచ్ఛమైన ఆవనూనె లక్షణాలలో ఒకటి ఏమిటంటే అది తీవ్రమైన చలిలో కూడా ఎప్పుడూ గడ్డకట్టదు.

రసాయన పెయింట్ మరకలు

నూనెలో హానికరమైన రంగులు ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి కొన్ని చుక్కల నూనెను మీ అరచేతుల మధ్య రుద్దండి. అరచేతులు అసాధారణమైన ముదురు పసుపు రంగులోకి మారితే అది ప్రమాదానికి సంకేతం. మరింత నిర్ధారణ కోసం మీరు సాధారణ సబ్బుతో చేతులు కడుక్కోవచ్చు. చేతులు కడుక్కుంటున్నప్పుడు కూడా పసుపు రంగు తొలగిపోకపోతే ఆ నూనెను వెంటనే మార్చేయండి.

ఇవి కూడా చదవండి

నూనె వాసన, రుచి

అసలైన ఆవనూనెకు దానికంటూ ఒక ఘాటైన సువాసన ఉంటుంది. అది కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది. సీసా మూత తెరిచిన తర్వాత ఆ సుపరిచితమైన సువాసన లేకపోయినా లేదా వేడి చేసినప్పుడు ఘాటైన వాసన వచ్చినా, ఆ నూనె నకిలీదని ఖచ్చితంగా చెప్పవచ్చు. మార్కెట్లో బాగా పేరున్న మరియు ‘FSSAI’ ధృవీకరణ పొందిన బ్రాండ్ నుంచి నూనె కొనడం ఎల్లప్పుడూ మంచిది. సీసాపై ‘రా’ లేదా ‘కోల్డ్ ప్రెస్డ్’ అని రాసి ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం. సాధ్యమైనంత వరకూ లూజ్‌ ఆయిల్ కొనకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడే కల్తీ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి అవగాహన మిమ్మల్ని తీవ్రమైన వ్యాధుల నుంచి కాపాడుతుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us