నరాల బలహీనత, నీరసాన్ని తగ్గించి శరీరాన్ని బలంగా మారుస్తుంది.. మటన్ లివర్ సెట్ గురించి మీకు తెలుసా..?
మటన్ లివర్ సెట్‌లో లివర్, తిల్లి, గుండె, ఊపిరితిత్తులు వంటి అవయవ మాంసాలు ఉంటాయి. వీటిలో ఐరన్, విటమిన్ బి12, ప్రొటీన్ వంటి పోషకాలు లభిస్తాయి. రక్తకణాల ఉత్పత్తి, కండరాల ఆరోగ్యానికి ఇవి తోడ్పడతాయి. వీటితో రుచికరమైన స్పైసీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. అయితే పరిమితంగా తీసుకోవడం మంచిది.

నాన్‌వెజ్ ప్రియులు మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు.. ఫ్రై, కర్రీతోపాటు.. పలు రకాల స్టైల్‌లలో వండుకుని ఎంజాయ్ చేస్తారు. అయితే.. మటన్ కొనేటప్పుడు కేవలం మాంసం ముక్కలకే కాకుండా మటన్ లివర్ సెట్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మటన్ లివర్ సెట్ అంటే.. మేక లేదా గొర్రె లివర్, తిల్లి (ప్లీహం), గుండె, ఊపిరితిత్తులు (లంగ్స్) వంటి అవయవ మాంసాల కాంబినేషన్.. దీనికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు.. ఇది పోషకాలు ఖనిజాల భండాగారం.. ఇవి కేవలం రుచిని అందించడమే కాకుండా.. శరీరానికి ఎనలేని శక్తిని ఇచ్చే పోషకాల నిలయాలుగా పనిచేస్తాయి.
మటన్ లివర్ సెట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
రక్తహీనతకు చెక్: లివర్, తిల్లిలో ఐరన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని వేగవంతం చేసి, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
శారీరక బలం – శక్తి: విటమిన్లు, ఖనిజాలు, అత్యుత్తమ ప్రొటీన్లు ఉండటం వల్ల దీర్ఘకాలిక నీరసం, అలసట తగ్గి శరీరానికి తక్షణ ఉత్సాహం లభిస్తుంది. ఇంకా నరాల బలహీనతను కూడా తగ్గిస్తాయి.
కండరాల పుష్టి: ఇందులో ఉండే నాణ్యమైన లీన్ ప్రొటీన్ కండరాల పునరుద్ధరణకు, శారీరక దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది.
రోగనిరోధక శక్తి: జింక్, సెలీనియం వంటి పోషకాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తాయి.
రుచికరమైన ‘మటన్ లివర్ సెట్ ఈజీ ఫ్రై’ తయారీ విధానం:
కావలసిన పదార్థాలు:
- శుభ్రం చేసిన మటన్ లివర్ సెట్.. లివర్, తిల్లి, గుండె, లంగ్స్ ముక్కలు
- నూనె / నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు ( ఫ్రైలో కొంచెం ఎక్కువగా కూడా ఉపయోగించవచ్చు..)
- సన్నగా తరిగిన ఉల్లిపాయలు: 2
- పచ్చిమిర్చి: 3 (చీలికలు)
- అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
- పసుపు: పావు టీస్పూన్
- కారం: రుచికి సరిపడా (లేదా మిరియాల పొడి 1 టీస్పూన్)
- ధనియాల పొడి, జీలకర్ర పొడి: అర టీస్పూన్ చొప్పున
- గరం మసాలా: చిటికెడు
- ఉప్పు: తగినంత
- కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా
మటన్ లివర్ సెట్ తయారీ విధానం:
ముందుగా మటన్ లివర్ సెట్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. (వీటిని మరీ ఎక్కువగా ఉడికించకూడదు, లేదంటే గట్టిగా అయిపోతాయి).
స్టవ్ మీద పాన్ పెట్టి నూనె లేదా నెయ్యి వేడి చేయాలి.
నూనె కాగాక కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
ఆ తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.
ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ సెట్ ముక్కలను వేసి బాగా కలపాలి. అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మసాలాలు ముక్కలకు బాగా పట్టేలా కలపాలి.
ముక్కలు మాడిపోకుండా, లోపల వరకు మెత్తగా ఉడకడానికి రెండు టేబుల్ స్పూన్ల నీటిని చల్లుకుని మూత పెట్టి మీడియం మంటపై 5 నుండి 7 నిమిషాలు ఉడికించాలి.
నీరంతా ఇంకిపోయి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. చివరగా చిటికెడు గరం మసాలా, మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని దించేయాలి.
అంచులు కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఈ స్పైసీ లివర్ సెట్ ఫ్రై వేడివేడి అన్నంతో లేదా స్నాక్‌లా తింటే చాలా రుచిగా ఉంటుంది.. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
అయితే.. మటన్ లివర్ సెట్ లో కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉంటుంది.. కావున ఏమైనా సమస్యలుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
