అబ్బ.. నిమ్మకాయలు ఇలా స్టోర్ చేస్తే 3 నెలలు తాజాగా ఉంటాయ్.. అస్సలు చెడిపోవు..
నిమ్మకాయలను ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంచడానికి మూడు సులభమైన పద్ధతులున్నాయి. ఫ్రిడ్జ్‌లో ఆయిల్, ఎయిర్‌టైట్ బాక్స్ ఉపయోగించి 3 నెలలు, న్యూస్‌పేపర్ చుట్టి 2 నెలలు నిల్వ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేకపోతే, ఇసుక పద్ధతి ద్వారా నిమ్మకాయలను 1-2 నెలల పాటు తాజాగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతోపాటు ఎన్నో పోషకాలు దాగున్నాయి. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B6 వంటి ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. అందుకే.. నిమ్మ రసాన్ని చాలా మంది తీసుకుంటారు. అంతేకాకుండా.. కూరల్లో ఉపయోగిస్తారు. అయితే.. నిమ్మకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడం అనేది సాధారణంగా అందరికీ ఎదురయ్యే సవాలు.. ముఖ్యంగా వేసవి కాలంలో నిమ్మకాయల ధరలు పెరిగినప్పుడు లేదా అవి సులభంగా దొరకనప్పుడు, వాటిని సమర్థవంతంగా నిల్వ చేసుకోవడం చాలా అవసరం.. అయితే.. నిమ్మకాయలను మూడు విభిన్న పద్ధతులలో నిల్వ చేసుకోవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్‌లో, ఫ్రిజ్ లేకుండా నిల్వ చేసే పద్ధతులతో నిమ్మకాయలు ఎక్కువ కాలం ఫ్రెష్ గా ఉంటాయని పేర్కొంటున్నారు.
మొదటి పద్ధతి ఫ్రిజ్‌లో నిమ్మకాయలను మూడు నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు..
మొదట, నిమ్మకాయలను శుభ్రమైన నీటితో బాగా కడిగి, వాటిపై ఉన్న దుమ్ము తొలగించాలి. ఆ తర్వాత, ఒక పొడి టవల్ లేదా గుడ్డ సహాయంతో నిమ్మకాయలను పూర్తిగా తుడిచి, ఎటువంటి తడి లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. తడి లేకుండా ఆరిన తర్వాత, ఒక ఎయిర్‌టైట్ బాక్స్ తీసుకుని, దాని అడుగున కిచెన్ నాప్‌కిన్ లేదా న్యూస్‌పేపర్ ఉంచాలి. ప్రతి నిమ్మకాయకు కొద్దిగా వంట నూనెను (పల్లి లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటివి) వేలితో పూయాలి. ఎక్కువ నూనె కారకుండా చూసుకోవాలి. దెబ్బతిన్న నిమ్మకాయలను పక్కన పెట్టాలి, ఎందుకంటే అవి మిగతావాటిని పాడు చేయవచ్చు. నూనె పూసిన నిమ్మకాయలను బాక్స్‌లో సర్ది, పైన మరో పేపర్ నాప్‌కిన్ ఉంచి, మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఈ పద్ధతి ద్వారా నిమ్మకాయలు మూడు నెలల వరకు తాజాగా ఉంటాయి.
రెండవ పద్ధతి కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి, రెండు నెలల వరకు తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పద్ధతిలో, నిమ్మకాయలను మొదటి పద్ధతిలో వలె శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. తర్వాత, ఒక్కో నిమ్మకాయను న్యూస్‌పేపర్‌లో గాలి చొరబడకుండా జాగ్రత్తగా చుట్టాలి. చుట్టిన నిమ్మకాయలను ఒక ఎయిర్‌టైట్ బాక్స్‌లో లేదా గాలి చొరబడని కవర్‌లో ఉంచి, ఫ్రిజ్‌లో పెట్టాలి. బాక్స్‌లు ఎక్కువ స్థలం తీసుకుంటాయని భావించేవారు.. గాలి చొరబడని కవర్‌లో నిమ్మకాయలను ఉంచి, తక్కువ స్థలంలో కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు.
మూడవ పద్ధతి ఫ్రిజ్ అందుబాటులో లేని వారికి లేదా నిమ్మకాయలను బయట నిల్వ చేయాలనుకునే వారికి ఇది కరెక్ట్.. ఈ పద్ధతిలో నిమ్మకాయలను కడగాల్సిన అవసరం లేదు. ఒక ప్లేట్ తీసుకుని, దాని మధ్యలో జల్లెడను ఉంచాలి. జల్లెడలో ఒక అంగుళం వరకు ఇసుక పోసి, దానిని నీటితో కొద్దిగా తడిపివేయాలి. ఆ తడి ఇసుకపై నిమ్మకాయలను వరుసగా ఉంచాలి. తర్వాత, నిమ్మకాయలు మునిగేంత వరకు మరింత ఇసుక పోసి, దాన్ని కూడా నీటితో తడిపివేయాలి. పైన ఒక కాటన్ గుడ్డ కప్పి, ఆ గుడ్డను కూడా తడిపివేయాలి. ప్రతి రోజూ ఒకసారి ఇసుకపై నీళ్లు చల్లుతూ ఉంటే, నిమ్మకాయలు ఒకటి నుండి రెండు నెలల పాటు ఫ్రిజ్ లేకుండానే తాజాగా ఉంటాయి. ఈ పద్ధతుల ద్వారా నిమ్మకాయలను సమర్థవంతంగా నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
