
మనలో చాలామంది ముఖ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యతను మెడ, మోచేతులు, మోకాళ్ల సంరక్షణకు ఇవ్వరు. దీనివల్ల ఆ ప్రాంతాల్లో చర్మం నల్లగా మారడం లేదా మురికి పేరుకుపోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో చాలామంది దాన్ని సాధారణ మట్టి అనుకుని లూఫా లేదా స్క్రబ్‌తో గట్టిగా రుద్దుతుంటారు. అయితే, ఈ నలుపు కేవలం మురికి మాత్రమే కాకుండా ట్యానింగ్, ఘర్షణ లేదా పిగ్మెంటేషన్ వల్ల కూడా రావచ్చు.
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో నిమ్మకాయ, ఈనో, షాంపూ, కాఫీ పొడిని కలిపి నలుపు ఉన్న చోట రాస్తే నిమిషాల్లో మురికి పోతుందనే వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ, వీటిని వాడటం చర్మానికి తీవ్ర హాని కలిగిస్తుందని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిమ్మకాయలో ఉండే యాసిడ్ చర్మంపై మంటను కలిగిస్తుంది. ఈనో చర్మం కోసం తయారుచేసినది కాదు, అలాగే షాంపూ కేవలం జుట్టు పరిశుభ్రత కోసమే. వీటిని చర్మంపై వాడటం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.
మైల్డ్ క్లెన్సింగ్:
శరీరంపై ఉన్న మురికి, చెమటను తొలగించడానికి సబ్బుకు బదులుగా సున్నితమైన మైల్డ్ క్లెన్సర్, గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. చర్మాన్ని గట్టిగా రుద్దకుండా తేలికపాటి చేతులతో శుభ్రం చేసుకోవాలి.
మాయిశ్చరైజేషన్:
స్నానం చేసిన వెంటనే చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ రాయడం చాలా ముఖ్యం. మోచేతులు, మోకాళ్ల వద్ద చర్మం త్వరగా పొడిబారుతుంది, కాబట్టి అక్కడ క్రమం తప్పకుండా మాయిశ్చరైజర్ వాడటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
సన్‌స్క్రీన్ వాడకం:
ఎండ దెబ్బకు మెడ, చేతులు ట్యాన్ అయి నల్లగా మారతాయి. కాబట్టి బయటకు వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ రాయడం మరువకూడదు.
సహజమైన చిట్కా – పాలు, పసుపు, తేనె:
ట్యానింగ్ తగ్గించుకోవడానికి ఇంట్లోనే సురక్షితమైన పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఒక స్పూన్ పాలు, ఒక స్పూన్ పసుపు, అర స్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేసి నలుపు ఉన్న ప్రాంతంలో రాయాలి. 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఒకవేళ చర్మంపై నలుపు చాలా కాలంగా ఉండి, మందంగా మారుతుంటే సొంత వైద్యం చేయకుండా డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..