AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముక్క మెత్తగా.. గ్రేవీ జ్యూసీగా.. అందరూ మెచ్చే అమ్మమ్మల కాలం నాటి మటన్ కర్రీ రెసిపీ..

Spicy Mutton Curry: ఇంట్లో అందరూ మెచ్చేలా రుచికరమైన, స్పైసీ మటన్ కర్రీని సులభంగా, మెత్తగా ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకోండి. ఇది రోటీ, రైస్, చపాతీతో అద్భుతంగా ఉంటుంది. సులువుగా చేసే ఈ రెసిపీని ప్రయత్నించి, దాని అద్భుతమైన రుచిని ఆస్వాదించండి..

ముక్క మెత్తగా.. గ్రేవీ జ్యూసీగా.. అందరూ మెచ్చే అమ్మమ్మల కాలం నాటి మటన్ కర్రీ రెసిపీ..
Delicious Mutton Curry
Shaik Madar Saheb
|

Updated on: Nov 09, 2026 | 12:18 PM

Share

పండుగలు వచ్చినా.. ఎప్పుడైనా తినాలనుకున్నా.. నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్ ను ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటారు.. ఫ్రై, కర్రీ తోపాటు.. పలు రకాలు వండుకొని ఇష్టంగా తింటారు. చికెన్ తో పోలిస్తే.. మటన్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం.. అయితే, అందరూ మెచ్చేలా రుచికరంగా, స్పైసీగా, ఇంట్లో సులభంగా, మెత్తగా మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఈ రెసిపీని ఒకసారి ప్రయత్నిస్తే, మీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇష్టపడతారు.. ఇది రైస్, రోటీ, చపాతీ వంటి వాటితో అద్భుతంగా సరిపోతుంది.

కావలసిన పదార్థాలు:

  • మటన్..
  • ఉల్లిపాయలు: 3 మీడియం సైజు
  • టమాటా: 1 -2 మీడియం సైజు
  • పచ్చిమిరపకాయలు: 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
  • పెరుగు: 1/2 కప్పు (మరీ పుల్లటిది కాకుండా)
  • ఆయిల్: 4-5 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు: 2 1/2 టీ స్పూన్లు (రుచికి సరిపడా)
  • పసుపు: 1/2 టీ స్పూన్
  • కారం: 3 టీ స్పూన్లు (మీ స్పైసీ స్థాయిని బట్టి)
  • ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
  • గరం మసాలా పౌడర్: 1 టీ స్పూన్ (లేదా మటన్ మసాలా)
  • యాలకులు: 4
  • చెక్క: చిన్న ముక్క
  • లవంగాలు: 4
  • జీలకర్ర: 1/2 టీ స్పూన్
  • జీడిపప్పు: 10
  • కొత్తిమీర: కొద్దిగా
  • కరివేపాకు: 1 రెమ్మ
  • నీళ్లు: 1/2 లీటరు (గ్రేవీ చిక్కదనాన్ని బట్టి)

తయారీ విధానం:

ఉల్లిపాయలు వేయించడం: ముందుగా, ప్రెషర్ కుక్కర్‌లో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత, మూడు మీడియం సైజు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసి వేయండి. మీడియం ఫ్లేమ్‌లో ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు బాగా వేయించుకోండి. వేగిన ఉల్లిపాయలను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

మసాలా దినుసులు వేయడం: ఇప్పుడు అదే నూనెలో నాలుగు యాలకులు, చిన్న చెక్క ముక్క, నాలుగు లవంగాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్‌గా వేయించుకోండి. కావాలంటే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు.

పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్: మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత, మూడు పచ్చిమిరపకాయలను పొడవుగా కట్ చేసి వేయండి. అలాగే, ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఫ్రెష్ పేస్ట్ వాడటం వలన మటన్ కర్రీ రుచి మరింత బాగుంటుంది.

మటన్ – సుగంధ ద్రవ్యాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత, అర కిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్‌ను వేయండి. రెండున్నర టీ స్పూన్ల ఉప్పు (మీ రుచికి తగ్గట్టు), అర టీ స్పూన్ పసుపు, మూడు టీ స్పూన్ల కారం (మీ స్పైసీ స్థాయిని బట్టి) వేసి బాగా కలపండి. మీడియం లేదా సిమ్ ఫ్లేమ్‌లో రెండు, మూడు నిమిషాలు మటన్‌ను ఈ నూనెలో వేయించుకోండి. ఇలా చేయడం వలన మటన్ రుచి పెరుగుతుంది.

టమాటా – పెరుగు: రెండు మూడు నిమిషాల తర్వాత, ఒక మీడియం సైజు టమాటా ముక్కలను వేయండి. ఆ తర్వాత అర కప్పు పెరుగును చేర్చండి. పెరుగు మరీ పుల్లటిది కాకుండా, మరీ ఫ్రెష్‌ది కాకుండా మధ్యస్థంగా ఉన్నది ఎంచుకోండి. పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్‌ను సిమ్‌లో ఉంచి బాగా కలపండి. హై ఫ్లేమ్‌లో వేస్తే పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది.

పదార్ధాల మిశ్రమం ఉడకబెట్టడం: పెరుగు పూర్తిగా కలిసిపోయిన తర్వాత, ఫ్లేమ్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, కుక్కర్‌కు రబ్బర్ లేకుండా మూత పెట్టండి. పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి.

ఆనియన్-జీడిపప్పు పేస్ట్: ఈలోపు, చిన్న మిక్సీ జార్ తీసుకుని, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేయండి. దీనితో పాటు పది జీడిపప్పులను వేసి, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి.

చివరి దశ వంట: పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. మటన్ నుండి నీళ్లు వచ్చి, చిక్కగా ఉడుకుతూ, నూనె పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ-జీడిపప్పు పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి.

నీళ్లు – చివరి మసాలాలు: ఇప్పుడు అర లీటరు దాకా నీళ్లు పోసుకోండి. గ్రేవీ చిక్కగా కావాలంటే నీళ్లు తగ్గించుకోవచ్చు, పలుచగా కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు. నీళ్లు పోసి కలిపిన తర్వాత, ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ (లేదా మటన్ మసాలా) వేయండి. కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు వేసి మొత్తం కలిపి కుక్కర్‌కు మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో ఐదు లేదా ఆరు విజిల్స్ రానివ్వండి.

మొత్తం ఆరు విజిల్స్ వచ్చి, ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్ మూత తెరవండి. ఇప్పుడు మీకు చిక్కటి గ్రేవీతో మెత్తగా.. రుచికరమైన మటన్ కర్రీ సిద్ధంగా ఉంటుంది. మీకు ఇంకా చిక్కగా కావాలంటే, మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవచ్చు. కానీ చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది కాబట్టి, ఈ దశలో స్టవ్ ఆఫ్ చేసుకోవడం సరైనది. ముక్క ఉడికిందో లేదో తనిఖీ చేయండి. ఒకవేళ మటన్ ముదిరినదై ఉండి, ఉడకకపోతే, ఇంకో రెండు విజిల్స్ రానివ్వండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా రైస్, రోటీ, చపాతీతో సర్వ్ చేసుకోండి. ఈ స్పైసీ మటన్ కర్రీ రుచి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

Follow Us