
మన భారతీయ సాంప్రదాయ వంటకాల్లో నెయ్యికి (Ghee) ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, లేదా రోటీలు, చపాతీలకు నెయ్యి రాసుకుని తిన్నా ఆ రుచే వేరు. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి కేవలం రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్, బరువు తగ్గడం (Weight Loss) పై శ్రద్ధ పెట్టే వారి సంఖ్య పెరిగింది. నెయ్యి తింటే లావవుతామనే భయంతో చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారు. మరి నిజంగానే ఒక చెంచా నెయ్యి తింటే శరీరంలో ఎన్ని క్యాలరీలు పెరుగుతాయి? దీనివల్ల కలిగే లాభనష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణుల లెక్కల ప్రకారం.. మనం తినే ఒక టేబుల్‌స్పూన్ (సుమారు 14-15 గ్రాములు) స్వచ్ఛమైన నెయ్యిలో దాదాపు 120 నుండి 130 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 100 శాతం కొవ్వు (Fats) నిల్వలు ఉంటాయి. అందులోనూ శాచురేటెడ్ ఫ్యాట్స్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మీరు రోజువారీ తినే ఆహారానికి అదనంగా ఒక చెంచా నెయ్యిని జోడిస్తే, మీ శరీరంలో క్యాలరీల శాతం అంత మేర పెరుగుతుందని గుర్తించుకోవాలి.
పరిమితంగా నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో మేలు చేకూరుతుంది. నెయ్యిలో ఉండే బ్యుటిరిక్ యాసిడ్ (Butyric acid) ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. నెయ్యి శరీరానికి సహజమైన లూబ్రికెంట్‌గా పనిచేస్తుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి, కంటి చూపుకు ఎంతో మంచివి.
బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారు నెయ్యిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. నెయ్యిలో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల మనం ఇతర జంక్ ఫుడ్స్ తినకుండా ఉండవచ్చు. అయితే, ఇదంతా కేవలం పరిమితంగా తీసుకున్నప్పుడే సాధ్యమవుతుంది.
ఒక సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 1 నుండి 2 టీస్పూన్ల నెయ్యిని ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు. అయితే, ఇప్పటికే అధిక బరువు, గుండె జబ్బులు లేదా హై కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు మాత్రం వైద్యుల లేదా డైటీషియన్ల సలహా మేరకే నెయ్యిని తమ ఆహారంలో చేర్చుకోవడం శ్రేయస్కరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..