
నేటి వేగవంతమైన జీవనశైలిలో మద్యం చాలా మందికి రోజువారీ అలవాటుగా మారింది. ఒత్తిడి తగ్గించుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి ఇలా ఫీలింగ్ ఏదైనా మద్యంతోనే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే మద్యం సేవించేటప్పుడు చాలా మంది సైడ్ డిష్‌గా ఊరగాయలు, కబాబ్‌లు, కరకరలాడే స్నాక్స్, కారంగా ఉండే స్నాక్స్ తింటుంటారు. నిజానికి మద్యం సేవించేటప్పుడు కొన్న ఆహారాలను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయట. కాబట్టి మద్యంతో పాటు ఏయే ఆహారాలను తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం..
బీరు తాగుతున్నప్పుడు శాండ్‌విచ్‌లు, బర్గర్‌ల వంటి రొట్టె ఆధారిత ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. ఎందుకంటే బీరు, రొట్టె రెండింటిలోనూ ‘ఈస్ట్’ ఉంటుంది. ఈ రెండూ కడుపులో కలిసినప్పుడు, ఈస్ట్ పరిమాణం పెరిగి కడుపు ఉబ్బరం, అధిక గ్యాస్‌కు దారితీస్తుంది. ఇది జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి బీరు తాగుతున్నప్పుడు వండిన కూరగాయలు, కూరగాయల సలాడ్‌లు తినడం మంచిది.
డార్క్ చాక్లెట్‌లో కెఫీన్, కడుపులో చికాకు కలిగించే కొన్ని పదార్థాలు ఉంటాయి. దీనిని ఆల్కహాల్‌తో కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, రిఫ్లక్స్ పెరగవచ్చు. డార్క్ చాక్లెట్‌లో కెఫీన్, కోకో ఉంటాయి. ఇవి ఎసిడిటీని పెంచుతాయి. ముఖ్యంగా ఇది ఆల్కహాల్‌తో కలిపినప్పుడు ‘యాసిడ్ రిఫ్లక్స్’ సమస్యలకు కారణం కావచ్చు. దీనివల్ల గుండెల్లో మంట కలగవచ్చు.
కందిపప్పు, బఠానీలు, చిక్కుడు వంటి పప్పుధాన్యాలను కూడా మద్యంతో పాటు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ ఆహారాలలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. మద్యంతో కలిపి తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియను గణనీయంగా నెమ్మదింపజేస్తుంది. ఫలితంగా ఆహారం ఎక్కువసేపు కడుపులో ఉండిపోతుంది. ఇది కడుపు నొప్పి, అజీర్ణానికి దారితీస్తుంది.
చాలా మంది చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కార్న్‌ఫ్లేక్స్ వంటి బాగా వేయించిన ఆహార పదార్థాలను ఆల్కహాల్‌తో పాటు తీసుకుంటారు. కానీ ఈ ఆహారాలలో ఉండే అధిక ఉప్పు శరీరం నుంచి నీటిని గ్రహిస్తుంది. ఆల్కహాల్ స్వయంగా శరీరాన్ని నిర్జలీకరణానికి గురి చేస్తుంది. ఇది శరీరంలో తీవ్రమైన నిర్జలీకరణానికి దారితీస్తుంది. దీనివల్ల మరుసటి రోజు ఉదయం తీవ్రమైన తలనొప్పి, అలసట కలగవచ్చు.
నారింజ పండ్లు పుల్లగా ఉండి, వాటిలో ఆమ్లం అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట కూడా కలగవచ్చు. అందువల్ల మద్యం సేవించేటప్పుడు నారింజ వంటి సిట్రస్ పండ్లను తినడం మానుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.