
వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడం మన భారతీయుల పురాతన సాంప్రదాయం. ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాదు, దీని వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు, ఆయుర్వేద, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. నెయ్యిలో ఉండే షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణక్రియను వేగవంతం చేసి, కడుపులో గ్యాస్ మరియు మంటను తగ్గిస్తాయి. అలాగే ఆహారంలో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కే వంటి కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం సులభంగా గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. వేడి అన్నంలో నెయ్యి చేర్చడం సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో వివరంగా తెలుసుకుందాం..
అన్నం తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అయితే, వేడి అన్నంలో నెయ్యిని కలిపినప్పుడు, నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు అన్నం జీర్ణమయ్యే వేగాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఇది మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునేవారికి ఎంతో మేలు చేస్తుంది.
మనం తినే ఆహారంలో ఉండే విటమిన్ A, D, E, K లు నీటిలో కరగవు, కేవలం కొవ్వు పదార్థాలలో మాత్రమే కరుగుతాయి. వేడి అన్నంలో నెయ్యి చేర్చడం వల్ల శరీరం ఈ ముఖ్యమైన విటమిన్లను సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలు, కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ అనే షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణ రసాల స్రావాన్ని పెంచుతుంది. వేడి అన్నంతో నెయ్యి తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.
వేడి అన్నంలో నెయ్యి కలపడం వల్ల జీర్ణవ్యవస్థలోని ప్రేగుల పొరలకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది కడుపులో ఆమ్లత, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం నెయ్యి సాత్విక ఆహారం. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా నాడీ వ్యవస్థను బలోపేతం చేసి, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
అందుకే మన పెద్దలు చెప్పిన ఈ సాంప్రదాయ అలవాటు కేవలం రుచికే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో అవసరం. అయితే రోజువారీ మోతాదులో 1-2 చెంచాల స్వచ్ఛమైన నెయ్యిని తీసుకోవడం శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..