అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
వండే ముందు పచ్చి చికెన్‌ను ఇంకా కడుగుతున్నారా? అయితే మీరు మీ కుటుంబ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నట్లేనని ఢిల్లీకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా హెచ్చరించారు. చికెన్‌ను కడగడం వల్ల బ్యాక్టీరియా చనిపోకపోగా, ఆ నీటి తుంపరల ద్వారా కిచెన్ అంతా వ్యాపించి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని స్పష్టం చేశారు. అసలు పచ్చి చికెన్‌ను ఎలా వండాలి? డాక్టర్ చెబుతున్న సేఫ్టీ టిప్స్ ఏంటో తెలుసుకుందాం..

చికెన్ ప్రియులు మార్కెట్ నుంచి మాంసం తెచ్చిన వెంటనే చేసే మొదటి పని.. ట్యాప్ కింద పెట్టి నీళ్లతో శుభ్రంగా కడగడం. నీళ్లతో కడిగితేనే చికెన్‌పై ఉన్న మురికి, బ్యాక్టీరియా పోయి పరిశుభ్రంగా మారుతుందని తరతరాలుగా అందరూ బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని, పైగా మీ మొత్తం వంటగదినే ప్రమాదంలోకి నెడుతుందని ఢిల్లీకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పచ్చి చికెన్‌ను కడగడం వల్ల జరిగే నష్టాలు, సురక్షితమైన వంట విధానంపై ఆయన కీలక విషయాలను వెల్లడించారు.
పచ్చి చికెన్‌ను నీటితో ఎందుకు కడగకూడదు?
సాధారణంగా పచ్చి చికెన్‌పై సాల్మొనెల్లా, కాంపిలోబాక్టర్ వంటి అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి కంటికి కనిపించవు. చాలామంది నీటితో కడిగితే ఆ బ్యాక్టీరియా పోతుందని భావిస్తారు, కానీ నీటి ప్రవాహానికి ఆ బ్యాక్టీరియా అస్సలు చనిపోదు. కుళాయి కింద చికెన్‌ను కడిగినప్పుడు, నీటి తుంపరలువేగంగా ఎగిరి చుట్టుపక్కల ఉన్న కిచెన్ కౌంటర్‌టాప్, సింక్, పక్కనే ఉన్న గిన్నెలు, స్పూన్లు, పండ్లు లేదా సలాడ్ల బౌల్స్‌పై పడతాయి. ఒక్క చిన్న నీటి తుంపర పడినా సరే.. ఆ ప్రదేశమంతా హానికర బ్యాక్టీరియాతో కలుషితం అవుతుంది. ఇది తెలియకుండా తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.
చికెన్‌ను సురక్షితంగా మార్చేది వండటమే.. కడగడం కాదు..
చికెన్‌ను సురక్షితంగా మార్చేది సరైన రీతిలో వండటమే తప్ప, నీళ్లతో కడగడం కాదు అని డాక్టర్ అలోక్ చోప్రా స్పష్టం చేశారు. అధిక ఉష్ణోగ్రత వద్ద మాత్రమే మాంసంలోని హానికర బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. చికెన్ లోపలి ఉష్ణోగ్రత దాదాపు సుమారు 74 డిగ్రీలు వచ్చే వరకు బాగా ఉడికిస్తే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. ఆ తర్వాత ఆ ఆహారం తినడానికి 100శాతం సురక్షితంగా మారుతుంది.
డాక్టర్ ఇచ్చే కిచెన్ సేఫ్టీ సూత్రాలు..
తరతరాలుగా వస్తున్న అలవాటును ఒక్కసారిగా మార్చుకోవడం కష్టమైనప్పటికీ, కుటుంబ ఆరోగ్యం కోసం ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరి అని డాక్టర్ చోప్రా సూచించారు.
సింక్ వదిలేయండి.. నేరుగా పాన్‌లోకి: ప్యాకెట్ లేదా మార్కెట్ నుంచి తెచ్చిన చికెన్‌ను నేరుగా వండే పాత్రలోకి లేదా పాన్‌లోకి తీసుకోవడమే ఉత్తమం.
తడిని తొలగించడానికి పేపర్ టవల్: చికెన్ మరీ తడిగా ఉంటే, డిస్పోజబుల్ పేపర్ టవల్‌తో మెల్లగా తడిని అద్ది, ఆ పేపర్‌ను వెంటనే డస్ట్‌బిన్‌లో పడేయాలి.
చేతులు శుభ్రం చేసుకోవాలి: పచ్చి చికెన్‌ను తాకిన వెంటనే వంటగదిలోని ఇతర వస్తువులను ముట్టుకోకుండా, చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి.
ప్రత్యేక బోర్డులు: పచ్చి మాంసం కోయడానికి ప్రత్యేకమైన కటింగ్ బోర్డులు, చాకులను వాడాలి. కూరగాయలు కోసే బోర్డులపై చికెన్ ముక్కలను ఉంచకూడదు. వంట పూర్తయిన తర్వాత కౌంటర్‌టాప్‌ను శానిటైజ్ చేసుకోవాలి.
