
మన దేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది కోట్ల మంది భావోద్వేగం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలామందికి టీ తాగడం అలవాటు. స్నేహితులతో కబుర్లు చెప్పాలన్నా, అలసటను క్షణంలో దూరం చేసుకోవాలన్నా ఒక కప్పు వేడి వేడి టీ సరిపోతుంది. అయితే రోజూ మనం ఎంతో ఇష్టంగా తాగే టీ కొన్నిసార్లు సరిగ్గా కుదరదు. దీనికి కారణం టీ తయారీలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే. దాదాపు 90 శాతం మందికి టీ చేసేటప్పుడు నీరు, పాలు, టీపొడి, పంచదార ఏ క్రమంలో వేయాలో సరైన అవగాహన ఉండదు. పర్‌ఫెక్ట్ టీ తయారీకి అనుసరించాల్సిన సరైన పద్ధతి ఇక్కడ చూద్దాం.
చాలా మంది నేరుగా గిన్నెలో పాలు పోసి టీ పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీటిని పోసి బాగా మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో కచ్చపచ్చగా దంచిన అల్లం, యాలకులు వేయాలి. వీటిని 3 నుంచి 4 నిమిషాల పాటు నీటిలో బాగా మరగనివ్వడం వల్ల వాటి సువాసన, సారం నీటిలోకి పూర్తిగా దిగుతుంది. ఆ తర్వాత తగినంత టీపొడి, పంచదార వేయాలి. వీటిని కూడా మరో కొన్ని నిమిషాలు నీటితో పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా చేయడం వల్ల టీ మంచి రంగును సంతరించుకుంటుంది. చివరగా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పాలను కలపాలి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన వెంటనే చల్లటి పాలను పోయకూడదు. పాలు పోశాక టీని మీడియం మంటపై చక్కగా మరిగించాలి. మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉంటే టీ మంచి చిక్కదనంతో రుచిగా వస్తుంది.
అల్లాన్ని తురుముకోవడం కంటే దంచి వేయడం వల్ల టీకి మంచి రుచి వస్తుంది. పాలు పోసిన తర్వాత టీని ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం లేదు. సరైన కొలతలు, సరైన క్రమాన్ని పాటించడం ద్వారా మీ ఇంట్లోనే హోటల్ స్టైల్ కడక్ ఛాయ్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ చిన్న మార్పులతో మీ రోజువారీ టీ రుచి అద్భుతంగా మారుతుంది!