AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎదిగే పిల్లలు, బాలింతలు తినాల్సిందే ఇదే.. శారీరక బలానికి, ఎముకల పుష్టికి ఒకే ఒక్క లడ్డు చాలు..

మినప సున్నుండలు రుచికరమైన సంప్రదాయ స్వీట్ మాత్రమే కాదు.. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు అందించే ఆహారం. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, శారీరక శ్రమ చేసే వారికి ఇవి మంచి ఎనర్జీ స్నాక్‌గా ఉపయోగపడతాయి. మినప పప్పు, బెల్లం లేదా చక్కెర, నెయ్యితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే మినప సున్నుండల రెసిపీ, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఎదిగే పిల్లలు, బాలింతలు తినాల్సిందే ఇదే.. శారీరక బలానికి, ఎముకల పుష్టికి ఒకే ఒక్క లడ్డు చాలు..
Minapa Sunnundalu
Shaik Madar Saheb
|

Updated on: Aug 23, 2026 | 4:06 PM

Share

ఉరుకులు పరుగుల జీవితంలో సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడే అద్భుతమైన సాంప్రదాయ ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలాంటి ప్రధానమైన పోషకాహారంలో.. మినప లడ్డూలు (సున్నుండలు) ఒకటి.. వీటిలో ఎన్నో పోషకాలు దాగుంటాయి.. మినప లడ్డూలు చిన్నా పెద్దా.. అందరి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని మినప పప్పు, బెల్లం లేదా పంచదార, నెయ్యితో సులభంగా తయారు చేస్తారు.. వీటిలో ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మినప సున్నుండలు చాలా ఫేమస్.. ఆంధ్రాతోపాటు.. తెలంగాణలో కూడా శారీరక బలానికి, ఎముకల పుష్టికి తరచూ వీటిని తింటుంటారు. అయితే.. కథనంలో ఆరోగ్యకరమైన, రుచికరమైన, సంప్రదాయ స్వీట్ అయిన మినప సున్నుండలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..

ఈ లడ్డూలు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి.. ఇవి పిల్లలు, పెద్దలు, గర్భిణీ స్త్రీలకు, ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకునే ఎవరికైనా అద్భుతమైన ఎంపిక.. అని ఆహార నిపుణులు చెబుతున్నారు.

సున్నుండల తయారీ విధానం:

సున్నుండల తయారీకి మినపగుళ్లను ఉపయోగిస్తారు. పూర్వకాలంలో నానమ్మలు మినుములను తెచ్చి, వేయించి, తిరగలిలో విసిరేవారు. ఇప్పుడు, పనులు త్వరగా అవ్వడం కోసం మినపగుళ్లను నేరుగా ఉపయోగించచ్చు.. ముందుగా, మినపగుళ్లను సన్నని మంటపై, నెమ్మదిగా, మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ప్రక్రియ చాలా ముఖ్యం, ఇది సున్నుండలకు సరైన రుచిని, సువాసనను ఇస్తుంది. వేయించిన మినపగుళ్లను చల్లార్చుకోవాలి.

తరువాత, ఈ మిశ్రమాన్ని మిల్లులో పౌడర్‌గా ఆడించుకోవాలి. ఇంట్లో అంత మెత్తగా ఆడించడం కష్టం కాబట్టి మిల్లును ఉపయోగించడం మంచిది. లడ్డూలు ఎంత సాఫ్ట్‌గా ఉండాలనేది మనకు కావలసిన దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పిల్లలు మురుమురుగా ఉండే లడ్డూల కంటే సాఫ్ట్‌గా ఉండే లడ్డూలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు..

మినుములతో పాటు, రెండు గుప్పెళ్ల బియ్యం కూడా తీసుకుని, వాటిని కూడా మంచిగా వేయించి, మినపగుళ్లతో కలిపి ఆడించుకోవాలి. ఇది సున్నుండలకు మంచి బంధాన్ని ఇస్తుంది. ఒక కేజీ మినుములకు, ఒక కేజీ చక్కెరను తీసుకోవచ్చు.

బెల్లం లేదా చక్కెరను విడిగా మిక్సీలో మెత్తగా పౌడర్‌ చేసుకోవాలి. ఈ సమయంలో మీకు కావాలంటే ఇలాచీలను కూడా యాడ్ చేుకోవచ్చు… బెల్లం అయితే కొంచెం లేట్ అవుతుంది.. ఎందుకంటే బెల్లం ఉండలుగా ఉండి, కలపడానికి ఎక్కువ సమయం పడుతుంది.. చక్కెర అయితే.. ఐదు నిమిషాల్లోనే సులభంగా కలిసిపోతుంది. బెల్లం లేదా.. చక్కెర పరిమాణం తినే వారిని బట్టి మారవచ్చు..

వేయించిన మినప పిండి, చక్కెర పొడిని పెద్ద పాత్రలో వేసి మంచిగా కలుపుకోవాలి. నెయ్యిని బాగా వేడిచేసి, కొద్దికొద్దిగా పిండి మిశ్రమంలో వేసుకుంటూ కలపాలి. వేడి నెయ్యిని ఒకేసారి కాకుండా, కొద్దికొద్దిగా వేస్తూ కలపడం వల్ల అది చల్లబడకుండా లడ్డూలు చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. నెయ్యిని కలుపుకుంటూ, కావలసిన పరిమాణంలో లడ్డూలను చుట్టుకోవాలి. ఒక కేజీ మినుములతో చాలా ఉండలు తయారవుతాయి.

ఈ మినప సున్నుండలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఈ లడ్డూల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి:

  • ప్రోటీన్ పుష్కలం: ఇవి ప్రోటీన్‌తో నిండి ఉంటాయి, కండరాల అభివృద్ధికి, మరమ్మత్తుకు సహాయపడతాయి.
  • శక్తిని పెంచుతుంది: ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి, ముఖ్యంగా పిల్లలు, ఎక్కువ శ్రమించే వారికి మంచివి.
  • ఎముకలను బలపరుస్తుంది: మినపగుళ్ళలో ఉండే పోషకాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి.
  • జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
  • పెరుగుతున్న పిల్లలకు మంచిది: పెరుగుతున్న పిల్లలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

ఆరోగ్యకరమైన ఇంట్లో తయారుచేసిన స్నాక్: కృత్రిమ రంగులు, సంరక్షక పదార్థాలు లేకుండా ఇంట్లో తయారుచేసుకోవచ్చు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..

ఇంకెందుకు ఆలస్యం.. ఈ సులభమైన రెసిపీతో మీరు కూడా ఇంట్లో ఆరోగ్యకరమైన, రుచికరమైన మినప సున్నుండలను తయారుచేసుకోండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us