
ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న కొద్దీ, పాత పద్ధతులకు కొత్త మెరుగులు దిద్దుతున్నారు నేటి జనం. టీలో అల్లం కలుపుకోవడం మనకు తెలిసిందే.. కానీ ఇప్పుడు అల్లం కాఫీ సరికొత్త వెయిట్ లాస్ మంత్రంగా మారుతోంది. జీవక్రియను వేగవంతం చేయడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు ఈ కాంబినేషన్ అద్భుతాలు చేస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. అయితే దీని వల్ల లాభాలు ఎంత ఉన్నాయో, కొన్ని నష్టాలు కూడా అంతే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అల్లంలో సహజమైన థర్మోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచి, కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడతాయి. కాఫీలోని కెఫిన్ కూడా మెటబాలిజంను పెంచుతుంది కాబట్టి ఈ రెండింటి కలయిక బరువు తగ్గాలనుకునే వారికి ఒక వరంగా మారుతోంది.
కాఫీ, అల్లం కలిపి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇది అనవసరమైన చిరుతిళ్లు తినకుండా నిరోధిస్తుంది. ముఖ్యంగా వ్యాయామానికి ముందు దీన్ని తాగడం వల్ల శక్తి స్థాయిలు పెరిగి, ఎక్కువ సేపు వ్యాయామం చేసే సత్తువ లభిస్తుంది.
అల్లం వల్ల గ్యాస్, ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా శరీరంలో కొవ్వు నిల్వలు పెరగకుండా ఇది చూస్తుంది.
ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అతిగా తాగితే ముప్పేనని వైద్యులు చెబుతున్నారు.
యాసిడ్ రిఫ్లక్స్: కాఫీ, అల్లం రెండూ శరీరంపై వేడి ప్రభావాన్ని చూపుతాయి. అల్సర్, అసిడిటీ లేదా గుండెల్లో మంట ఉన్నవారికి ఈ పానీయం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
నిద్రలేమి: కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. రాత్రి వేళల్లో ఇది తాగితే ఆందోళన, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.
హృదయ స్పందన: అతిగా తీసుకుంటే హృదయ స్పందన వేగవంతం అయ్యే ప్రమాదం ఉంది.