AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్లు vs చికెన్.. జిమ్‌ చేసేవారికి ఏది బెస్ట్? దీంట్లో తక్కువ కేలరీలు.. ఎక్కువ ప్రోటీన్..

చికెన్, ఉడకబెట్టిన గుడ్లు.. ప్రోటీన్‌కు నిలయాలు. చికెన్ తింటే ఎక్కువ ప్రోటీన్ వస్తుందా? లేక గుడ్లు తింటే మంచిదా? ఈ అనుమానం మీకు కూడా ఉందా? దాదాపు ఒకే స్థాయి కేలరీలు ఉన్నప్పటికీ.. ఒక దానిలో డబుల్ ప్రోటీన్ లభిస్తుంది. ఇంతకీ ఈ రెండింటిలో హెల్తీ ప్రోటీన్ కింగ్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గుడ్లు vs చికెన్.. జిమ్‌ చేసేవారికి ఏది బెస్ట్? దీంట్లో తక్కువ కేలరీలు.. ఎక్కువ ప్రోటీన్..
Chicken Vs Eggs For Protein
Krishna S
|

Updated on: Jul 31, 2026 | 8:11 PM

Share

బాడీ బిల్డింగ్, వెయిట్ లాస్ లేదా శరీరానికి సరిపడా ప్రోటీన్ అందించడం అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి రెండే రెండు.. ఒకటి చికెన్, మరొకటి గుడ్లు . రెండూ కూడా అధిక పోషకాలు ఉన్న ఆహారాలే అయినప్పటికీ, రెండింటి మధ్య కేలరీలు, ప్రోటీన్ విషయంలో చాలా తేడా ఉంది. తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ పొందడమే మీ లక్ష్యమైతే.. ఈ రెండింటిలో ఒకదానికి స్పష్టమైన ఆధిక్యత ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యుఎస్‌డిఏ నివేదిక ప్రకారం.. 100 గ్రాముల ఉడకబెట్టిన చికెన్ బ్రెస్ట్, 100 గ్రాముల ఉడకబెట్టిన గుడ్ల మధ్య పోషకాల వివరాల గురించి తెలుసుకుందాం..

పోషకాల పోలిక

చికెన్ బ్రెస్ట్: 31 గ్రాముల ప్రోటీన్, 165 కేలరీలు, 3.6 గ్రాముల కొవ్వు

ఉడకబెట్టిన గుడ్డు: 12.6 గ్రాముల ప్రోటీన్, 155 కేలరీలు, 10.6 గ్రాముల కొవ్వు

ఈ రెండింటిలో కేలరీల తేడా చాలా తక్కువ. కానీ ప్రధాన తేడా అంతా ప్రోటీన్, కొవ్వు విషయంలోనే ఉంది. గుడ్డుతో పోలిస్తే చికెన్ బ్రెస్ట్ రెట్టింపు కంటే ఎక్కువ ప్రోటీన్‌ను అందిస్తుంది. అలాగే ఇందులో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ.

చికెన్ బ్రెస్ట్ ఎందుకు బెస్ట్?

తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ పొందాలనుకునే వారికి చికెన్ బ్రెస్ట్ ఉత్తమ ఎంపిక.

కండరాల పునర్నిర్మాణం: చికెన్‌లో ప్రోటీన్‌తో పాటు నియాసిన్ , విటమిన్ బి6, ఫాస్పరస్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి మార్పిడికి, రోగనిరోధక శక్తి పెంచడానికి మరియు కండరాల పనితీరుకు ఎంతో దోహదపడతాయి.

కడుపు నిండిన భావన: ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కడుపు త్వరగా నిండినట్లు అనిపించి, ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.

గుడ్లు అందించే ప్రత్యేక ప్రయోజనాలు

చికెన్‌తో పోలిస్తే గుడ్లలో ప్రోటీన్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, గుడ్లలో లభించే కొన్ని ప్రత్యేక పోషకాలను మనం నిర్లక్ష్యం చేయలేం. గుడ్డు పసుపుసొనను అస్సలు పారవేయకూడదని న్యూట్రిషనిస్ట్ షాలినీ సుధాకర్ సలహా ఇస్తున్నారు. ఇందులో విటమిన్లు ఎ, డి, ఇ, బి12 లభిస్తాయి. మెదడు పనితీరుకు అవసరమైన కోలిన్ గుడ్లలో పుష్కలంగా ఉంటుంది. అలాగే గుడ్డులో ఉండే లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రూపాలి దత్తా ప్రకారం.. గుడ్లను కేవలం కొలెస్ట్రాల్ కోణంలోనే చూడకూడదని, అవి సమతుల్య ఆహారంలో భాగమని వెల్లడించారు.

రెండింటిలో దేనిని ఎంచుకోవాలి?

మీ ప్రధాన లక్ష్యం తక్కువ కేలరీలలో ఎక్కువ ప్రోటీన్ పొందడం అయితే, చికెన్ బెస్ట్. ఇది దాదాపు అదే కేలరీలలో గుడ్డు కంటే రెట్టింపు ప్రోటీన్‌ను అందిస్తుంది. అయితే విటమిన్లు, ఇతర సూక్ష్మపోషకాల పరంగా గుడ్లు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఈ రెండింటినీ శత్రువులుగా కాకుండా మీ దినచర్యలో సమతుల్యంగా తీసుకుంటే పూర్తి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Follow Us