
ఈ రోజుల్లో సూపర్ ఫుడ్స్ గురించి చాలా చర్చ జరుగుతోంది. బయట దొరికే నాలుగు, ఐదు రకాల పదార్థాల నుంచి పొందే ఆరోగ్య ప్రయోజనాలను ఒకే ఒక్క పదార్థం అందిస్తే దానిని సూపర్ ఫుడ్ అంటారు. అటువంటి కోవకే చెందినదే చియా గింజలు. మెక్సికో మూలాలున్న ఈ గింజలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రత్యేకించి ఓట్స్‌తో కలిపి లేదా నానబెట్టి తీసుకోవడం ద్వారా చాలా కుటుంబాలు వీటిని వినియోగిస్తున్నాయి. చియా గింజల్లో పోషకాలు దట్టంగా నిక్షిప్తమై ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్, ఫైబర్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి శరీరానికి అవసరమైన ఎన్నో కీలక పోషకాలు ఒకేసారి లభిస్తాయి.
ఈ అరుదైన పోషకాల కలయికే చియా గింజలను సూపర్ ఫుడ్‌గా మార్చింది. రోజుకు కనీసం రెండు నుండి మూడు స్పూన్ల చియా గింజలను ఏదో ఒక రూపంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పొడి చేసి కూరల్లో కలుపుకోవచ్చు.. రొట్టెల్లో వాడవచ్చు లేదా ఓట్స్‌తో పాటు ఉడికించి తీసుకోవచ్చు.
జీర్ణక్రియ మెరుగుదల: చియా గింజల్లో అధిక స్థాయిలో ఫైబర్ ఉంటుంది. ఈ పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది.. ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్‌ను శరీరం శోషించుకోకుండా చూస్తుంది. చియా గింజల్లో కరిగే, కరగని రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. ఇవి ప్రేగు కదలికలను (పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్) ప్రోత్సహిస్తాయి. తద్వారా మలబద్ధకం, పైల్స్, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా నివారిస్తాయి. దీర్ఘకాలంలో అల్సర్ ఫార్మేషన్ అవకాశాలను తగ్గిస్తాయి.
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు: చియా గింజల్లో “క్వెర్సెటిన్” వంటి ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఉత్పత్తయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీసి, ఎముకలు, కండరాలు, అంతర్గత అవయవాలు, చివరికి DNA, RNA లను కూడా ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆటోఇమ్యూన్ డిజార్డర్లు (సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, SLE, లూపస్) వంటివి పెరుగుతున్నాయి. చియా గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు ఈ ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొని, అంతర్గత అవయవాల నష్టాన్ని, శరీరంలో వాపును తగ్గిస్తాయి.
ఎముకల ఆరోగ్యం: చియా గింజలు ఎముకలకు చాలా మంచివి. వీటిలో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. ఈ పోషకాలు బోన్ మినరల్ డెన్సిటీ (BMD)ని మెయింటైన్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. చియా గింజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు తొందరగా బలహీనపడవు.
గుండె ఆరోగ్యం: చియా గింజల్లో ALA (ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్) ఉంటుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది LDL (చెడు) కొలెస్ట్రాల్ మెటబాలిజాన్ని పెంచి, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో శరీరంలో బ్లాకేజీలు ఏర్పడకుండా సహాయపడుతుంది. తద్వారా గుండెకు చాలా మంచిది.
రక్తంలో చక్కెర నియంత్రణ – డయాబెటిస్: చియా గింజలు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ నెమ్మది జీర్ణక్రియ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా విడుదల అవుతాయి. తద్వారా చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా డయాబెటిస్‌ను నియంత్రించడంలో పరోక్షంగా సహాయపడుతుంది.
కణజాల – మృదులాస్థి ఆరోగ్యం: శరీరంలోని మృదు కణజాలాలైన మోకాళ్ళలోని మృదులాస్థి (కార్టిలేజ్), వెన్నెముకలోని డిస్క్‌ల ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడంలో చియా గింజలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.
ఈ విధంగా చియా గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కొత్తగా ప్రయత్నించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. ప్రతిరోజూ 2-3 స్పూన్ల చియా గింజలు ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..