AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిక్కటి గ్రేవీతో నోరూరించే కోడిగుడ్డు కూర.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది

Super Tasty Egg Curry Recipe: కోడిగుడ్లతో తయారుచేసే వంటకాలకు భారతీయ భోజనంలో ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడూ రొటీన్‌గా చేసుకునే కూరల్లా కాకుండా, కాస్త భిన్నంగా అత్యంత రుచికరమైన చిక్కటి గ్రేవీతో ఎగ్ కర్రీని ఇంట్లోనే సులువుగా ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం.

చిక్కటి గ్రేవీతో నోరూరించే కోడిగుడ్డు కూర.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది
Egg Masala Curry Recipe
Anand T
|

Updated on: Oct 03, 2026 | 4:03 PM

Share

మీకు రోటీన్ ఎగ్‌కరీ తిని బోర్ కొడుతోందా.. ఈ సారి కొత్తగా ఎగ్‌కర్రీని ట్రై చేయాలిని అనిపిస్తోందా? అయితే ఈ మీరు కచ్చితంగా ఈ రెసిపీ గురించి తెలుసుకోవాల్సిందే.. చపాతీ నుంచి మొదలుకొని ప్లెయిన్ బిర్యానీ, బగారా రైస్, జీరా రైస్, నాను, బటర్ నాను ఇలా దేనిలోకైనా అద్భుతంగా ఉండేలా సరికొత్త రుచితో ఎగ్‌ మసాలా కర్రీని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.ఈ కర్రీ ఒక్కసారి రుచి చూశారంటే కుటుంబ సభ్యులు మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు.

ఎగ్‌ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు

  • గుడ్లు: ఉడికించిన కోడిగుడ్లు
  • మసాలా పేస్ట్ కోసం: అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, జీడిపప్పు
  • కూర కోసం: తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, శనగపిండి
  • మసాలా పొడులు: పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి
  • ఇతరాలు: నూనె, తగినంత ఉప్పు

ఎగ్‌ మసాల కర్రీ తయారీ విధానం

స్టెప్-1: ముందుగా ఐదు కోడిగుడ్లను ఉడికించి, పొట్టు తీసి వాటిని మధ్యలోకి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి . ఇప్పుడు మిక్సీ జార్‌లో 1 అంగుళం అల్లం ముక్కలు, 6 నుంచి 7 వెల్లుల్లి రెమ్మలు, 3 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, ఒక చిన్న కొత్తిమీర కట్ట, ఒక పెద్ద ఉల్లిపాయ 6 నుంచి 7 జీడిపప్పులు వేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్టులా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి.

స్టెప్-2: ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేసి, నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక, ఒక పెద్ద ఉల్లిపాయను సన్నని ముక్కలుగా తరిగి వేసి, లేత బంగారు రంగు వచ్చేవరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత, రెండు మీడియం సైజు టమాటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుతూ మగ్గించాలి.

స్టెప్-3: టమాటాలు పూర్తిగా మెత్తబడిన తర్వాత స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టి ఆఫ్ టీస్పూన్ పసుపు, రెండు టీస్పూన్ల కారం, ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఆఫ్ టీస్పూన్ జీలకర్ర పొడి, ఒక టీస్పూన్ గరం మసాలా పొడి, ఒక టీస్పూన్ మిరియాల పొడి వేసి మాడకుండా జాగ్రత్తగా కలపాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి మసాలా పేస్ట్‌ను ఇందులో వేసి, లో ఫ్లేమ్‌లోనే బాగా వేయించాలి. ఈ పేస్ట్ నుంచి నూనె పైకి తేలే వరకు వేయించడం ముఖ్యం, అప్పుడే కూరకు మంచి రుచి వస్తుంది, పచ్చి వాసన పోతుంది.

స్టెప్-4: మసాలా బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి కలపాలి. గ్రేవీ మరీ చిక్కగా అనిపిస్తే మరో ఆఫ్ గ్లాసు నీళ్లు చేర్చవచ్చు. రుచి చూసి సరిపడా ఉప్పు, కారం లేదా ఇతర మసాలాలు అవసరమైతే ఇప్పుడు కలుపుకోవాలి. గ్రేవీ కాస్త పల్చగా ఉండేలా చూసుకుని మూత పెట్టి, లో టు మీడియం ఫ్లేమ్‌లో 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి.

స్టెప్-5: మూడు నిమిషాల తర్వాత మూత తీసి, రెండు టీస్పూన్ల శనగపిండిని కొద్దిగా నీటిలో ఉండలు లేకుండా కలిపి గ్రేవీలో పోయాలి. లో ఫ్లేమ్‌లో ఉంచి ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. శనగపిండి వేయడం వల్ల కూరకు మంచి చిక్కదనం, అద్భుతమైన రుచి వస్తాయి. అనంతరం మూత పెట్టి మరో 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. అడుగంటకుండా మధ్యలో ఒకటి రెండు సార్లు కలపాలి.

స్టెప్-6: గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలిన తర్వాత, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉడికించిన గుడ్లను గ్రేవీ పైభాగంలో జాగ్రత్తగా అమర్చాలి. గరిటతో ఎక్కువగా తిప్పకుండా, గుడ్ల పైభాగంలో మెల్లగా గ్రేవీని వేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, మూత పెట్టి లో ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ సిద్ధమవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us