AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: రోజూ చికెన్ తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటంతో చాలామంది తమ రోజువారీ డైట్‌లో దీనిని చేర్చుకుంటారు. అయితే ప్రతిరోజూ అధికంగా చికెన్ తీసుకోవడం లేదా ఒకే విధంగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా చికెన్‌ను ఎలా వండుతున్నాం, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. రోజూ చికెన్ తినేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Chicken: రోజూ చికెన్ తింటున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Chicken Side Effects
Janardhan Veluru
|

Updated on: Sep 08, 2026 | 7:48 PM

Share

చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉండటంతో చాలామంది తమ రోజువారీ ఆహారంలో దీనికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, వ్యాయామం చేసేవారు చికెన్‌ను తప్పకుండా తమ డైట్‌లో చేర్చుకుంటారు. చికెన్ ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ పరిమితికి మించి లేదా ప్రతిరోజూ ఒకే రకంగా చికెన్ తీసుకోవడం ద్వారా మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. చికెన్‌ను ఎలా వండుతున్నాం? ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం? దానితో పాటు ఏ ఆహారాలను కలిపి తీసుకుంటున్నాం? అనే అంశాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ ఉప్పు, నూనెతో తయారుచేసిన చికెన్ వంటకాలను తరచూ తీసుకోవడం సమస్యలకు దారితీయవచ్చు.

1. ఉప్పు తీసుకోవడం పెరిగితే..

చికెన్ వంటకాల్లో ఉప్పు ఎక్కువగా ఉపయోగిస్తే రోజువారీ సోడియం తీసుకోవడం పెరుగుతుంది. అధిక సోడియం తీసుకోవడం రక్తపోటు వంటి సమస్యలతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల చికెన్‌ను తక్కువ ఉప్పుతో, ఆరోగ్యకరమైన పద్ధతిలో తయారు చేసుకోవడం మంచిది.

2. జీర్ణ సమస్యలు, మలబద్ధకం

చికెన్‌లో ప్రోటీన్ ఉన్నప్పటికీ ఫైబర్ ఉండదు. కాబట్టి కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాలి. లేకపోతే మొత్తం ఆహారంలో ఫైబర్ తక్కువై మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.

3. గుండె ఆరోగ్యంపై ప్రభావం

చికెన్‌ను ఎక్కువగా తినడం కంటే, దాన్ని ఎలా వండుతున్నామన్నది కూడా ముఖ్యం. ముఖ్యంగా డీప్ ఫ్రైడ్, ఎక్కువ నూనె లేదా అధిక కొవ్వుతో తయారుచేసిన చికెన్ వంటకాలను తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదు. అధికంగా తీసుకునే ప్రాసెస్డ్ లేదా కొవ్వు అధికంగా ఉన్న మాంసాహారం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

4. బరువు పెరిగే అవకాశం

చికెన్‌లో ప్రోటీన్ ఉన్నప్పటికీ, చికెన్ వంటకాల్లో అదనంగా నూనె, వెన్న, సాస్‌లు, ఇతర అధిక క్యాలరీ పదార్థాలు కలిస్తే మొత్తం క్యాలరీలు పెరుగుతాయి. రోజువారీ అవసరానికి మించి క్యాలరీలు తీసుకుంటే కాలక్రమంలో బరువు పెరిగే అవకాశముంది.

5. యూరిక్ యాసిడ్ విషయంలో జాగ్రత్త

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీరంలోని యూరిక్ యాసిడ్ మెటబాలిజంతో సంబంధం కలిగి ఉంటాయి. ఇప్పటికే యూరిక్ యాసిడ్ లేదా గౌట్ సమస్య ఉన్నవారు మాంసాహారాన్ని ఎంత పరిమాణంలో తీసుకోవాలో వైద్యుడు లేదా డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది.

6. ఆహారంలో వైవిధ్యం తగ్గిపోవచ్చు

రోజూ చికెన్‌పైనే ఆధారపడటం వల్ల ఇతర ముఖ్యమైన ఆహార పదార్థాలను తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. శరీరానికి అవసరమైన ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పొందడానికి కూరగాయలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి వివిధ రకాల ఆహారాలను కూడా తీసుకోవాలి.

చికెన్ తినేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

చికెన్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. పరిమిత పరిమాణంలో, తక్కువ నూనెతో, బాగా ఉడికించి తీసుకోవడం మంచిది. డీప్ ఫ్రైడ్ చికెన్‌కు బదులుగా గ్రిల్డ్, బాయిల్డ్ లేదా తక్కువ నూనెతో వండిన చికెన్‌ను ఎంచుకోవచ్చు. అలాగే చికెన్‌తో పాటు కూరగాయలు, ఆకుకూరలు లేదా ఇతర ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా ఆహారాన్ని సమతుల్యంగా మార్చుకోవచ్చు.

(గమనిక: ఈ సమాచారం ప్రాధమిక అవగాహన కోసం మాత్రమే. లోతైన సమాచారం కావాలంటే వైద్య నిపుణులు లేదా పౌష్షికాహార నిపుణులను సంప్రదించగలరు..)

Follow Us