కష్టపడొద్దు చాలా సింపుల్.. ఇలా చేస్తే బట్టలు ఇట్టే ఆరతాయ్.. వాసన కూడా రాదు..
వర్షాకాలంలో బట్టలు ఆరడం చాలా సమయం పడుతుంది.. ఈ సమస్యను దాదాపు అందరూ ఎదుర్కొంటుంటారు. అయితే.. వర్షాకాలంలో బట్టలు ఆరకపోయినా.. దుర్వాసన రాకుండా ఉండాలన్నా.. ఈ 8 సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.. దీనిద్వారా.. బట్టలు త్వరగా ఆరడంతో పాటు చెడు వాసన కూడా రాకుండా ఉంటుంది.

వానలు దంచికొడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో గృహిణులకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందులో ప్రధానమైనది ఉతికిన దుస్తులు ఆరకపోవడం, ఆరినప్పటికీ వాటి నుంచి ఒకలాంటి తడి వాసన (దుర్వాసన) రావడం. అయితే వర్షాకాలంలో కూడా బట్టలు త్వరగా ఆరిపోయి, దుర్వాసన రాకుండా ఉండటానికి ఈ సులభమైన టిప్స్ పాటించండి.. ఇలాంటి టిప్స్ ద్వారా బట్టలు తొందరగా ఆరడంతోపాటు.. దుర్వాసన రాకుండా ఉంటుంది.
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరడానికి 8 ముఖ్యమైన చిట్కాలు:
ఉతికిన వెంటనే ఆరేయండి:
చేత్తో ఉతికినా లేదా వాషింగ్ మిషన్‌లో ఉతికినా.. బట్టలను మడతలు పడేలా బకెట్‌లో ఎక్కువ సేపు అలాగే ఉంచకూడదు. తడి బట్టలు బకెట్‌లో ఎక్కువ సేపు ఉంటే వాటి నుంచి దుర్వాసన వస్తుంది.
దుస్తుల మధ్య గ్యాప్ ఇవ్వండి:
బట్టలు ఆరేసేటప్పుడు ఒకదానికొకటి తాకకుండా కొంత దూరం (గ్యాప్) ఉండేలా ఆరేయాలి. దీనివల్ల గాలి బాగా తగిలి బట్టలు త్వరగా ఆరడానికి దోహదపడుతుంది.
ఫ్యాన్ లేదా కిటికీల దగ్గర ఆరేయండి:
ఇంట్లో బాల్కనీ ఉంటే బయట ఆరేయడం మంచిది. బయట వర్షం పడుతుంటే కిటికీల దగ్గరగాని లేదా గాలి ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో, ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరేస్తే త్వరగా ఆరిపోతాయి.
మందపాటి బట్టలను ఉదయమే ఉతకండి:
దుప్పట్లు, జీన్స్ పాంట్లు, టవల్స్ వంటి మందపాటి బట్టలను ఉదయమే వీలైనంత త్వరగా ఉతకాలి. రోజంతా గాలి తగలడం వల్ల ఇవి బాగా ఆరే అవకాశం ఉంటుంది.
తేమ ఉన్న బట్టలను అల్మారాలో పెట్టవద్దు:
బట్టలు కొద్దిగా తడిగా ఉన్నా లేదా లైట్‌గా తేమ ఉన్నా కూడా అల్మారాలో పెట్టకూడదు. అలా పెడితే దుర్వాసన వస్తుంది.. కాబట్టి బట్టలు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మడతపెట్టి దాచుకోవాలి.
అల్మారాలకు గాలి తగలనివ్వండి:
వర్షాకాలంలో అల్మారాలను అప్పుడప్పుడు తెరిచి ఉంచడం వల్ల లోపల ఉండే తేమ తగ్గి, బట్టలకు బూజు పట్టకుండా.. వాసన రాకుండా ఉంటుంది.
తడి, పొడి బట్టలను కలపకండి:
ఉతికిన తడి బట్టలతో పాటు పొడి బట్టలను కలిపి ఆరేయడం గానీ, ఉంచడం గానీ చేయకూడదు. దీనివల్ల పొడి బట్టలకు కూడా తడి వాసన పడుతుంది.
అవసరానికి తగినట్లే ఉతకండి:
వర్షాల సమయంలో బట్టలు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి, ఒకేసారి ఎక్కువగా ఉతకకుండా అవసరమైన మేరకే ఉతికితే ఆరేయడం.. నిర్వహించడం చాలా తేలికవుతుంది. భారం కూడా ఉండదు..
ఇంకా.. ఇలా చేస్తే..
బట్టలు ఉతికేటప్పుడు చివరి రిన్స్‌లో కొద్దిగా ఫ్యాబ్రిక్ కండిషనర్ లేదా బట్టలకు అనువైన క్రిమినాశక లిక్విడ్ ఉపయోగిస్తే తడి వాసన తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే బట్టలు పూర్తిగా ఆరిన తర్వాతే మడతపెట్టి అల్మారాలో పెట్టడం అలవాటు చేసుకోవాలి.
ఈ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. వర్షాకాలంలోనూ మీ బట్టలు త్వరగా ఆరిపోవడంతో పాటు తాజాగా, దుర్వాసన లేకుండా ఉంటాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
