
రోజూ టీ వడపోసే జాలి పైన పేరుకుపోయే టీ పొడి మరకలు, నలుపును వదిలించడం సాధారణ సోప్‌తో కష్టం. అయితే కొన్ని సులభమైన గృహ చిట్కాలతో టీ జాలిని కొత్తదానిలా మెరిపించవచ్చు. ఈ చిట్కాలు పాటించడం వల్ల జాలి శుభ్రపడటమే కాకుండా బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. టీ జాలిని సులభంగా శుభ్రం చేసే పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం..
మీ దగ్గర ఉన్నది స్టీల్ టీ జాలి అయితే, స్టవ్ వెలిగించి జాలిని నేరుగా మంటపై కొన్ని సెకన్ల పాటు చూపించాలి. ఇలా చేయడం వల్ల జాలి రంధ్రాలలో నల్లగా గడ్డకట్టిన టీ వ్యర్థాలు కాలిపోతాయి. ఆ తర్వాత జాలిని కాసేపు చల్లారనిచ్చి, పాత టూత్ బ్రష్ లేదా డిష్ వాషర్‌తో రుద్ది కడిగితే జాలి రంధ్రాలన్నీ తెరుచుకుని కొత్తదానిలా మారుతుంది. ప్లాస్టిక్ జాలికి ఈ పద్ధతి వాడకూడదు అలా చేస్తే కాలిపోతుంది.
ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని అందులో 1 స్పూన్ బేకింగ్ సోడా, అర నిమ్మచెక్క రసం వేయాలి. ఈ నీటిలో జిడ్డు పట్టిన టీ జాలిని 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. బేకింగ్ సోడాలోని క్లీనింగ్ ప్రాపర్టీస్ నల్లటి మరకలను సడలిస్తాయి. ఆ తర్వాత టూత్ బ్రష్‌తో రుద్దితే జిడ్డు మొత్తం వదిలిపోతుంది.
ప్లాస్టిక్ లేదా స్టీల్ జాలి దేనికైనా వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో 2 స్పూన్ల తెల్ల వెనిగర్ కలిపి, అందులో టీ జాలిని అర్ధగంట పాటు ముంచి ఉంచాలి. వెనిగర్ జిడ్డును, బ్యాక్టీరియాను సంపూర్ణంగా తొలగిస్తుంది.
రోజూ టీ వడపోసిన వెంటనే జాలిని సాధారణ నీటితో కడగకుండా, వెంట వెంటనే టూత్ బ్రష్‌తో కాస్త డిష్‌వాష్ లిక్విడ్ వేసి తోమడం అలవాటు చేసుకుంటే జాలిపై మరకలు పేరుకుపోకుండా ఉంటాయి.
వంటగది పరిశుభ్రతలో టీ జాలి కూడా ఒక ముఖ్యమైన భాగం. వారానికి కనీసం ఒక్కసారైనా ఈ చిన్న చిట్కాలను పాటించి టీ జాలిని శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యం సురక్షితంగా ఉండటమే కాకుండా, టీ సులభంగా వడపోత అవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..