ప్రపంచంలో తొలి సోషల్ మీడియా బ్యాన్.. సర్వేలో బయటపడిన సంచలన నిజాలు..!

16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించిన ప్రపంచంలోనే తొలి దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలో నిషేధం అమల్లోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత కూడా ఎక్కువ మంది చిన్నారులు సోషల్ మీడియాను యథావిధిగా ఉపయోగిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఇంటర్నెట్ భద్రతా నియంత్రణ సంస్థ ఈ-సేఫ్టీ (eSafety) నివేదిక వెల్లడించింది.

ప్రపంచంలో తొలి సోషల్ మీడియా బ్యాన్.. సర్వేలో బయటపడిన సంచలన నిజాలు..!
Australia Defends Teen Social Media Ban

Updated on: Aug 04, 2026 | 11:37 AM

16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించిన ప్రపంచంలోనే తొలి దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలో నిషేధం అమల్లోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత కూడా ఎక్కువ మంది చిన్నారులు సోషల్ మీడియాను యథావిధిగా ఉపయోగిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఇంటర్నెట్ భద్రతా నియంత్రణ సంస్థ ఈ-సేఫ్టీ (eSafety) నివేదిక వెల్లడించింది. దీంతో సోషల్ మీడియా నిషేధం అమలు, వయో నిర్ధారణ వ్యవస్థల సామర్థ్యంపై కొత్త ప్రశ్నలు తలెత్తాయి.

నిషేధం తర్వాత సోషల్ మీడియాలోనే!

ఈ-సేఫ్టీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో 81 శాతానికి పైగా ఇప్పటికీ కనీసం ఒక వయోపరిమితి ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారు. నిషేధం అమలుకు ముందు ఈ సంఖ్య 86 శాతం ఉండగా, మూడు నెలల తర్వాత కూడా పెద్దగా తేడాలేదు. అలాగే 58 శాతం మంది టీనేజర్లు ప్రతిరోజూ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నట్లు తేలింది. నిషేధానికి ముందు ఈ సంఖ్య 60 శాతం ఉండటం గమనార్హం. అంటే చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ, పిల్లల వినియోగంలో గణనీయమైన మార్పు రాలేదని నివేదిక స్పష్టం చేసింది.

నిషేధాన్ని ఎలా దాటేస్తున్నారు?

ఈ-సేఫ్టీ ప్రకారం, నిషేధానికి ముందు సోషల్ మీడియా ఖాతాలు కలిగిన 16 ఏళ్లలోపు పిల్లల్లో ఎక్కువ మంది తమ పాత ఖాతాలను కొనసాగించగలిగారు. మరోవైపు కొత్త ఖాతాలను సృష్టించుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం సోషల్ మీడియా కంపెనీలు సమర్థవంతమైన వయో నిర్ధారణ (Age Verification) వ్యవస్థలను అమలు చేయడంలో విఫలమవడమేనని నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న పిల్లల్లో దాదాపు సగం మంది, ప్లాట్‌ఫారమ్‌లు తమ వయస్సును అసలు తనిఖీ చేయలేదని చెప్పారు. మరికొందరు తమ ఖాతాల్లో 16 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు నమోదు చేశామని, ఇంకొందరిని వయస్సు గుర్తించే వ్యవస్థలు పొరపాటున పెద్దవారిగా గుర్తించాయని వెల్లడించారు.

ముందే హెచ్చరించిని నిపుణులు..

నిషేధం అమల్లోకి రాకముందే డిజిటల్ వెల్‌బీయింగ్ నిపుణులు దీన్ని అమలు చేయడం చాలా కష్టమని హెచ్చరించారు. టెక్నాలజీపై అవగాహన ఉన్న టీనేజర్లు VPNలు, నకిలీ పుట్టిన తేదీలు, ఫేస్ స్కాన్‌లను మోసం చేసే పద్ధతులు ఉపయోగిస్తూ కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. అలాగే కఠిన నియంత్రణలు లేని ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు, వీడియో గేమింగ్ సేవలకు మారిపోతున్నారని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ నిషేధం ఎందుకు తీసుకొచ్చారు?

ఆస్ట్రేలియా ప్రభుత్వం డిసెంబర్ 2025లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించింది. ఇలా చేసిన తొలి దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. అయితే వీడియో గేమ్ ప్లాట్‌ఫారమ్‌లను ఈ నిషేధం నుంచి మినహాయించారు. పిల్లలపై సైబర్ బుల్లీయింగ్, లైంగిక దోపిడీ, స్వీయ హానిని ప్రోత్సహించే కంటెంట్, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2023లో ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలో 8 నుంచి 16 ఏళ్ల పిల్లల్లో ఐదుగురిలో నలుగురు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నట్లు తేలింది.

చట్టం ఏం చెబుతోంది..?

కొత్త చట్టం ప్రకారం, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా అడ్డుకునేందుకు సహేతుకమైన చర్యలు తీసుకోని సంస్థలకు 33 మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వయస్సు ధృవీకరణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, మైనర్ల ఖాతాలను గుర్తించి తొలగించడం వంటి చర్యలు తప్పనిసరి చేశారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 16 నాటికి సుమారు 47 లక్షల సోషల్ మీడియా ఖాతాలను పిల్లలకు చెందినవిగా గుర్తించిన కంపెనీలు తొలగించాయి. అయినప్పటికీ, కొత్త ఖాతాలు తెరవడం కొనసాగుతోందని తాజా నివేదిక వెల్లడించింది.

కోర్టులోనూ వివాదం!

నిషేధం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులకే, ఈ చట్టం పరిధిలోకి వచ్చే సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన Reddit ఈ నిర్ణయాన్ని పాటిస్తూనే ఆస్ట్రేలియా హైకోర్టులో సవాలు చేసింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

కొత్త సవాళ్లు

ఈ తాజా నివేదికతో, సోషల్ మీడియా నిషేధం ఒక్కటే సరిపోదని స్పష్టమవుతోంది. సమర్థవంతమైన వయో నిర్ధారణ సాంకేతికత, తల్లిదండ్రుల పర్యవేక్షణ, డిజిటల్ అవగాహన, సోషల్ మీడియా సంస్థల బాధ్యత పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చట్టం అమల్లో ఉన్నప్పటికీ, టెక్నాలజీని ఉపయోగించి పిల్లలు సులభంగా కొత్త ఖాతాలు తెరవడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us