లోక్ సభ ఎన్నికల్లో రెండో సారీ ఘన విజయం సాధించిన ప్రధాని మోదీ ముందు..సమస్యల సవాళ్లు చాలానే ఉన్నాయి. దేశ ఆర్ధిక స్థితికి ఇంకా పునరుజ్జీవం కల్పించి.. తిరిగి ఉన్నత స్థాయిన గాడిలో పెట్టాల్సిన కీలక బాధ్యత ఆయనపై ఉంది. ముఖ్యంగా వ్యవసాయం, నిరుద్యోగ సమస్య.. మార్కెట్ సంస్కరణలు.. ఇలాంటివి ఇంకా ఎన్నో ! ఓ వైపు బాలకోట్ పై వైమానిక దాడులు, తదితరాలతో దేశాన్ని, విపక్షాలను సైతం ఆకట్టుకున్న మోదీ గత అయిదేళ్ళలో పేదల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. వారి సంక్షేమానికి ఈ అయిదేళ్ళలో రూ. 2.3 లక్షల కోట్లను మోదీ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఐదు కోట్లమందికి పైగా ప్రజలు సబ్సిడీతో కూడిన జీవిత బీమా సౌకర్యాన్ని, 13 కోట్ల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ను పొందగలిగారు. 6 కోట్లమంది ఉచిత గ్యాస్ కనెక్షన్లను పొందితే.. సబ్సిడీతో కూడిన కోటికి పైగా గృహ నిర్మాణాలు జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్ల టాయిలెట్లను ప్రభుత్వం నిర్మించింది. ఆర్ధిక వృద్ది 8.9 శాతం మేర ఉన్నప్పటికీ..ఏళ్ళ తరబడి పేదలకు ప్రయోజనాలు పెద్దగా లభించి ఉండకపోవచ్చు. కానీ పేదరికంపై యుద్ధం ప్రకటిస్తూ మోదీ ప్రభుత్వం చేబట్టిన పథకాలు శీఘ్ర గతిన వారికి వరంగా మారాయి. బీజేపీ హవా పెద్దగా లేని ‘ పేద ‘ రాష్ట్రాల్లో ఇది కాకతాళీయమైనా, కాకపోయినా ఇక్కడ లబ్దిదారులు ‘ మోదీ ‘ మంత్రాన్ని జపించడం విశేషం. స్థూల దేశీయోత్పత్తి ఏడు శాతం ఉన్న నేపథ్యంలో..గత అయిదు సంవత్సరాల్లో దేశంలో జరిగిన ఎగుమతులు 5 శాతంలోపే ఉన్నాయి. ఇది పారిశ్రామిక పెంపుదలకు బ్రేకులు వేసినట్టే.. పెట్టుబడులను పెంచుకునేందుకు రోడ్లు, రైల్వేలకు ప్రభుత్వ వ్యయాన్ని పెంచినప్పటికీ..పన్ను వసూళ్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. డీ-ఫ్యాక్టో ప్రభుత్వాలు వేస్తున్న వడ్డీ రేట్లు హెచ్చుగా ఉన్న కారణంగా ముఖ్యంగా ప్రైవేటు ఇండస్ట్రీ కుదేలైంది. రుతుపవనాలు బలహీనంగా ఉన్న కారణంగా తమ ఉత్పత్తులకు మార్కెట్ ధరలు రాక..రైతులు ఏడాదికి సుమారు రెండున్నర లక్షల కోట్లకు పైగా నష్ట పోతున్నారని అశోక్ గులాటీ అనే ప్రొఫెసర్ అంచనా వేశారు. ఏది ఏమైనా.. వ్యవసాయంతో బాటు నిరుద్యోగ సమస్య, పారిశ్రామికీకరణ వంటి అంశాలపై మోదీ సర్కార్ ప్రధానంగా దృష్టి పెట్టి.. మార్కెట్ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయడం, తదితర వ్యూహాలతో ముందుకు వెళ్ళిన పక్షంలో ఈ సవాళ్లు సాధారణ అంశాలై..అటు కీలక రంగాలకు, ఇటు పేద వర్గాలకు ప్రయోజనం కల్పిస్తుందనడంలో సందేహం లేదు.