మరికాసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ షురూ కానుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి? లెక్కింపు మొదలు… ఫలితాల వరకు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అనే ప్రశ్నలు సాధారణంగా తలెత్తే సంశయాలు. ఈ క్రతువు ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం.. ఓట్ల లెక్కింపుకు గ్రేటర్ లోని 30 సెంటర్లలో డివిజన్‌కు ఒకటి చొప్పున 150 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. అయితే 16 డివిజన్లకు మాత్రం రెండు హాల్స్ చొప్పున సిద్ధం చేశారు. ఒక్కో హాలులో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ఉంటుంది. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్లను బాక్సుల్లో నుంచి తీసి 25 బ్యాలెట్ల చొప్పున బండిల్‌గా కడతారు. అలాగే- ఆ కేంద్రంలో పోలైన ఓట్లకు సమానంగా ఉన్నాయా, లేదా, అన్నది పరిశీలిస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 25 చొప్పున బండిల్స్ కట్టిన అనంతరం.. మిగిలే ఓట్లు అంటే 25లోపు ఉంటే వాటిని ఓ ట్రేలో వేసి, తర్వాత వాటిని బండిల్స్‌గా కడతారు. డివిజన్ పరిధిలోని అన్ని ఓట్లను బండిళ్లుగా కట్టాక… ఒక డ్రమ్ములో వేసి కలుపుతారు. ఏ పోలింగ్ కేంద్రంలో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలు తెలియకూడదనే ఇలా చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రక్రియ పూర్తవడానికి రెండు నుంచి రెండున్నర గంటలు పట్టే అవకాశముంది. ఆ తర్వాతే కౌంటింగ్ మొదలవుతుంది. గుర్తు ఆధారంగా ఓట్లను ఒక్కో డబ్బాలో వేస్తారు. తర్వాత వాటిని లెక్కించి ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయన్నది తేలుస్తారు. కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు కోరితే మరోసారి ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్, అడిషనల్ కౌంటింగ్ సూపర్‌వైజర్లు ఉంటారు. వార్డు రిటర్నింగ్ ఆఫీసర్ లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. రిటర్నింగ్ అధికారి వద్ద, అభ్యర్థితోపాటు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇతర ఏజెంట్లు పక్కన ఉండి లెక్కింపును పరిశీలించవచ్చు. మొదటి రౌండ్ ఫలితాలు ఉదయం పదిన్నర తర్వాత రావచ్చని అధికారులు చెబుతున్నారు. ఒక్కో టేబుల్‌కు 1,000 ఓట్లు అంటే… 40 బండిల్స్ లెక్కిస్తారు. అంటే ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం కౌంటింగ్ పూర్తయ్యాక విజేతను ప్రకటిస్తారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ అప్డేట్స్ ఈ దిగువున..