Adulterated Engine Oil: అగ్గిపుల్ల, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ.. కల్తీకీ కాదేదీ అనర్హం అంటున్నారు నేటి కేటుగాళ్లు. ఇప్పటికే అహార పదార్ధాల్లో ఏ మేరకు కల్తీ జరుగుతుందో అందరికి తెలిసిందే… తినే స్వీటు నుండి తాగే పాల వరకూ ప్రతి దాంట్లోనూ అక్రమార్జనకు పాల్పడే వాళ్లు కల్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా మోసం ఇంజన్ ఆయిల్ కు పాకింది. ప్రముఖ కంపెనీల పేరుతో వాడిన ఇంజన్ ఆయిల్ ను రిప్యాక్ చేస్తూ ఒక ముఠా విక్రయాలు చేస్తోంది. ముందుగా వచ్చిన సమాచారం మేరకు ఎట్టకేలకు పోలీసులు వారి ఆట కట్టించారు.
విజయవాడకు చెందిన నాగ దుర్గా ప్రసాద్ నగరంలోని వివిధ బైక్ మెకానిక్ లు, కార్ షెడ్ ల వద్ద నుండి ఉపయోగించిన ఇంజన్ ఆయిల్ ను సేకరిస్తున్నాడు. వాటిని తాడేపల్లి సమీపంలోని వెల్లంపూడిలోని ఇక ఇంటిలోకి చేరుస్తున్నాడు. అక్కడ వివిధ కంపెనీలకు చెందిన ఆయిల్ ప్యాకింగ్స్ లోకి రిసైక్లింగ్ చేసిన ఇంజన్ ఆయిల్ ను నింపుతున్నాడు. 5, 3, 1లీటర్తో పాటు అర లీటర్ ప్యాకెట్లతో నింపి వాటిని ప్రముఖ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నాడు. ప్రముఖ బ్రాండ్లకు చెందిన డబ్బాలు, ప్యాంకింగ్ మెటీరియల్ ను కొలకత్తా నుండి తీసుకొస్తున్నాడు. అయితే ఇదంతా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడుకాకుండా చేస్తున్నాడు.
గత కొంతకాలంగా ప్రముఖ బ్రాండ్ల ఇంజన్ ఆయిల్ సేల్స్ తగ్గిపోయాయి. దీంతో అనుమానం వచ్చిన ఆయిల్ కంపెనీ ప్రతినిధులు వివిధ షాపులపై ద్రుష్టి పెట్టారు. అయితే ఇదంతా ఒక వ్యక్తి చేస్తున్నట్లు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా రీసైక్లింగ్ ఇంజన్ ఆయిల్ కొనుగోళ్లపై ద్రుష్టి సారించిన విజిలెన్స్ అధికారులకు దుర్గా ప్రసాద్ ఇదంతా చేస్తున్నట్లు సమాచారం అందింది. అప్పటి నుండి విజయవాడ నుండి రీసైక్లింగ్ ఆయిల్ ను ఎక్కడికి తరలిస్తున్నాడో నిఘా పెట్టారు.
ఆ అయిల్ అంతా తాడేపల్లి సమీపంలోని వెల్లంపూడిలోని ఒక ఇంటికి చేరుస్తున్నట్లు గుర్తించి నిన్న దాడి చేశారు. విజిలెన్స్ అధికారులు దాడి చేసిన సమయంలో నాలుగు లక్షల రూపాయల విలువ చేసే 1280 లీటర్ల ఆయిల్ ను అధికారులు గుర్తించారు. ఆయిల్ తో పాటు ప్యాంకింగ్ యంత్రాలను సీజ్ చేసిన అధికారులు దుర్గా ప్రసాద్ తో పాటు అతనికి సహకరిస్తున్న వారిని తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.