Ayurvedic Hospitals: ఆయుర్వేదం ఒక ప్రాచీన వైద్య విధానం.. మనదేశంలో ఆయుర్వేద వైద్యం అనేది ఐదు వేల ఏళ్లకు పూర్వం నుంచే మొదలైందని పూర్వికులు చెబుతారు. ‘‘ఆయు’’ అంటే జీవితం. వేద అంటే శాస్త్రం అని అర్థం. ఈ రెండు సంస్కృత పదాల కలయికే ఆయుర్వేదం. అలాంటి ఆయుర్వేద వైద్యం నేడు కనుమరుగయ్యే పరిస్థితి కన్పిస్తుంది.. వైద్య విధానాల మాదిరిగా కాకుండా ఆయుర్వేద వైద్యం అనేది వ్యాధుల చికిత్స కంటే ఆరోగ్యకరమైన జీవనం పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంది.
అలాంటి ఆయుర్వేద దవాఖానాలు ఇప్పుడు నిర్వీర్యమవుతున్నాయి. డాక్టర్లు లేక చాలా చోట్ల ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానాలు మూతపడుతున్నాయి. ఆయుర్వేద వైద్యంపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.. మెదక్ జిల్లాలో 15 ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులుంటే అందులో కేవలం రెండు చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. మిగిలిన ఆసుపత్రులకు డాక్టర్లు లేకపోవడంతో అందులో వచ్చే రోగులకు స్వీపర్లే దిక్కయ్యారు. దీని ఫలితంగా ఇప్పుడు ఆ ఆయుర్వేద ఆసుపత్రులు పూర్తిగా మూతపడే పరిస్థితి ఏర్పడింది.
మెదక్ జిల్లాలో 15 ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులున్నాయి. ఇందులోని 13 ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు. ప్రతి రోజు ఉదయం స్వీపర్లు వచ్చి, ఆసుపత్రిని తెరుస్తున్నారు. కానీ ఆసుపత్రికి వచ్చే వారికి మాత్రం వైద్య పరీక్షలు చేయడం లేదు. ఎవరైనా మందుల కోసం వస్తే డాక్టర్, ఫార్మసిస్టు లేకపోవడంతో వారికి మందులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏడాదికి పైగా ఆయా ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సరిగ్గా ఆ ఆసుపత్రులను తెరిచే పరిస్థితి కూడా లేదు. జిల్లాలోని మెదక్, తూప్రాన్, సర్ధన, రంగంపేట, వెల్మకన్నె, నర్సాపూర్, రత్నాపూర్, వేల్పుగొండ, ముప్పారం, రామాయంపేట, చీకోడ్, ఇబ్రహీంపూర్, శివ్వంపేట, కాగజ్ నగర్, మాసాయిపేటలో ఈ ఆయుర్వేద ఆసుపత్రులున్నాయి. వాటిలో తూప్రాన్, హవేళీ ఘనపూర్ మండలం సర్థన ఆసుపత్రుల్లో మాత్రమే వైద్యులు ఉన్నారు. కౌడిపల్లి మండలం వెల్మకన్నె, కొల్చారం మండలం రంగంపేట, మాసాయిపేట డిస్పెన్సరీలలో ఫార్మసిస్టులు ఉన్నారు.ఎవరైనా ఆసుపత్రికి వస్తే మందులు ఇచ్చి పంపిస్తున్నారు.
ఇక మిగిలిన 10 ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఎవరూ లేరు. తూప్రాన్ ఆసుపత్రికి ప్రతిరోజు 50 మంది వరకు వస్తుంటారు. సర్దన డిస్పెన్సరీకి 20 నుంచి 30 మంది వరకు వస్తుంటారు..అమ్మలాంటి ఆయుర్వేదాన్ని ప్రజలకు దూరం చేయవద్దని జిల్లా ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి ఈ ఆయుర్వేదం ఆసుపత్రిలో వైద్యులను కేటాయించి తమకు మంచి వైద్యం అందించలని కోరుతున్నారు జిల్లా వాసులు…
— శివతేజ, టీవీ 9 ప్రతినిధి, మెదక్ జిల్లా.
Read Also…. Big News Big Debate: కాషాయం కలలు.. ఏపీలో బీజేపీ ని నమ్మి నాయకులు చేరతారా..?