Myanmar Military Action: మయన్మార్‌లో అసలేం జరిగింది? సైనిక తిరుగుబాటు వెనుక రహస్యమేంటి? ఓ పరిశీలన

|

Feb 03, 2021 | 1:37 PM

సుదీర్ఘ సైనిక పాలన తర్వాత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి సైనిక తిరుగుబాటు తలెత్తిన మయన్మార్ యావత్ ప్రపంచం దృష్టిని తనవైపునకు...

Myanmar Military Action: మయన్మార్‌లో అసలేం జరిగింది? సైనిక తిరుగుబాటు వెనుక రహస్యమేంటి? ఓ పరిశీలన
Follow us on

Myanmar Military action: సుదీర్ఘ సైనిక పాలన తర్వాత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి సైనిక తిరుగుబాటు తలెత్తిన మయన్మార్ యావత్ ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకుంది. 21 సంవత్సరాల పాటు గృహనిర్బంధంలో గడిపి.. ప్రజల చేత ఎన్నుకోబడిన అంగ్ సాన్ సూకీ చేతిక పాలనా పగ్గాలు వచ్చే రోజు దగ్గర పడుతున్న తరుణంలో సైన్యాధ్యక్షుని దుందుడుకు చర్య మయన్మార్ దేశ ప్రజలనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రజాస్వామ్యాభిలాషులను నివ్వెర పరిచింది. పరిస్థితి చక్కబడుతుందనుకుంటున్న సమయంలో మయన్మార్ సైన్యం ఒక్కసారిగా జూలు ఎందుకు విదిల్చింది..? ఇదిప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. రోహింగ్యాల విషయంలో తమకు మద్దతిచ్చిన అంగ్ సాన్ సూకీపై సైన్యం ఎందుకు తిరగబడింది? ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తమ దేశంపై ఆంక్షలు విదించే ప్రమాదం వుందని తెలిసి కూడా సైన్యాధ్యక్షుడు ఎందుకీ విపరీత నిర్ణయం తీసుకున్నారు? తిరుగుబాటును ఎవరూ ఊహించలేదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే గత కొద్దిరోజులుగా మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలించాల్సిన అవసరం వుంది.

2020 నవంబరు నెలలో ఎన్నికలు జరిగిన నాటి నుంచీ సైన్యం, దాని అడుగులకు మడుగులొత్తే రాజకీయ నాయకుల కదలికలు అనుమానాస్పదంగానే ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పోయిన వారంలో అనేక విదేశీ రాయబార కార్యాలయాలు తిరుగుబాటు జరిగే అవకాశముందన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. కానీ ఈ ప్రచారాన్ని మయన్మార్‌ సైన్యం కొట్టి పారేసింది. మయన్మార్ సైన్యాన్ని అనవసరంగా అనుమానిస్తున్నారని తేల్చేసింది. కొద్దిరోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో తిరుగుబాటు అనుమానాలపై కొందరు జర్నలిస్టులు ప్రశ్నించగా… సైన్యం ప్రతినిధి ఆ అవకాశాలను తోసిపుచ్చలేదు. దాంతో సైనిక తిరుగుబాటు ఖాయమన్న అభిప్రాయాన్ని పలు రాయభార కార్యాలయాలు తమ తమ దేశాలకు సమాచారమందించాయి.

మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నా.. అక్కడి సైన్యానికే విశేషాధికారాలుంటాయి. అందుకే సుదీర్ఘ గృహ నిర్బంధం నుంచి విడుదలై అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆంగ్‌ సాన్‌ సూకీ… మొదట్నించి సైన్యంతో సయోధ్యతోనే వ్యవహరించారు. రోహింగ్యా ముస్లింలపై మయన్మార్‌ సైనికులు జరిపిన దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించినా… సూకీ మాత్రం సైన్యానికే మద్దతిచ్చారు. అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠకు మచ్చ వస్తున్నా సూకీ సైన్యంతో స్నేహంగానే మెలిగారు. ఇతరత్రా కూడా వారిపై ఎన్నడూ విమర్శలు గుప్పించలేదు.

మొన్నటి ఎన్నికల్లో అంగ్ సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (NLD) పార్టీ ప్రతినిధుల సభలో 258 సీట్లు, హౌస్ ఆఫ్ నేషనాలిటీస్‌లో 138 సీట్లు గెలుచుకుంది. సైన్యం బహిరంగంగా మద్దతు ప్రకటించిన యూనియన్ సాలిడారిటీ డెవలప్‌మెంటు పార్టీ (USDP) ఘోర పరాజయం పాలైంది. దాంతో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పట్నించి దేశంలో సైనిక తిరుగుబాటు ఖాయమన్న ఊహాగానాలు మొదలయ్యాయి. బంపర్ మెజారిటీతో పాలన పగ్గాలు చేపట్టే అవకాశాలుండడంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ప్రతిపాదనను అంగ్ సాన్ సూకీ పరిశీలించడం ప్రారంభించారు. ఈ దిశగా సూకీ బృందం సంప్రదింపులు కూడా మొదలుపెట్టింది. రాజ్యాంగాన్ని సవరించి, సైన్యానికి వున్న విశేషాధికారాలను కత్తిరించాలన్న సూకీ చర్యలను సైనికాధికారులు సునిశితంగా గమనిస్తూ వచ్చారు. కొత్త పార్లమెంటు ఫిబ్రవరి 1న సమావేశం కానుందగా.. ఈ సెషన్‌లోనే రాజ్యాంగ సవరణకు సూకీ సర్కార్ చర్యలు చేపట్టే సంకేతాలను సైనికాధికారులు గమనించారు. దాంతో సరిగ్గా పార్లమెంటు సెషన్ ప్రారంభమయ్యే రోజున తెల్లవారుజామునే సైన్యం ఉన్నట్లు తిరుగుబాటుకు దిగింది.

సైనికాధినేత మిన్‌ ఆంగ్‌ లయాంగ్‌ గత కొంతకాలంగా దేశాధ్య పదవిపై కన్నేశారు. ఇందుకోసం ఆయనకు పార్లమెంటులో మెజార్టీ సభ్యుల మద్దతు అవసరం. మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం… పార్లమెంటులో 25 శాతం సీట్లు సైన్యం చేతిలో ఉంటాయి. రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో తమ మద్దతు అనివార్యంగా మారేందుకు ఈ ఏర్పాటు చేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో తమ కనుసన్నల్లో నడిచే యూఎస్‌డీపీ సీట్ల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో… స్వయంగా 25 శాతం సీట్లున్నా సైన్యం రాజ్యాంగ సవరణను అడ్డుకునే అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో సైనికాధినేత లయాంగ్‌ దేశ అధ్యక్షుడయ్యే అవకాశాలు దాదాపు కనుమరుగయ్యాయి. రాజ్యాంగబద్ధంగా దేశాధ్యక్ష పదవి తనకు దక్కే అవకాశాలు లేకపోవటంతో పాత పద్ధతిలో సైనిక తిరుగుబాటుకు రంగం సిద్ధం చేశారు లయాంగ్. అంతర్జాతీయంగా దాదాపు అన్ని దేశాలు కరోనా వైరస్‌పై సమరంలో మునిగి వుండడం.. అగ్రరాజ్య అమెరికా తమ అంతర్గత విషయాలతో బిజీగా వుండడం మయన్మార్ సైన్యానికి అనుకూల వాతావరణాన్ని కల్పించింది.

లయాంగ్‌ అధ్యక్ష పీఠాన్ని ఆశించడానికి కూడా బలమైన కారణాలున్నాయి. 2021 జులైలో ఆయనకు 65 ఏళ్ళు నిండుతాయి. దాంతో సైన్యాధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వుంటుంది. మామూలుగానైతే ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం ఏమీ కాదు. కానీ… రిటైర్మెంట్‌తో లయాంగ్‌కు కష్టాలు ఆరంభమయ్యే అవకాశం ఉంది. రోహింగ్యాలపై ఆయన సారథ్యంలోనే మారణకాండ జరిగిందనేది అంతర్జాతీయంగా ఉన్న ఆరోపణ. రిటైరైన తక్షణమే ఆయనపై అంతర్జాతీయంగా విచారణకు దారులు తెరుచుకుంటాయి. అప్పుడు సూకీ మద్దతిస్తారో లేదో తెలియదు. పదవిలో ఉంటే ఈ విచారణలన్నింటి నుంచి రక్షణ లభిస్తుంది. అందుకే లయాంగ్‌ సైనిక తిరుగుబాటుకు ఆదేశించారన్నది పరిశీలకుల అంఛనా. ఈ వాదనకు బలం చేకూరుస్తున్నట్లుగా ఆ దేశ సైన్యాధ్యక్షుడు లయాంగ్.. సైనిక తిరుగుబాటు అనివార్యమైనందునే ఆ దిశగా చర్యలు తీసుకున్నామని ప్రకటించడం గమనార్హం.

తాను అనుకున్న ప్రకారం సైనిక తిరుగుబాటుకు దిగిన లయాంగ్.. అంగ్ సాన్ సూకీని మరోసారి గృహనిర్బంధానికి పరిమితం చేశారు. దేశంలో టీవీ ప్రసారాలను, ఇంటర్ నెట్ వినియోగాన్ని బ్యాన్ చేశారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించారు. అయితే.. సైన్యం చర్యలపై దేశ ప్రజలు తమదైన శైలిలో నిరసన చర్యలకు దిగుతున్నారు. అంతర్జాతీయ సమాజం మయన్మార్ వైపు దృష్టి సారించేలా ఆ దేశ ప్రజాస్వామ్య వాదులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు భారత్ సహా పలు దేశాలు మయన్మార్ సైనిక చర్యను ఖండించాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బాధ్యతలను ఇటీవల చేపట్టిన బైడన్.. మయన్మార్ విషయంలో జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి కూడా మయన్మార్ సైనిక చర్యపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజులు మయన్మార్‌లో ఎలాంటి పరిణామాలను చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ఉప ఎన్నిక బరిలో జానానా? మరొకరా? పార్టీ వర్గాల్లో కన్ఫ్యూజన్