పాకిస్తాన్ లో తమ సర్వీసులను నిలిపివేస్తామని గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ హెచ్చరించాయి. పాక్ లోని ఇమ్రాన్ ప్రభుత్వం వీటిపై గతనెలలో కొత్తగా సెన్సార్ షిప్ నిబంధనలు విధించడంతో ఇవి భగ్గుమన్నాయి. ఆన్ లైన్ ద్వారా (ఈ విధమైన సాధనాల ద్వారా) కలుగుతున్న హాని నుంచి ప్రజలను రక్షించేందుకు.. సోషల్ మీడియా యాక్టివిటీని నియంత్రిస్తూ.. ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. అవసరమైనప్పుడు.. తమకు సంబంధిత సమాచారం ఎక్కడి నుంచి అందిందో, ఆ డేటాను తప్పనిసరిగా ఇవి ఓ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి షేర్ చేయాలని సర్కార్ సూచించింది. ఇందుకు మూడు నెలల సమయం కూడా ఇచ్చింది. కాగా-ఈ రూల్స్ పట్ల ఫేస్ బుక్, ట్విటర్, గూగుల్, అమెజాన్, యాపిల్ ఇతర ఇంటర్నెట్ జెయింట్లతో కూడిన ‘ఆసియా ఇంటర్నెట్ కలెక్టివ్’ తమ నిరసనను ఓ లేఖ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ.. ఈ నిబంధనలు మార్చాలని కోరింది. ఇవి నిరంకుశమైనవిగా ఉన్నాయని, మా ప్రయోజనాలకు విరుధ్ధమని పేర్కొన్నాయి. అసలు ఈ రూల్స్ ని రూపొందించే ముందు స్టేక్ హోల్డర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఈ సంస్థ ప్రశ్నించింది. పార్లమెంటులో ఎలాంటి చర్చ జరపకుండానే వీటిని ఆమోదిస్తారా అని కూడా ఈ సోషల్ సాధనాలు సందేహం వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ లో సోషల్ మీడియా పట్ల ఈ విధమైన నిబంధనలు విధిస్తే.. అంతర్జాతీయ కంపెనీలు తమ పనితీరుపై అనుమానాలు ప్రకటించవచ్చు అని కూడా పేర్కొన్నాయి.
అయితే ఈ రూల్స్ కి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని, వీటి మార్పునకు సంబంధించి సమావేశాలు జరుగుతున్నాయని పాక్ విద్యా శాఖ మంత్రి షఫ్ ఖాత్ మహమ్మద్ తెలిపారు.