US violence: డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం.. నిషేధం మరో రెండు వారాలు పొడిగింపు

|

Jan 08, 2021 | 8:37 AM

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ట్రంప్‌ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. బైడెన్‌ను అధ్యక్షుడిగా ఒప్పుకున్నారు. అయితే మరో 12 రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి అధికారికంగా...

US violence: డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం.. నిషేధం మరో రెండు వారాలు పొడిగింపు
Follow us on

US violence:  ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ట్రంప్‌ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. బైడెన్‌ను అధ్యక్షుడిగా ఒప్పుకున్నారు. అయితే మరో 12 రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి అధికారికంగా వైదొలగనున్న ట్రంప్‌కు ఎదురుగాలి వీస్తోంది. వరుస సమస్యలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  అమెరికాలోని క్యాపిటల్‌ భవనంలో హింసాత్మక ఘటనలతో ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాపై విధించిన 24 గంటల నిషేధాన్ని కనీసం మరో రెండు వారాలకు పొడిగిస్తున్నట్లు  ప్రకటించింది. అధికార మార్పిడి పూర్తయ్యేవరకు ఆయన ఫేస్‌బుక్ ఖాతాను సంస్థ నిషేదించనుంది. దీనిపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. జో బైడెన్‌కు అధికారం అప్పగించే విషయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల్లో తమ ఫేస్‌బుక్‌ను ట్రంప్‌ ఉపయోగించుకున్న తీరును తప్పుబట్టారు. క్యాపిటల్‌ భవనంలో ఆయన మద్దతుదారుల చర్యలను ఖండించడానికి బదులుగా వారి చర్యలను సమర్థించేలా ఫేస్‌బుక్‌ను వాడుకోవడం అమెరికా ప్రజలనే కాదు.. ప్రపంచాన్ని కలవరపరిచిందని పేర్కొన్నారు. హింసను ప్రేరేపించే ఉద్దేశంతో చేసినట్లు ఉన్న ట్రంప్‌ ప్రకటనల్ని తాము ఇప్పటికే తొలగించామని జుకర్‌బర్గ్‌ తెలిపారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక తిరుగుబాటును ప్రేరేపించేలా ట్రంప్‌ తమ వేదికను ఉపయోగించారని జుకర్‌ బర్గ్‌ భావిస్తున్నారు.దీంతో మరోసారి అలా జరగకుండా ఉండేందుకు ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలపై విధించిన 24 గంటల నిషేధాన్ని మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు జుకర్‌బర్గ్‌.

అటు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఇరాక్‌లోని బాగ్దాద్‌ న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. తమ దేశానికి చెందిన పారామిలిటరీ కమాండర్‌ అబు అల్‌ ముహందిస్‌ హత్య కేసు విచారణలో భాగంగా ట్రంప్‌ అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఇరాక్‌ శిక్షాస్మృతిలోని ఆర్టికల్‌ 406 ప్రకారమే ట్రంప్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్‌ జారీ చేసినట్లు బాగ్దాద్‌ న్యాయస్థానం తెలిపింది.  గత ఏడాది జనవరి 3న ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సులేమానీ, ఇరాక్‌ పారా మిలిటరీ కమాండర్‌ అబు అల్‌ ముహందిస్‌లు యూఎస్‌ డ్రోన్‌ దాడిలో మరణించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలతో వారిని హత్య చేసినట్లు తెలియడంతో ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ట్రంప్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

Also Read : Security to Temples: విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అలెర్ట్.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు