ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పట్టికుదిపేస్తున్న సమస్య.. పోలవరం ప్రాజెక్టు. దీని వేదికగా చేసుకునే ఏపీ రాజకీయాలన్నీ సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వేలకోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం, అవినీతి జరిగిందని అధికార వైసీపీ ఆరోపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే రివర్స్ టెండరింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది సీఎం జగన్ ప్రభుత్వం.
ఇదిలా ఉంటే ప్రముఖ సామాజికవేత్త, ఆర్ధిక రంగ నిపుణులు పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పోలవరం అవినీతిపై ఇదివరకే ఓ పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని నిర్మాణంలో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ నరన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర జలవనరుల శాఖ ఈ పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి విచారణ జరపాలని సూచించింది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై పిటిషనర్ పెంటపాటి పుల్లారావు స్పందిస్తూ.. న్యాయస్ధానం ఆదేశాలతో పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటపడే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేసినట్టు ఆయన వెల్లడించారు.