Corona Vaccination Live Updates: దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ – 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ, తెలుగు రాష్ట్రాల్లో జోరుగా టీకా పంపిణీ

|

Jan 17, 2021 | 3:31 PM

దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ - 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగురాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ కార్యక్రమం సాగుతోంది. ఏపీలో 332 వ్యాక్సిన్..

Corona Vaccination Live Updates: దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ - 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ, తెలుగు రాష్ట్రాల్లో జోరుగా టీకా పంపిణీ

దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ – 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగురాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ కార్యక్రమం సాగుతోంది. కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపోహలు తొలగకపోవడంతో తొలి రోజు వ్యాక్సినేషన్‌కి మిశ్రమ స్పందన లభించింది. దేశవ్యాప్తంగా తొలి రోజు లక్ష్యం 3 లక్షల మంది కాగా, వ్యాక్సిన్ వేయించుకున్నది మాత్రం 1, 91, 181 మందిగా లెక్కలు తేలాయి. ఢిల్లీలో ఒక కొవిడ్ వ్యాక్సిన్ సీరియస్ రియాక్షన్, 51 సాధారణ రియాక్షన్స్ నమోదయ్యాయి. ఎయిమ్స్ ఐసీయూలో చేర్పించాల్సిన స్థాయిలో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన కేసులు బహు అరుదుగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండో రోజు ఎలా జరుగుతుందో మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ ఈ దిగువున చూడొచ్చు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Jan 2021 03:21 PM (IST)

    ఏపీలో ఏసెంటర్లోనూ 10కి మించని వ్యాక్సినేషన్

    కడపటి వార్తలందేసరికి రెండో రోజు ఆదివారం ఉదయం నుంచి ఆంధ్రప్రేదశ్‌లోని 332 వ్యాక్సినేషన్‌ సెంటర్లలో టీకా తీసుకున్న వారి సంఖ్య ఎక్కడా పదికి మించలేదు. దీంతో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో టీకా పట్ల భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది.. నిన్న 58శాతం మాత్రమే టీకాలు ఇచ్చారు. మిగతావారికి ఇవాళ టీకాలు వేయాలని భావిస్తున్నారు.

  • 17 Jan 2021 03:20 PM (IST)

    గుంటూరు జిల్లాలో అత్యధికంగా 2274 మందికి వ్యాక్సిన్‌

    ఏపీలో తొలి రోజు అత్యధికంగా గుంటూరు జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ వేశారు. గుంటూరు జిల్లాలో 2274 మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఆ తర్వాత విశాఖ జిల్లాలో 2096 మంది టీకా తీసుకున్నారు. కృష్ణా జిల్లాలో 2027 మందికి టీకా అందించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1802 మందికి టీకా అందించారు. చిత్తూరు జిల్లాలో 1655 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి వ్యాక్సిన్‌ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో 1616 మందికి టీకా అందించారు. మొత్తంగా ఏపీలో తొలిరోజు మొత్తం 19 వేల 108 మందికి టీకా అందించారు.

  • 17 Jan 2021 03:14 PM (IST)

    డాక్టర్లు, నర్సులు సైతం వెనుకంజ

    వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నవారిలో ఎక్కువ మంది డాక్టర్లు, నర్సులే ఉన్నట్టు తెలుస్తోంది. వైద్య వృత్తిలో ఉన్నవారే వ్యాక్సిన్‌ను అనుమానించడం మిగతా వారిలో భయాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. దీంతో డాక్టర్లు కాని ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ కూడా వ్యాక్సినేషన్‌కు దూరమైపోతున్నారు. రెండో రోజు వ్యాక్సిన్‌ సెంటర్లలో జనాభాను చూస్తుంటే ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

  • 17 Jan 2021 03:12 PM (IST)

    ఏమౌతుందోనన్న భయం, లక్ష్యానికి దూరం

    ఆంధ్రప్రదేశ్‌లో మొదటిరోజు 31వేల 570 మంది వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంది. కానీ! వ్యాక్సిన్‌ వేసుకున్నది మాత్రం కేవలం 19 వేల 108 మందే. మరి మిగతా వారు ఏమైనట్టు? అని ప్రశ్నిస్తే.. అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో మొదటిది టీకాపైన భయం. టీకా వేసుకుంటే దాని రియాక్షన్స్‌ ఎలా ఉంటాయో అనే టెన్షన్‌ చాలా మందిని తొలిరోజు వ్యాక్సినేషన్‌కు దూరం చేసింది.

  • 17 Jan 2021 03:01 PM (IST)

    కోల్‌కతాలో నర్స్‌కు వ్యాక్సిన్ సీరియస్ రియాక్షన్

    కోల్‌కతా బిసి రాయ్ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌కు టీకా సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. వాక్సిన్ తీసుకున్న తర్వాత 35 సంవత్సరాల నర్స్ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో వెంటనే విరుగుడు మందు ఇచ్చి ఆమెను దగ్గర్లోని నీల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ప్రస్తుతం నర్స్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

  • 17 Jan 2021 02:47 PM (IST)

    ఉత్తరప్రదేశ్ లో అత్యధికం, లక్షద్వీప్ లో అత్యల్పం

    కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,291 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఏపీలో 19,108 మందికి, కర్ణాటక రాష్ట్రంలో 13,594 మందికి, మహారాష్ట్రలో 18,328 మందికి వ్యాక్సిన్‌ వేయగా, అత్యల్పంగా లక్షద్వీప్‌లో 21 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేశారు.

  • 17 Jan 2021 02:16 PM (IST)

    ముందుకురాని సిబ్బంది, ఏలూరు జిల్లా ఆస్పత్రిలో నిలిచిన వ్యాక్సినేషన్ ప్రక్రియ

    పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. రెండో రోజైన ఆదివారం కొవిడ్ 19 వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు ఆసుపత్రి సిబ్బందితోపాటు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరూ కూడా ముందుకు రాలేదు. ఆదివారం ఉదయం పదకొండున్నర దాటినప్పటికీ, జాబితాలో ఉన్నవారెవరూ వ్యాక్సిన్ కోసం రాలేదు. మధ్యాహ్నం 12 గంటలు దాటాక కేవలం ఆసుపత్రిలోని ఇద్దరు నర్సులు మాత్రం వ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

  • 17 Jan 2021 02:15 PM (IST)

    సెక్యూరిటీ గార్డ్ క్షేమంగా ఉన్నారు : ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్

    కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్న హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం సదరు సెక్యూరిటీ గార్డ్ కి శరీరంపై అలర్జీ వంటి ప్రతికూల లక్షణాలు కనిపించాయి. దీంతో అతనికి ఎయిమ్స్ లో చికిత్స అందించారు. ఇప్పటివరకూ ఎయిమ్స్ లో ఒకరికి తీవ్రమైన, 51 కేసుల్లో చిన్ని చిన్న ప్రతికూలతలు కనిపించాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు.

  • 17 Jan 2021 01:09 PM (IST)

    తెలంగాణలోని 16 జిల్లాల్లో తొలిరోజు వంద శాతం టార్గెట్‌ పూర్తి

    తెలంగాణలోని 16 జిల్లాల్లో తొలిరోజు వంద శాతం టార్గెట్‌ని పూర్తి చేశారు వైద్యశాఖ అధికారులు. ఆదిలాబాద్‌, జనగామ, భూపాలపల్లి, గద్వాల, కరీంనగర్‌ జిల్లాల్లో నూటికి నూరు శాతం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నాగర్‌ కర్నూలు, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కూడా తొలిరోజు వంద శాతం టార్గెట్‌ని పూర్తి చేశారు. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా, వికారాబాద్‌, వనపర్తి, వరంగల్‌ అర్భన్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా తొలిరోజు అనుకున్న సంఖ్యలో అందరికీ వ్యాక్సిన్‌ అందించారు.

  • 17 Jan 2021 01:06 PM (IST)

    కోల్‌కతా బిసి రాయ్ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్స్‌కు టీకా సీరియస్ రియాక్షన్

    కోల్‌కతా బిసి రాయ్ ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌కు కరోనా టీకా సీరియస్ రియాక్షన్ ఇచ్చింది. వాక్సిన్ తీసుకున్న తర్వాత 35 సంవత్సరాల నర్స్ సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో వెంటనే విరుగుడు మందు ఇచ్చి ఆమెను దగ్గర్లోని నీల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ప్రస్తుతం నర్స్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

  • 17 Jan 2021 12:38 PM (IST)

    ఫస్ట్ డే గ్రాండ్ సక్సెస్ : కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ

    దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు పేర్కొంది. తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది. శనివారం టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టం చేసింది. 3,351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించింది. 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్‌, మరో 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్‌ టీకా వేసినట్టు తెలిపింది.

  • 17 Jan 2021 12:33 PM (IST)

    ఇవాళ, రేపు మహారాష్ట్రలో నో కరోనా వ్యాక్సిన్

    మహారాష్ట్రలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వ్యాక్సిన్ తీసుకునేందుకు పేరు నమోదు చేసుకునే ‘కోవిన్ యాప్’ లో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్ల 17, 18 తేదీలలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

  • 17 Jan 2021 12:27 PM (IST)

    తెలుగురాష్ట్రాల్లో రెండో రోజు జోరుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ

    తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఏపీలో 332 వ్యాక్సిన్ కేంద్రాలలో కరోనా టీకాలు వేస్తున్నారు. మొదటిరోజైన నిన్న ఆంధ్రప్రదేశ్‌లో 58% మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. కోవిన్ యాప్ మొరాయించడం, టీకా తీసుకునేందుకు లబ్దిదారులు ముందుకు రాకపోవడం వంటి అంశాలతో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియలో కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్న అత్యథికంగా గుంటూరు జిల్లాలో టీకాలు వేయగా, అత్యల్పంగా ‌ప్రకాశం జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీ జరిగింది.

Follow us on