చైనాను పట్టిపీడిస్తున్న కరోనా భూతానికి అక్కడి కాలుష్యం కూడా భయపడి మాయమైపోయిందట…అవును ఇది నిజమేనటండోయ్…ప్రపంచ దేశాలను గడగడలాడించిన కొవిడ్-19 వైరస్ కారణంగా కాలుష్యం తగ్గిపోయిందట…అయినా కరోనా వైరస్ కు కాలుష్యాన్ని తగ్గించే శక్తి ఉందా ? ఈ నమ్మలేని నిజాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా యూరోపియన్ అంతరిక్ష సంస్థలు తాజాగా వెల్లడించాయి. ఇంతకీ మనుషుల ప్రాణాలు హరిస్తున్నకరోనా వైరస్‌కి…చైనాలో వాయుకాలుష్యానికి లింకేంటో తెలుసా…? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే…
ఉత్పత్తి రంగంలో అత్యంత వేగం, అభివృద్ధి చెందిన దేశం ఏదైన ఉందంటే అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చైనా గురించే. ప్రపంచ దేశాల్లో అతి చవకగా వస్తుత్పత్తి జరిగేది చైనాలోనే. ముడి సరుకులతో పాటు కార్మిక శక్తి కూడా అతి తక్కువ ధరలకే లభ్యం అవుతున్న చైనాలో …పారిశ్రామిక ఉత్పత్తి కూడా భారీ స్థాయిలోనే జరుగుతుంది.. ఇక్కడ చౌక ధరలకే వస్తువులు తయారు అవుతుండటంతో పరిశ్రమలు పెరిగిపోయాయి. పారిశ్రమలు పెరిగిపోయి..వాటి నుంచి వెలువడే వ్యర్థాలతో ఆ దేశం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. అమెరికా తరువాత అత్యధికంగా కర్బన ఉద్గారాలు వెదజల్లే దేశంగా చైనా మారిపోయింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా చైనాలోని వూహన్‌లో పుట్టిన కరోనా వైరస్ దాటికి ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు.
కానీ, కరోనా విస్తరించినప్పటి నుంచి ఇది పూర్తిగా తగ్గిపోయిందట. దీనికి సంబంధించిన వాయుకాలుష్య చిత్రాలను విడుదల చేశారు. వాయుకాలుష్యానికి కారణమయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ వాయువుకు(NO2) సంబంధించిన ఈ చిత్రాల్లో జనవరిలో పసుపు రంగు ఉండగా.. ఇది ఫిబ్రవరి నాటికి పూర్తిగా తగ్గిపోయింది. గత కొన్ని రోజులుగా అక్కడ కరోనా దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడ కరోనా సోకుతుందోనని భయపడిపోయి ఇళ్లలోంచి బయటకు రావడమే మానేశారు. ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు విధించింది. అక్కడ పరిశ్రమల నుంచి ఉత్పత్తి కూడా పూర్తిగా తగ్గించారు. దీంతో పారిశ్రామిక రంగం పూర్తిగా కుదేలైంది. దీని కారణంగా ఆ దేశంపై ఆర్థిక భారం పడినా కాలుష్యం మాత్రం మునుపెన్నడూ లేని స్థాయిలో తగ్గింది.