అక్టోబర్ 11,12 తేదీల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు దక్షిణాది రాష్ట్రం తమిళనాడు వేదికగా నిలిచింది. చెన్నైకు అతి సమీపంగా ఉన్న కాంచీపురం జిల్లాలో ఎంతో చారిత్రక ప్రసిద్ధిగాంచిన మామల్లపురంలో జిన్‌పింగ్‌తో సహా భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు సాగించనున్నారు. ఎన్నడూ లేని విధంగా చైనా అధ్యక్షుడితో దక్షిణాదిన చర్చలు జరపడం ఆసక్తిని కలిగిస్తున్న అంశం. అసలు మామల్లపురాన్నే వేదికగా ఎందుకు ఎన్నుకున్నారు? ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? అనే విషయాలపై ప్రస్తుతం విపరీతమైన చర్చ జరుగుతుంది.
నాటి మహాబలిపురం.. నేడు మామల్లపురం
తమిళనాడు రాష్ర్టంలో ఉన్న కాంచీపురం జిల్లా మామల్లపురానికి ఎంతో చారిత్రక నేపథ్యముంది. ఈ ప్రాంతాన్ని గతంలో మహాబలిపురం అనే పేరుతో పిలిచేవారనే చారిత్రక ఆధారాలున్నాయి. పల్లవరాజుల పరిపాలనలో ఈ ప్రాంతం ఎంతో వైభవోపేతంగా విరాజిల్లింది. ఒక రకంగా సకల కళలను ఆరాధించే పల్లవ రాజుల మనో సంకల్పానికి అద్దం పట్టేలా తీర్చి దిద్దారు. మహాబలిపురం ఒకనాడు స్వర్ణయుగంగా వెలుగులు విరజిమ్మింది.
కట్టిపడేసే ద్రావిడుల శిల్పచాతుర్యం
మహాబలిపురం సముద్ర తీరప్రాంతం. ఇక్కడ గల దేవాలయాన్ని పల్లవరాజులు ఎంతో కళాత్మకంగా నిర్మించారు. భారతీయ పురాణ పాత్రలను, కథలను వివరించే ఎన్నో శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. వీటిని చూసేందుకు దేశ విదేశాలనుంచి ఎంతోమంది పర్యాటకులు తరలివస్తారు. ఈ దేవాలయం యునెస్కో గుర్తింపు కూడా పొందింది. ఈ గుడిని 7 వ శతాబ్దంలో రాజసింహన్ అని పిలువబడ్డ రెండవ నరసింహవర్మ నిర్మించారు.
మొదటి నరసింహవర్మ ఇక్కడ ఉన్న కొండలను తొలిచి గుహాలయాలను నిర్మిస్తే , రెండవ నరసింహవర్మ ఏకంగా గ్రానైట్ శిలలతో ఆలయాలను నిర్మించారు. వీటిని సెవెన్ పగోడాస్ అని కూడ పిలుస్తారు. అయితే ఇప్పుడు కనిపిస్తున్న ఆలయంతో పాటు మరో ఆరు ప్రత్యేక ఆలయాలు కూడా ఉండేవని, అవి సముద్రంలో కొట్టుకుని పోయినట్టు పురావస్తు నిపుణులు చెబుతున్నారు. పల్లవుల పాలన క్రీ.శ 650 నుంచి 750 వరకు ఎన్నో కళలు, పురావస్తు,శిల్ప సంపద, సాహిత్యం, వంటి ఎన్నో కళలను ఇక్కడి రాజులు పోషించారు. ఇక్కడ స్ధానిక జనాభా కంటే అధికంగా పర్యాటకులే కనిపిస్తుండటం ఈ ప్రాంతానికి గల మరో విశిష్టత.
సౌందర్యాల సముద్రతీరం తీరం
ఈ సముద్ర తీరంలో ఉన్న మరో ఆసక్తి గొలిపే శిల్పాల్లో పెద్ద పెద్ద ఏనుగులు పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ఇక్కడ మొత్తం ఎన్నో ఆలయాలు కనిపిస్తాయి. వాటిలో సముద్ర తీరంలో ఉన్న ఆలయం, ఐదు రథాలు వీటిని పంచ రథాలుగా కూడా పిలుస్తారు. వీటిని ఒకే శిలపై చెక్కడంతో ఏకశిలా శిల్పశైలికి అద్దం పడతాయి. వీటి నిర్మాణాన్ని ఆ కాలంలో ఏవిధంగా చేపట్టారనే విషయం ఇప్పటికీ అంతుచిక్కని అంశంగా ఆర్కియాలజిస్టులు చెబుతారు. ఇది ద్రావిడుల శిల్ప చాతుర్యానికి అద్దం పడుతుంది. అలాగే పులి గుహలు కూడా ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక అర్జునుడు తపస్సు చేసినట్టు చెప్పబడే ప్రదేశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు మహాబలిపురానికి 14 కిలోమీటర్ల దూరంలో మొసళ్లపార్క్ ఉంది. ఇక్కడ ఎన్నో రకాల మొసళ్లతోపాటు పాములను చూడవచ్చు. ఇది అతి భారత్‌లోనే అతిపెద్ద మొసళ్ల ఉత్పత్తి కేంద్రం.
మహాబలిపురంలో పర్యటించే పర్యాటకులను ఆకర్షించేది అక్కడ సముద్రమే. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ముందుకు వచ్చే అలలు భయాన్ని పుట్టిస్తాయి. ఈ సముద్ర తీరంలో లోతు కూడా ఎక్కువే.
ఇన్ని రకాల చారిత్రక ప్రాధాన్యత కలిగిన మామల్లపురంలో భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు కలిపి చర్చలు జరపడం చారిత్రాత్మకమే. సాధారణంగా ఇటువంటి సమావేశాలు దేశ రాజధానిలోనే జరుగుతూ ఉంటాయి. కానీ ప్రధాని మోదీ ఆలోచనా విధానానికి తగ్గట్టుగా ప్రకృతికి దగ్గరగా.. ఈ విధంగా చర్చలు సాగిస్తుండటం నిజంగా ఆశ్చర్యకరమే.