మానవ శరీరం ఆరోగ్యం ఉండటానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. అయితే ఆ కొవ్వులు ఎంత స్థాయిలో ఉండాలో అంతే ఉండాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలుంటాయి. HDL (హై డెన్ సిటీ లిపోప్రొటీన్) , LDL (లో డెన్ సిటీ లిపోప్రొటీన్) వాటిని మంచి, చెడు కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. మంచి కొలెస్ట్రాల్ HDL, ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు బాధ్యత వహిస్తుంది. హార్మోన్, విటమిన్ డి ఉత్పత్తి వంటివి చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌తో ప్రాణాలకే ముప్పు వాటిళ్లుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. దీంతోపాటు హైపర్‌టెన్షన్, డయాబెటిస్, బ్రెయిన్ స్టోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. సాధారణంగా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉందని చెప్పడానికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను రక్త పరీక్షతో తెలుసుకోవచ్చు. ఇక కొన్ని చిన్న సంకేతాలతో అధిక కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉందని గుర్తించవచ్చు. ఆ గురుతులు ఏంటో చూద్దాం..
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉంటే.. కళ్లలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఈ పరిస్థితిని శాంథెలాస్మా అంటారు. పసుపు, నారింజ రంగుల మైనపు పొర కళ్ల మూలలో రావడం ప్రారంభిస్తాయి. చర్మం కింద కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే దీనికి కారణం.
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తీవ్ర స్థాయికి పెరిగినప్పుడు, అది మీ కాళ్ల అకిలెస్ స్నాయువుపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుంది. మీ కాళ్ల ధమనులు మూసుకుపోతాయి. అప్పుడు తగినంత ఆక్సిజన్, రక్తం కాళ్ల దిగువ భాగానికి చేరదు. ఇది మీ కాలు బరువుగా, అలసిపోయినట్లు అనిపిస్తుంటుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న చాలా మంది ప్రజల కాళ్లలో మంటలు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. తొడలు లేదా పిక్కల భాగంలో నొప్పిగా ఉంటుంది. నడిచిన సమయంలో కాళ్ల నొప్పులు వస్తాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే.. నిద్రిస్తున్న సమయంలో కాళ్ల తిమ్మిరి అధికంగా వస్తుంటుంది. మడమ, ముందరి పాదాలు, కాలి వేళ్లలో తిమ్మిర్లు వస్తాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. మంచం మీద నుంచి కాళ్లు కిందకు వేయడం, కూర్చోవడం వంటి చర్యల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
రక్తం ప్రవాహంలో తగ్గుదల ఉన్నట్లయితే.. గోళ్లు, చర్మం రంగులో మార్పు వస్తుంది. పోషకాలు, ఆక్సిజన్‌తో కూడిన రక్త ప్రవాహం తగ్గడం వల్ల కణాలు సరైన పోషణను పొందలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. చర్మం మెరిసేలా, బిగుతుగా ఉంటుంది. కాలి గోరు మందంగా, నెమ్మదిగా పెరుగుతుంది.
చలికాలంలో పాదాలు ఎలా చల్లగా ఉంటాయో.. అధిక కొలెస్ట్రాల్ ఉంటే అంతే చల్లగా మీ పాదాలు ఉంటాయి. ఏడాది పొడవునా ఒకే విధంగా ఉంటాయి. వేసవిలో కూడా పాదాలను తాకితే పాదాలు చల్లగా అనిపిస్తాయి. ఇది పీఏడీ సూచన అని, ఇలా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అధిక కొలెస్ట్రాల్ వల్ల నాలుక కూడా ప్రభావితమవుతుంది. హెయిరీ టంగ్ అనే దుష్ప్రభావం ఏర్పడుతుంది. నాలుక ఉపరితలంపై ఉండే చిన్న బుగ్గలు పెద్దవిగా, రంగులేనివిగా మారుతాయి. ఈ మార్పులు నాలుకపై వెంట్రుకలు ఉన్న తరహాలో కనిపిస్తాయి. ఇవి తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తాయి. ఇదేమంతా హానికరం కాదు. కానీ దుర్వాసనకు దారితీస్తాయి. నోట్లో ఒక చెడు రుచి అనిపిస్తుంది. నాలుక కొన ఊదా నీలి రంగులోకి మారుతుంది. ఇవి రక్తం స్తంభించిపోయింది అనడానికి సూచికలు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..