వాన నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది..? మీరు తప్పక తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవే..
వర్షాకాలంలో చాలా మందికి వాన నీటిని తాగే అలవాటు ఉంటుంది. పైగా ఇవి స్వచ్చమైనవి అని అనుకుంటారు. కానీ, ఈ వర్షపు నీరు తాగడం వల్ల అమృతం లాంటి ఆరోగ్యం పక్కన పెడితే.. నేరుగా హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు వర్షపు నీరు తాగడం సేఫేనా? ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్నప్పుడు వర్షంలో తడుస్తూ ఆ చినుకులను తాగడం మనలో చాలా మందికి అలవాటే. ప్రకృతి నుండి నేరుగా వచ్చే నీరు కాబట్టి ఇది చాలా స్వచ్ఛమైనదని, ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు. అయితే ఈ వర్షపు నీరు ఎల్లప్పుడూ తాగడానికి సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సంజయ్ వినాయక్ దీనిపై స్పందిస్తూ.. ‘‘వర్షపు నీరు సహజ సిద్ధమైనదే అయినప్పటికీ, దానిని ఎల్లప్పుడూ సురక్షితమైనదిగా లేదా తాగడానికి మంచిదిగా భావించలేం. గాలిలో ఉండే కాలుష్యం, ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌లు వర్షపు నీటిని కలుషితం చేస్తాయి. కాబట్టి ఫిల్టర్ చేయకుండా లేదా మరిగించకుండా వర్షపు నీటిని అస్సలు తాగకూడదు. ముఖ్యంగా తొలి వర్షపు నీటిని అస్సలు ముట్టుకోకూడదు” అని స్పష్టం చేశారు.
వర్షపు నీరు తాగేటప్పుడు చేసే 3 పెద్ద తప్పులు..
నేరుగా నోరు తెరిచి తాగడం: ఆకాశం వైపు చూస్తూ నోరు తెరిచి నీటిని తాగడం పెద్ద పొరపాటు. గాలిలో పేరుకుపోయిన పొగ, రసాయనాలు ఆ నీటితో కలిసి మన శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.
ఆల్కలైన్ వాటర్ అనే భ్రమ: వర్షపు నీరు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటుందని, అది తాగితే బ్లడ్ pH లెవెల్స్ మెరుగవుతాయని ఇంటర్నెట్‌లో కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ సైన్స్ ప్రకారం.. మనం ఏం తిన్నా, తాగినా మన శరీరం బ్లడ్ pH ని 7.4 వద్దే ఉంచుతుంది. పైగా వర్షపు నీరు ఆల్కలైన్ కాదు, అది కొద్దిగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది.
మరిగించకుండా స్టోర్ చేయడం: చాలా మంది బకెట్లలో వర్షపు నీటిని పట్టి నేరుగా తాగేస్తుంటారు. ఫిల్టర్ చేయకుండా, మరిగించకుండా ఇలా చేయడం వల్ల కడుపు జబ్బులను కొనితెచ్చుకున్నట్లే.
తొలి వర్షపు నీరు ఎందుకు ప్రమాదకరం?
చాలా రోజుల తర్వాత కురిసే మొదటి వర్షంలో గాలిలోని కాలుష్యం, విషపూరిత వాయువులు, యాసిడ్స్ పూర్తిగా కలిసి ఉంటాయి. వాతావరణం అప్పటికప్పుడు క్లీన్ అవ్వడం వల్ల ఆ నీరంతా కలుషితంగా మారుతుంది. అందుకే మొదటి వర్షపు నీటిని తాగడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం.
వర్షపు నీరు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు..
కలుషితమైన వర్షపు నీటిని నేరుగా తాగడం వల్ల కింది సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
- కడుపు ఇన్ఫెక్షన్లు, వాంతులు
- తీవ్రమైన విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్
- టైఫాయిడ్, కలరా వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు
- హెపటైటిస్-A (కామెర్లు) వచ్చే ప్రమాదం
వర్షపు నీటిని వాడాలనుకుంటే ఏం చేయాలి?
ఒకవేళ మీరు వర్షపు నీటిని ఉపయోగించాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
బాగా మరిగించాలి: నీటిని బాగా మరిగించడం వల్ల అందులోని బ్యాక్టీరియా, వైరస్‌లు చనిపోతాయి.
వాటర్ ఫిల్టర్ వాడాలి: నీటిలోని భారీ లోహాలు, రసాయనాలను తొలగించడానికి మంచి వాటర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ను ఉపయోగించాలి.
ప్రత్యామ్నాయంగా వాడండి: నీటిని సరిగ్గా శుద్ధి చేయలేకపోతే, ఆ నీటిని తాగడానికి కాకుండా మొక్కలకు పోయడానికి, బట్టలు ఉతకడానికి లేదా స్నానం చేయడానికి ఉపయోగించడం మంచిది.
