
దురదృష్టవశాత్తూ మన దేశంలో అవగాహన లేకపోవడం, పరీక్షలు చేయించుకోవడానికి మొహమాటపడటం వల్ల చాలా మంది మహిళలు చివరి దశలో ఆసుపత్రికి వస్తున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అసలు ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మన శరీరంలో జరిగే ఎలాంటి మార్పులు ప్రమాదానికి సంకేతాలు?
గర్భాశయ ముఖద్వారం లేదా సెర్విక్స్ అనేది గర్భాశయానికి, యోనికి మధ్య ఉండే ఒక కండరాల ద్వారం. ఇది మన శరీరంలో ఒక మల్టీ టాస్కర్ లాగా పనిచేస్తుంది. బయటి ఇన్ఫెక్షన్లు గర్భాశయంలోకి వెళ్లకుండా రక్షణ కవచంలా అడ్డుకుంటుంది. పీరియడ్స్ సమయంలో రక్తం బయటకు వెళ్లేలా చూస్తుంది. అంతేకాకుండా, శిశువు జనన సమయంలో ఇది వ్యాకోచించి ప్రసవం సులభంగా జరిగేలా చేస్తుంది. ఇంతటి కీలకమైన సెర్విక్స్ ఆరోగ్యంగా ఉంటేనే మహిళల పునరుత్పత్తి వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.
గర్భాశయానికి వచ్చే సమస్యలు కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, సాధారణ వాపు నుంచి రకరకాల ఇబ్బందులు కలగవచ్చు. క్యాన్సర్ రావడానికి ముందు కణాలలో జరిగే మార్పు గర్భాశయ డిస్ప్లాసియా. ఇది కంటికి కనిపించదు, కేవలం పరీక్షల ద్వారానే బయటపడుతుంది. గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV). ఈ వైరస్ చాలా కాలం పాటు శరీరంలో ఉంటే అది క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. గర్భాశయంలో పెరిగే చిన్న గడ్డలు. ఇవి అన్నీ క్యాన్సర్ కానప్పటికీ, వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షించుకోవడం ఉత్తమం.
మీ శరీరంలో ఈ క్రింది మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. యోని నుండి విపరీతమైన స్రావం కావడం, దాని రంగు లేదా వాసనలో మార్పు రావడం ప్రధాన లక్షణాలు. పీరియడ్స్ మధ్యలో లేదా శృంగారం తర్వాత రక్తస్రావం కావడం, శృంగార సమయంలో విపరీతమైన నొప్పి రావడం ప్రమాద సంకేతాలు. పొత్తికడుపు లేదా నడుము భాగంలో మొండి నొప్పి వేధిస్తున్నా అది గర్భాశయ సమస్యే కావచ్చు.
గర్భాశయ క్యాన్సర్ అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు. ఇది శరీరంలో కణాల మార్పు ద్వారా నెమ్మదిగా మొదలవుతుంది. మనకు సరైన అవగాహన ఉండి, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటే దీని నుంచి 100 శాతం కోలుకోవచ్చు. మీ శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను కూడా విస్మరించకండి.