Cancer: అసలు మనిషి శరీరంలో క్యాన్సర్ ఎలా పుడుతుంది..?

క్యాన్సర్ అంటే ఏమిటి, అది ఎలా పుడుతుంది, ఎన్ని రకాలు అనే భయం చాలా మందిలో ఉంటుంది. కణాల అనియంత్రిత పెరుగుదలతో శరీరంలో క్యాన్సర్ మొదలవుతుంది. దీనికి చరిత్ర, వివిధ వ్యాప్తి మార్గాలు, అవయవాలు, కణాల ఆధారంగా వర్గీకరణలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు ఈ వ్యాధిపై కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి.

Cancer: అసలు మనిషి శరీరంలో క్యాన్సర్ ఎలా పుడుతుంది..?
Cancer

Updated on: Mar 04, 2026 | 9:52 PM

క్యాన్సర్ అనే పేరు వినగానే చాలా మందికి మదిలో భయం మొదలవుతుంది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? అది మానవ శరీరంలో ఎలా పుడుతుంది? ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి? వాటిలో ఏది అత్యంత ప్రమాదకరమైనది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. . క్యాన్సర్ ప్రస్తావన గ్రీకు, రోమన్ పుస్తకాల్లో ఉంది. క్రీస్తు పూర్వం 470, 370 మధ్యలో గ్రీకు వైద్యానికి పితామహుడిగా భావించే హిప్పోక్రటిస్ తొలుత క్యాన్సర్‌కు సంబంధించి కార్సినోస్ లేదా కార్సినోమా అనే పదాలను వాడారు. కార్సినోస్ అంటే గ్రీకు భాషలో పీత అని అర్థం. క్యాన్సర్ రోగులలో కనిపించే గట్టి గడ్డలు, అవి ఒక భాగం నుంచి మరో భాగానికి వ్యాపించడం, తుదిదశలో భరించలేని నొప్పి వంటి లక్షణాలను పీత గట్టి వెనుక భాగం,  కాటుతో వచ్చే నొప్పికి పోల్చడం ద్వారా ఈ పేరు వచ్చింది. గ్రీకు ఫిజిషియన్ గాలిన్ అంకోస్ (గ్రీకులో ఉబ్బడం) అనే పదాన్ని ప్రసిద్ధం చేశారు. రోమన్ ఫిజిషియన్ సెల్సస్ తొలుత లాటిన్ పదం క్యాన్సర్‌ను వాడారు. 17వ శతాబ్దంలో మైక్రోస్కోప్‌ను కనుగొన్న తర్వాతే క్యాన్సర్‌పై పరిశోధనలు మొదలయ్యాయి. 19వ శతాబ్దంలో వైద్య పురోగతితో క్యాన్సర్ రహస్యం మరింత బయటపడటం మొదలైంది.

క్యాన్సర్ ఎలా పుడుతుంది?

మానవ శరీరం కోట్లకొద్దీ కణాలతో రూపొందుతుంది. కొత్త కణాలు పుట్టడం, వాటి పనులు నిర్వర్తించడం, వాటి పని పూర్తయిన తర్వాత నశించడం, మళ్ళీ కొత్త కణాలు పుట్టడం అనేది శరీరంలో జరిగే ఒక నియంత్రిత ప్రక్రియ. కణాలలోని జన్యువులు ఈ ప్రక్రియను నియంత్రిస్తాయి. అయితే, కార్సినోజెన్ ఎక్స్‌పోజర్, ఇన్ఫెక్షన్లు (వైరల్ ఇన్ఫెక్షన్లు), లేదా వంశపారంపర్యం వంటి కారణాల వల్ల ఈ జన్యువులలో మ్యుటేషన్ సంభవిస్తే, కణాలు నియంత్రణ కోల్పోయి అనియంత్రిత స్థాయిలో పెరుగుతాయి. వాటి పరిమాణం, సహజత్వంలో మార్పులు సంభవిస్తాయి. దీన్నే క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ కణాలు నశించవు, వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటూ శరీరంలో ఒక భాగం నుంచి మరో భాగానికి విస్తరించి, ఇతర కణాలను, అవయవాలను దెబ్బతీస్తాయి. సాధారణ గడ్డలకు భిన్నంగా క్యాన్సర్ కణితులు శరీరంలోని ఏ భాగానికైనా విస్తరించగలవు.

క్యాన్సర్ కణాలు శరీరంలో ఒక చోటు నుంచి మరో చోటుకు పలు విధాలుగా వ్యాపిస్తాయి:

1. నేరుగా వ్యాపించడం: క్యాన్సర్ కణాలు పక్కనున్న కణాలపై లేదా అవయవాలపై నేరుగా దాడి చేస్తాయి.

2. లింఫాటిక్ విస్తరణ: క్యాన్సర్ కణాలు లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్‌లోకి ప్రవేశించి లింఫ్ నోడ్స్‌లో పెరుగుతాయి.

3. హెమటోలాజికల్ విస్తరణ: రక్తనాళాల ద్వారా క్యాన్సర్ కణాలు ఊపిరితిత్తులు, ఎముకలు, కాలేయం, మెదడులోకి వ్యాపిస్తాయి.

క్యాన్సర్ వర్గీకరణ: క్యాన్సర్‌ను అవయవాన్ని బట్టి లేదా క్యాన్సర్ కణాలను బట్టి వర్గీకరిస్తారు. అవయవాన్ని బట్టి ఏ అవయవంలో మొదలవుతుందో దాని బట్టి పేరు పెడతారు (ఉదాహరణకు, ఊపిరితిత్తుల క్యాన్సర్, పేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్).

కణాలను బట్టి:

1. కార్సినోమా: ఇది చాలా సాధారణమైన క్యాన్సర్. శరీరంలోని ఎపిథీలియల్ కణాలు లేదా అవయవాల్లో పుడుతుంది. అడినోకార్సినోమా (ఊపిరితిత్తులు, రొమ్ము), బాసల్ సెల్ కార్సినోమా (చర్మం), ట్రాన్సిషనల్ కార్సినోమా (కిడ్నీ) దీని కిందకు వస్తాయి.

2. సార్కోమా: బంధన కణజాలం (ఎముకలు, కండరాలు, కొవ్వు) మరియు సహాయక కణాలలో సంభవిస్తుంది.

3. మెలనోమా: చర్మంపై మెలనిన్‌ను ఉత్పత్తి చేసే మెలనోటైప్ కణాలలో వస్తుంది. ఇది శరీరంలో వేగంగా వ్యాపించే క్యాన్సర్‌గా పరిగణిస్తారు.

4.బ్రెయిన్ ట్యూమర్: గ్లియోబ్లాస్టోమా, ఆస్ట్రోసైటోమా వంటి క్యాన్సర్లు దీని కిందకి వస్తాయి.

బ్లడ్ క్యాన్సర్లు:

1. లుకేమియా: ఎముక మజ్జలో తెల్ల రక్తకణాల వృద్ధి సరిగ్గా జరగకపోవడం వల్ల ఇమ్మెచ్యూర్ సెల్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇందులో ట్యూమర్లు కనబడకపోవచ్చు.

2. లింఫోమా: లింఫ్ నోడ్స్, లింఫోసైట్లు అనియంత్రిత స్థాయిలో పెరిగి లింఫోనోడ్ ట్యూమర్లను కలిగిస్తాయి.

3. మల్టిపుల్ మైలోమా: రోగనిరోధక వ్యవస్థకు బాధ్యత వహించే ఎముక మజ్జలోని ప్లాస్మా కణాలు అనియంత్రితంగా పెరిగి ఎముకలను దెబ్బతీస్తాయి. క్యాన్సర్ రకాలలో కొన్ని చాలా దూకుడుగా, వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రమాదకరంగా మారతాయి. ఉదాహరణకు, మెలనోమా వేగంగా వ్యాప్తి చెందగలదు. ఏ క్యాన్సర్ అయినా చివరి దశకు చేరితే ప్రమాదకరమైనదే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు క్యాన్సర్ వంటి వ్యాధులను జయించవచ్చనే ఆశను కలిగిస్తున్నాయి.

 

Follow Us