ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ చిత్రాలు మాత్రమే అనుకునే వారు. మరీ ముఖ్యంగా విదేశాల్లో ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే భావనే ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ మాత్రమే కాదని నిరూపిస్తున్నాయి సౌత్ మూవీస్. ఒకప్పుడు హిందీ సినిమాలు దక్షిణాది భాషల్లో విడుదలై మంచి విజయాలను నమోదు చేసుకునేవి.
కానీ ప్రస్తుతం దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిలో దుమ్మురేపుతున్నాయి. ఆ మాటకొస్తే ఇక్కడితో సమానంగా కలెక్షన్లు రాబడుడుతున్నాయి. బాహుబలితో మొదలైన ఈ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్రాలకు ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా మార్కెట్ లభిస్తోంది. నార్త్ ఆడియన్స్ కూడా సౌత్ హీరోల చిత్రాలకు ఫిదా అవుతున్నారు.
మొన్నటికి మొన్న అల్లు అర్జున్ పుష్ప2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు బిహార్‌లో వచ్చిన స్పందనే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. బాలీవుడ్ మేకర్స్ కూడా ఇలా బహిరంగ ఈవెంట్స్ నిర్వహించని చోట పుష్ప సరికొత్త అధ్యయనానికి తెర తీసింది. దీంతో రోజురోజుకీ సౌత్ మూవీలపై బాలీవుడ్‌లో అంచనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే ఇంతకీ సౌత్ మూవీస్‌ను అక్కడి ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వచ్చింది. ఒకప్పడు యాక్షన్, ఛేజింగ్ వంటి మూవీలవైపు ఆసక్తి చూపించే వారు కానీ ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులపై గ్లోబల్ సినిమా ప్రభావం పడుతోంది. కొరియన్ వెబ్ సిరీస్‌లు మొదలు స్కాండినేవియాకు చెదిన థ్రిల్లర్ సినిమాలను చూస్తున్నారు. దీంతో కథలో వినూత్నత ఉంటేనే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. మూస పద్ధతిలో వచ్చే సినిమాలను నిర్ధాక్షణ్యంగా రిజక్ట్ చేస్తున్నారు.
అయితే ఇందులో సౌత్ సినిమా సక్సెస్ అవుతోందని చెప్పాలి. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్న మెజారిటీ చిత్రాల్లో హీరోయిజంతో పాటు కథకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. హీరో సెంట్రిక్‌తో పాటు సినిమాలో కథ కూడా హీరోగా మారుతోంది. అందుకే ఇలాంటి చిత్రాలపై ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. దీనికి పుష్ప2 బెస్ట్ ఉదాహరణగా చెప్పొచ్చు.
ఇందులో హీరో ఒక కూలీ వాడిగా కనిపిస్తాడు. సాధారణ కూలీ ఎదిగిన క్రమాన్ని చూపించే కథ అద్భుతంగా సాగుతుంది. అల్లు అర్జున్ లాంటి బడా స్టార్ ఉన్నా అది ఎక్కడ కథనాన్ని డామినేట్ చేయదు. హీరో ఎదుర్కొన్న కష్టాలు, పడ్డ అవమానాలు వాటిని ఎదురించి ఎదిగిన తీరు కనిపిస్తుంది. ఈ కథే ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.
ఇక కాంతార సినిమా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషం తెలిసిందే. ఒక మారుమూల గ్రామంలో జరిగే కథను ఇతివృత్తంగా చేసుకొని దర్శకుడు ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రమే పరిమితం కాకుండా లోతైన సందేశాన్ని ఇందులో దర్శకుడు చూపించాడు. అందుకే హీరోయిజంతో సంబంధం లేకుండా ఈ సినిమా విజయాన్ని సాధించింది. ఇక మలయాళంకు చెందిన దృశ్యం చిత్రం కూడా బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఇందులో కూడా కథే హీరో. సాధారణ వ్యక్తిగా కనిపించే వ్యక్తి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అసాధారణమైన పనులు చేసే కథ ఇది. ఇక బాహుబలి ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో బడా స్టార్‌లు ఉన్నా కథ కూడా ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఉన్నాయి.
అయితే గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో ఈ అంశం మిస్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. హీరోయిజానికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కథ గురించి మేకర్స్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అందుకే బాలీవుడ్ చిత్రాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయని అంటున్నారు. మొత్తం మీద సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు.? ఎంత బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారన్న దాని కంటే కథే ముఖ్యమనే సందేశాన్ని ప్రేక్షకులు మేకర్స్‌కు ఇస్తున్నారని స్పష్టమవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..